నా వలననే జన్మించెనే మోహముల్?

 



ధన్యున్ లోకమనోభిరాముఁ గుల విద్యా రూప తారుణ్య సౌ

జన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే

కన్యల్గోరరుకోరదే మును రమాకాంతా లలామంబు రా

జన్యానేకపసింహనా వలననే జన్మించెనే మోహముల్?


ఆయనేమో మహారాజు. 

ఈవిడేమో రాజకుమార్తె.

కనుక నా వలననే జన్మించెనే మోహముల్‌ అని ప్రేమలేఖ రాసి పడేస్తే,విద్యా రూప తారుణ్య సౌజన్యశ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితుడు కనుక వెంఠనే రథం మీద వచ్చి, అక్కడిన్న రాజులందరినీ డిష్యుం డిష్యుం అని కొట్టేసి ఆ అందాల భామను చేపట్టాడు. 


కానీ లోకంలో అందం ఉంటే గుణం ఉండదు, అందము,గుణము ఉంటే ధైర్యం ఉండదు,

అందము,గుణము,ధైర్యము ఉంటే తనను ప్రేమించిన కన్య పట్ల అనురక్తి ఉండదు!


 కానీ మరి ప్రేమ లేఖలు వ్రాసే కన్యలంతా రుక్మిణులు కాదు కనుక వారూ వీరూ కూడా సర్దుకుపోవడం లోకంలో కద్దు. 


రుక్మిణీ కల్యాణం పారాయణం చేసిన కన్యకామణులందరికీ కృష్ణుడిలాంటి భర్త లభిస్తాడా అంటే అది కుదరదు కనుక వచ్చిన భర్తను కృష్ణుడిగా తనను తాను రుక్మిణిగా భావించుకుంటే అంతా సరి సరి. 


ఇంతకీ రుక్మిణీ కల్యాణం పారాయణ వల్ల నచ్చని వరుడు తప్పిపోయి నచ్చిన వరుడితో  వివాహం జరుగుతుందని పెద్దలు చెబుతారు. 


ఈ మహాభారత గాథలోనే నచ్చని వరుడితోను,నచ్చిన వరుడితోను కూడా వివాహం తప్పిపోయిన కన్యక కాశీరాజు కుమార్తె అంబ. ఆమె తాపాగ్ని కోపాగ్నిగా మారి శాపాగ్నియై ఈ తప్పిదానికి కారణమైన భీష్ముని దహించింది. 


ఇలాంటి శాపాన్ని reverse లో  లేడీ ఊర్వశి చేత పొందిన వాడు అర్జునుడు. జరామరణాలు, బంధత్వాలు లేని దేవతాస్త్రీని పట్టుకుని నువ్వు నాకు తాతమ్మవు, నాయనమ్మవు అని ఓవరాక్షన్‌ చేస్తాడు. దాంతో ఆవిడకి ఒళ్ళు మండి శపించి పారేసింది. 


పూర్వం హంసలు,చిలకలు,పావురాళ్ళు మొదలైనవి ప్రేమలేఖలు ట్రాన్స్ పోర్ట్ చెయ్యడానికి పనికొచ్చినట్టుగా తెలుస్తోంది. 


శ్రీనాథుడు కూడా ఓ చిన్ని వయ్యారికి ప్రేమలేఖ పద్యాన్ని వ్రాసి పంపినట్టే ఉంది-


శ్రీమదసత్య మధ్యకును జిన్ని వయారికి ముద్దులాడికిన్
సామజయానకున్ మిగుల జక్కని యింతికి మేలు గావలెన్
మేమిట క్షేమ మీవరకు మీ శుభవార్తలు వ్రాసి పంపుమీ
నా మది నీదు మోహము క్షణంబును దీరదు స్నేహబాంధవీ



ఇక, ఇదే నా మొదటి ప్రేమలేఖ, ప్రేమలేఖ రాసా ఎదకంటి ఉంటది, నా ఊహల జాబిలి ఊసులు,కురిపించెను ప్రేమలేఖలు అంటూ సినిమా పాటల రచయితలు ప్రేమలేఖలను తమ పాటల్లో విరివిగా వ్రాసుకున్నారు. 


అవును గానీ, లిపి లేని కంటి బాసకు మళ్ళీ కాగితము కలము తీసుకుని ప్రేమ లేఖ వ్రాయడమెందుకూ? 




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి