అమ్మ ఊరెళితే

 



అమ్మ ఊరెళితే
వంట గిన్నె చప్పుడు చెయ్యదు 
నిటారు గరిటె తాళం పట్టదు
మిటారి కుక్కరు ఈల వెయ్యదు

నెగడు నాలిక సాచదు
కవ్వం నిలువు చాకిరీ చెయ్యదు 
ఎసరు కాగదసలే
దోశ కాలదు

పట్కార నోరు తెరవదు
పోపుల పెట్టె నిద్ర లేవదు
ఆకలంటే ఏ పాదమూ
పరిగెత్తుకు రాదు

అమ్మ ఊరెళితే
ఇల్లంత కొక్కురు భూతం
గుడ్లెర్ర జేసి కోప్పడుతుంది
ఆ వెనకే వచ్చే గుయ్యారం
భయపెడుతుంది
అమ్మ ఊరెళితే
ఇంటి శోభంతా
అమ్మ వెనకాలే
 ఊరెళుతుంది.






ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన