ఈ నల్లని రాలలో ఏ దేవత దాగెనో!

 



అయోధ్య బాలరాముడిని చెక్కిన శిల్పి ఏమన్నాడో విన్నావా? 

ఇదిగో ఇది నేను ఉపయోగించబోయే శిల. 
నేనేమనుకుంటానంటే, ఇందులో రాముడున్నాడు.
 ఈ శిలలోంచి నా రాముడు బయటికి వచ్చేలా భగవంతుడే నాచేత చెక్కిస్తాడు, ఆ రూపాన్ని నాకు తట్టేలా చేస్తాడు అని. 
ఎంత గొప్ప మాట అన్నాడో! ఒక గొప్ప భారతీయ శిల్పిలా మాట్లాడేడు. 

అసలు ఎప్పుడైనా శిల్ప శాస్త్రం అనేది మనకు ప్రామాణిమైనది ఒకటుందని ఎఱుక ఉందా నీకు?

 మన ప్రాచీన దేవాలయాల్లో చెక్కడాలు గమనించావా?
ఆ శిల్పాలు చెబుతున్న కథలేమిటో ఊహించావా?
అవి పౌరాణిక గాథల్లోని సన్నివేశాలేమో కనిపెట్టావా?
అవి ఏ రాజుల చరితలో, ఏ రాణీ గాథలో ఆనవాలు పట్టావా?

అసలు నువ్వసలు ఆ శిల్పాలకు విలువనిచ్చావా?
వాటిపై చూపు నిలిపావా?

దక్షిణ భారతదేశ శిల్పాలకి, దేవాలయ నిర్మాణానికి, ఉత్తర భారత నిర్మాణాలకీ తేడా పరిశీలించావా?
శిల్పంలో ఉపయోగించే రాయి, ప్రాంతానికీ ప్రాంతానికీ మారుతోందని గ్రహించావా?

శిల్పం దేనిదో, ఎవరిదో దాన్ని బట్టి ఒడ్డు, పొడవు కొలతలు అన్నీ శాస్త్ర ప్రకారం మారుతూ ఉంటాయని అందులోని సూక్ష్మాంశాలను మతింపు చేసుకున్నావా?

దేవతాశిల్పం చెక్కిన తరువాత దానికి ప్రాణ ప్రతిష్ట అంటే ఎంతెంత క్రతువు ఉంటుందో తెలుసుకున్నావా?

దేవాలయాలు ప్రాచీనమైన కొద్దీ ఆ దేవతామూర్తులు శక్తి పెరుగుతూ పోతుందని, అందుకే ప్రాచీన దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడున్న సూక్ష్మదేవతా శక్తి మూలాన మానవులకు అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుందని అనుభవించి తెలుసుకున్నావా? 

ప్రాచీన దేవాలయాల చరిత్రను అక్కడి స్థానికులనో, అర్చకులనో అడిగి రాసుకున్నావా?
అక్కడ ఉన్న శిలాశాసనాలను చదవ ప్రయత్నించావా?

గాలి, వెలుతురు రావడానికి చేసిన ఏర్పాట్లు ఏమిటో, 
అక్కడి అరుగులు,
బలి పీఠం,
స్థంభాలు, 
వాటిపైన చెక్కిన యాళి, 
ఏనుగులు, 
గండభేరుండాలు,
అశ్వాలు,
రథాలు,
యోధులు, 
మదనికలు,
విష కన్యలు,
ఋషులు,
శివ లింగాలు,
దేవ కన్యలు,
యక్షులు,
రాక్షసులు,
దేవతలు,
నాగులు,
గంధర్వులు 
మొదలైనవి 
తరచి తరచి చూసి,
తన్మయం పొంది, 
విస్మయం చెంది, 
గుండెల నిండా ఆనందం నింపుకున్నావా?

లేదు. లేనే లేదు.
లేదంటే నువ్వు భారతీయుడవే కాదు.
అసలు భారతదేశం వాడివి కావంతే!



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి