తాతాచారి బులుగు శారీ

 



మన తాతాచార్యుల పుస్తకం “బులుగు శారీ” ని ఈసారి మన ఒక్క పొద్దు పత్రికలో ఆకాశానికి ఎత్తడం విజయవంతంగా పూర్తి అయ్యింది! 


 అది వరకు తాతాచారి “పద్య పావడా”, “వచన కోక”లను అంతరిక్షం కన్నా పైకి ఎత్తింది మన ఒక్క పొద్దు! 

 ఇంకా తాతాచరి విరచిత “రాయల రైక” కు బీభత్స అవార్డు వచ్చిందాకా కృష్ణ బిలాల్లోకి సైతం వినబడేలా అరిచి అరిచి ప్రచారం చేసింది మన ఒక్క పొద్దే! అంటే మన ఒక్క పొద్దు మాత్రమే అంటున్నా!

అసలు పండితుడు కావడానికి కవి కానవసరం లేదు,
రచయిత కానవసరం లేదు, 
భాష మీద భక్తి అవసరం లేదు,
 ప్రాచీన కవుల మీద గౌరవం అవసరం లేదు,
 తెలుగు సంస్కృతి మీద ప్రేమ అవసరం లేదు, 
దేశీయమైన భావనే అక్కర లేదు 
అని మనకు అన్నివిధాలా బోధించింది మన గురువు గారైన తాతాచార్యుల వారేనని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. 

వారు ఉగ్గడించిన ఈ విషయాన్నే నా “ఆరు రోజుల్లో పండితుడు కావడం ఎలా?” అన్న వ్యాసంలో రాసేసి మన గురువర్యులు తాతాచారి పాదపద్మాలకు సమర్పించాను.  

సాహిత్యంలో చెలామణిలో ఎలా ఉండాలో మనందరికీ నేర్పింది మన గురూజీనే. అది తల్చుకుంటుంటే నా సాహితీరోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి సుమా. అదిగదిగో భాషేష్‌కు,వెంకోజీకి సాహితీ భాష్పాలు రాలుతున్నాయి. 

తాతాచారిలాగా మహా పండితుడు అనిపించుకోవాలంటే ముందు మనలాంటి భజన బృందం అత్యంత ముఖ్యం.
 మన భజనకు తానా అంటే తందానా అంటూ అనేక సంస్థలు బయలుదేరుతాయి, ఎవడో గొప్ప వ్యక్తి కాబోలుననుకొని. 

ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, ఉదాహరణకు,సాహిత్యంలో బాగా పేరు పొందిన ఒక పాత కవిని తీసుకోవాలి.
 అంటే శ్రీనాథుడనుకో. 

చిన్న చిన్న రాళ్ళు
చిల్లర దేవుళ్ళు 

అని పద్యం రాసాడు కదా. అంటే దేవుళ్ళని “చిల్లర” దేవుళ్ళు అని ఈసడించాడని, శ్రీనాథుడికి దైవభక్తి లేదని వక్కాణించాలి. 
శ్రీనాథుడిలాగా రోడ్డు మీద పోయే ప్రతి లేడీ మీదా పద్యం చెప్పడమే కవి లక్షణమని, అదే అధునిక కవి లక్షణమని వాక్రివ్వాలి. 
శ్రీనాథుని జీవనశైలి స్వేచ్ఛాజీవికి, కళాజీవికి ఉదాహరణ అని దాన్ని అనుసరించడమే నిజమైన కవి లక్షణమని ఎలుగెత్తి చాటాలి. 

ఈ వ్యాసమంతా ఒక్కపొద్దులో రాగానే, కొంతమంది ఛాందసులు ఈసడించడానికి వచ్చి మనకు,తాతాచారికీ ప్రచారం కల్పిస్తారు.
 నిజానికి అదే మన ప్లాను.

అబ్బే, శ్రీనాథుడు పరమ భక్తుడు, కాశీఖండం రాసాడుగా,హర విలాసం రాసాడుగా అని కొందరు పండిత వృద్ధులు అనునయంగా చెప్పడానికి వస్తారు, మన సంగతి తెలియక. వాళ్ళవల్లా మనకు ప్రచారమే. 

ఇలాగే హలాహలం తెలుగును చితక్కొట్టాడు,
 భక్త పాతన పనికిరాని వాడు, 
క్రౌను దొర తెలుగు భాషకు ఏమీ చెయ్యలేదు, పైగా ద్రోహం చేసాడు లాంటి మన తాతాచారి వ్యాసాలను ఉల్లిపాయ బాంబుల్లాగా సాహితీలోకం మీదకు విసురుతాం. 

రామాయణం,మహాభారతం తీసుకుని చపాతీ పిండిలా పిసికితే ఎన్నో వ్యాసాలు, వాటి మీద ఎన్నో వివాదాలు. 
ఆ వాదోపవాదాల వల్ల తాతాచారికీ, ఒక్కపొద్దుకి పేరోపేరు!

ఈ తాతాచారి సీక్రెట్‌ రెసిపీని ఫాలో అయ్యే ఒక్కపొద్దు ఇన్ని సంవత్సరాల బట్టీ మూడు వ్యాసాలు,ఆరు వివాదాలుగా నడుస్తోంది! 
హీహీహీ, అంటూ ముగించాడు డ్రామాల భజగోవింద రావు. 

అదీ సంగతి.

మనమింటికీ తాతాచారి గంగలోకి.




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన