క్వ సూర్యప్రభవో వంశః

 



మనిషి జీవితాన్ని సంగ్రహంగా చెప్పగలవా బాబూ?

ఏముందండీ? 
ఏదో చదువుతాం. 
ఆ పరీక్షలు అవీ పాసవుతాం,
మధ్య మధ్యలో సినిమాలు,షికార్లు కొడుతూ. 
పరీక్షల్లో కాపీలు కూడా కొడతాం అనుకోండి. 
అంటే టీచర్లు సుత్తి కొడతారు, మేం కాపీలు కొడతాం. 😁

శైశవే ధ్వస్త విద్యాయ అన్న మాట! 
సరే,బాబు, ఆ తరువాత?

తరువాతేముందండీ, 
ఉద్యోగ వేట, 
పెళ్ళి, 
సంసారము, 
మధ్యే మధ్యే మందు, చిందు. 😁

యౌవనే విషయేషిణామ్ అన్న మాట‌! 
సరే, బాబు, తరువాత?

తరువాతేముందండీ, 
మిగిలిన జీవితాన్ని ఎన్‌జాయ్‌ చెయ్యడం.
 పిల్లలు సెటిల్‌ అయిపోగానే, దేశాలు తిరుగుతూ, పార్టీలకు హాజరీలో ఉంటూ వినోద కాలక్షేపాలు చెయ్యడం. 
వయసు కనబడకుండా తలకి రంగు, పూల చొక్కాలు వేసుకుని కుర్ర వేషాలు వేస్తూ కాలక్షేపం చెయ్యడం. 😁

వార్థకే అముని వృత్తీనాం అన్న మాట!
 సరే బాబు, జీవిత చరమాంకంలో?

చరమాంకంలో ఏముందండీ, 
రోగాలు చుట్టుముడతాయి, 
దాంతో, మందుల డబ్బా వెంటబెట్టుకుని తిరగడం, 
మధ్యే మధ్యే వైద్యుల్ని దర్శించడం. 
ఏదో ఒక రోజు పైకి పోవడం! 😁

రోగేనాంతే తనుత్యజాం అన్న మాట! 

సరేనండీ గురువు గారు, మీరేం చెబుతారు మనిషి జీవితం గురించి? 

నేను కాదయ్యా, కాళిదాసు చెప్పాడు, ఉత్తములైన రఘువంశజులు ఏమి చేస్తారని. 

శైశవేభ్యస్త విద్యానాం యౌవనే విషయేషిణామ్‌
వార్థకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజామ్‌

బాల్యాన్ని విద్యను ఆర్జించడానికి గడిపేవారు,
 యవ్వనాన్ని ప్రాపంచిక విషయాల మీద, భోగ్య వస్తువు మీద గడిపే వారు, 
వార్థక్యంలో వానప్రస్థం స్వీకరించి మునుల వలే బ్రతికే వారు, 
అంత్య సమయంలో యోగాభ్యాసము చేత శరీరాన్ని విడిచి పెట్టేసే వారు అని దాని అర్థం. 

ఉత్తములైన వ్యక్తుల యొక్క జీవన విధానాన్ని సామాన్యులు కూడా అనుసరించి ఉత్తమ స్థాయికి చేరుకోవాలి కదూ!

అహా! ఎంత బాగా చెప్పారండీ గురువు గారూ! 
ఈ మెకాలే పుత్రుడి కళ్ళు తెరిపించారు! 

నమో నమః 🙏


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన