యథా కాష్టంచ కాష్టంచ
ఔర! ప్రభాతశైల సానూపల నీలపాళికల నొత్తకయే స్రవియించు ఆ హిమానీ పరగాయనీ గళ వినిశ్రుత మాధురి మంటి కీడ్తురా?
ఈడ్తురు.
మంటికీడ్తురు.
బురద కీడ్తురు.
ప్రేమని చీకటి గదుల్లో లాగ జూతురు.
పంజరములో బంధింపజూతురు.
ఈర్ష్యా పిశాచిని నిద్దుర లేపుదురు.
సుఖశాంతులను హరింపజేతురు.
పక్షినని పాడగలనని ప్రణయ వీధి
నిత్య లీలావిహారముల్ నెరపుదునని
పక్షముల దూల్చి బంధించి పంజరాన
గానమును బ్రాణమ్ము హరింప బూనినారు
అని వగచి ఏమీ లాభం లేదు అమ్మీ.
ప్రేయసి సోయగమ్మునకు లేదు శరీరము అని అనుకునే వారు బహు కొద్ది.
శ్రీకృష్ణ ఉవాచ: పార్ధా! ప్రేమ.అభిమానం.ఆరాధన. అన్నీ స్వకపోలకల్పిత మనో వికారాలు అని నువ్వు తెలుసుకోగలిగితే చిత్త భ్రాంతులన్నీ వాటంతట అవే తొలగిపోయి మనస్సుకి స్వస్థత చేకూరగలదు.
కన్ను మెచ్చిన వారిని ఆకాశానికెత్తడాలు.
ఊహాభవంతులు కట్టడాలు.
అఖండ ఆరాధనా దీపం వెలిగించడాలు.
ఈ మనో దౌర్బల్యానికే,చిత్త చాంచల్యానికే రకరకాల పేర్లు పెట్టుకున్నారమ్మడూ,పనీపాటు లేని భావుకులు.
దానికోసం తన పని మీద తాను పోతున్న చంద్రుడిని,తన దారిన తాను పరిగెడుతున్న పిల్లగాలిని,తన ప్రకృతి ధర్మం తాను నిర్వహిస్తున్న మబ్బులని,పువ్వులని-వడ్డీ లేని అరువు తెచ్చుకోబోతారు.
అందుకోసం వేగీ వేగని వడియాల్లాంటి,ఉడికీ ఉడకని బంగాళా దుంపల్లాంటి అసందర్భ ప్రేలాపలన కవిత్వం ఒకటి ప్రజల మీదకు గురి చూసి మరీ వదులుతారు. హతవిధీ!
చిరిగిపోయిన జీన్సు పాంటు అమ్మడిని చూసి - యాండీ,అవుతే మీరు మంచి పొస్తకం కొనుక్కున్నారా? అని అడుగుదామనుకునేంత అమాయకురాలివి నువ్వు.
ఏ మృగతృష్ణనో వలచి ఏడ్చెదవేల?
మింట నెచటనొ మెరయు చుక్కల
కంట జూచితి కాంక్షలూరగ
కాంక్షలూరిన కొలది చుక్కలె
కాంచి బ్రతుకే గడిపితిన్
అవును. ఆశనిరాశలతో వేగిపోయే మనుషులని కాక-
అలా చుక్కలని కాంచి,వీలైతే ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చెయ్యి.
లోకమంతా అల్లుకున్న ప్రకృతిని కమ్ముకో మనసులో.
పెంజీకటి కవ్వల ఏకాకృతి వెలుగునతనిని ధ్యానించు,సదా.
కంటికి కనిపించని మానసిక సౌకుమార్యానికి విలువ ఉన్నదా లోకంలో?
ఏ కథ విన్నా - ఆమె రూపలావణ్యాలకు ముగ్ధుడైన కధానాయకుడే.
కోటేరులాంటి ముక్కు,దొండ పండులాంటి పెదవులు,అద్దాల్లాంటి చెక్కిళ్ళు.
అయ్యబాబోయ్,అధర కాగితం మీద మధుర సంతకమట!
దానికన్నా చెక్కు బుక్కు మీది సంతకం లోకానికి మిక్కిలి ప్రయోజకారి.
మెచ్చనంటావీవు,నీవిక
మెచ్చకుంటే మించి పాయెను
కొయ్య బొమ్మలె మెచ్చు కళ్ళకు
కోమలులు సౌరెక్కునా?
కొయ్య బొమ్మ ఒకానొక సందర్భంలో కోమలిగా కనిపిస్తే తప్పులేదు.
కోమలి కొయ్య బొమ్మగా తోస్తేనూ.
సినిమాల్లో,పుస్తకాల్లో,రచనల్లో -
ప్రేమ తిని, ప్రేమ తాగి ప్రేమలో బతుకుతున్న జీవులు.
మనోవికారాలే మానవ జీవన పరమావధిగా భావిస్తున్న మనుష్యులు.
రచయితలు,రచయిత్రులు వేయించి పోయడానికి కావాల్సినన్ని మిర్చి బజ్జీలు.
స్త్రీ పురుష సంబంధాలను గూర్చి పుంఖాలు పంఖాలుగా కేవలం చపాతీలు చేసినంత తేలికగా రాస్తారు.
సినేమాలు తీస్తారు మాడిపోయిన మసాలా దోసెల్లాటివి.
అజీర్ణ వ్యాధి వచ్చి వేగి పోతున్న కధానాయకుడు ,పైత్యం ప్రకోపించిన కధానాయకి.
తన పనిలో నిమగ్నమైన శాస్త్రవేత్తకి,
పట్టుదలతో పర్వత శిఖరానికి ఎగబాకుతున్న పర్వతారోహకుడికి,
తపస్సులో మునిగిపోయిన హిమాలయ యోగికి,
వినిపించావో తెలుగు సినిమా ప్రేమ కథలని,
ఫక్కున నవ్వి పోతారో?
ప్రేమ ముందు గొడవ.
ప్రేమ తర్వాత గొడవ.
ప్రేమలో గొడవ.
గొడవ పడడమే గొడవ.
కాదు కాదు,గొడవ పడడమే ప్రేమ.
దూరస్థో జ్ఞాయతే సర్వః పర్వతే జ్వలనాదివత్
చూడమణిః శిరస్థోపి దృశ్యతే న స్వచక్షుషా.
ఈ ప్రేమలు పేట్రేగడానికి,అభిమానాలు ఉప్పొంగడానికి,ఆరాధనలు చెలరేగడానికి -
దూరాన ఎగసిపడే మంటని మణిగా భావించి దాన్ని పొందాలని తహతహలాడడమే కాదూ అమ్మడూ?
వయసును,అందాన్ని,డబ్బుని,హోదాని కాశీలో కలిపేస్తే,
కంచికి పోయే కబుర్లు.
యథా కాష్టంచ కాష్టంచ
సమయేతాం మహోదధౌ
ఘడియ ఘడియకూ ఆటుపోట్లకు గురి అవుతూ,మరణానికి చేరువ అవుతూ ఉండే ఈ మానవ ఆత్మలు
మరొక ఆత్మకి మొదట తాత్కాలికంగా సంతోషాన్ని కలిగించినా చివరికి సంక్షోభాన్నే మిగల్చవూ?
మనుషుల కోసం,మనసుల కోసం అటూ ఇటూ పరుగులు పెట్టకు.
అదంతా అంతులేని చీకటి బిలం.
కూరిమి విరసంబైతే అన్నీ నేరాలే.
నిన్నటి రోజున మతాబాల్లా వెలిగిన స్నేహాలు,చిచ్చు బుడ్లలా వెల్లివిరిసిన అప్యాయతలూ,ఇవాళ మాసిపోక తప్పదు.
దీపావళి అయ్యాక మరుసటి రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందర నిన్న కేరింతలు కొడుతూ కాల్చిన బాణాసంచా తాలుకు చెత్తని శుభ్రంగా చిమ్మి అవతల పారెయ్యక తప్పదు.
మరణం తట్టని తలుపు లేదు.
అస్మదీయులని తస్మదీయులని
ఒకే గాట కట్టి
మాటు వేసి ఎత్తుకుపోతుంది.
బుద్ధుడికివ్వడానికి ఎక్కడా,ఎప్పుడూ ఆవాలు దొరకవు.
( నా “కాకీక కాకికి కాక” పుస్తకం నుండి,
వంగూరి ఫౌండేషన్ ప్రచురణలు)