ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 2

 

పోనీ ఆ రైల్లో ఆ కిర్మిటియానో గిర్మిటియానో, దాని బదులు ఒక నార్త్ ఇండియన్‌ బ్రాహ్మిన్‌ కుటుంబం భద్రాచలం వెళుతున్నట్టు రాసి ఆ అమ్మాయికి, మన పూజారికి పెళ్ళి జరిపిస్తే? ఉత్తరాన్ని-దక్షిణాన్ని కలపడం అభ్యుదయమేగా? 

ఎంతసేపూ ఈ పూజారికి ఏ బ్రాహ్మల పిల్లతో పెళ్ళి సంబంధం కుదురుద్దామా అన్న ఆదుర్దాయే తప్ప ప్రచురింపబడే కథ రాద్దామన్న తెలివిడి లేదు కదా నీకు?
 అభ్యుదయవాదులు చెప్పిందే అభ్యుదయం గానీ నువ్వూ నేనూ అనుకున్నవన్నీ అభ్యుదయాలు కావు. తెలిసిందా?

నువ్వు చెప్పిన కథ నీ blog లో పెట్టుకో. లేకపోతే నీ ఫేస్‌బుక్‌ గోడ మీద కొట్టుకో. నాలుగు లైకులొస్తాయి. ఆ నాలుగు లైకులూ కూడా పెళ్ళి కాని అర్చక స్వాములవై ఉంటాయి. ఇలా అయితే నువ్వు ప్రముఖ రచైతవి అయినట్టే!

అయితే బ్రాహ్మిన్‌, నాన్‌-బ్రాహ్మిన్‌ పెళ్ళి చెయ్యాలంటావా??

సరిగ్గా పట్టుకున్నావ్‌! నాన్‌-బ్రాహ్మిన్‌ ఒక్కటే కాదు, నాన్‌ అగ్రవర్ణం అయి ఉండాలి. అప్పుడే అభ్యుదయం అవుతుంది! తెలిసిందా? 

సమాజపు అట్టడుగు స్థాయిలో ఉండి, అందులోనూ డబ్బు లేని, అందం లేని, చదువు లేని, సంస్కారం లేని ఇలా ఎన్నెన్నో లేని పిల్ల అయి ఉండాలి. 
అప్పుడది ప్రగతిశీలం! 
అర్థం అయిందా? 

ప్రముఖ రచైతని కాకపోతే పోయె, ఇంత దరిద్రమైన కథని నేను చచ్చినా రాయను. అయినా నా కథలో పూజారి పరమ నిష్ఠాగరిష్ఠుడు. వేదం,స్మార్తం చదువుకున్న వాడు, పరమ ఆచారవంతుడు. పెళ్ళి కాకపోయినా అతనికి చింత లేదు. తనకు తగిన పిల్ల దొరక్కపోతే భగవత్‌ సేవలో కాలం గడుపుతాడే గానీ ఇలా ఎవర్నిబడితే వాళ్ళని పెళ్ళి చేసుకోడు. 

ఏడిసినట్టే ఉంది నీ చాదస్తం.
 Award winning ఐడియాలు ఉచితంగా ఇస్తుంటే తీసుకోనంటావే? 

నువ్వు చెప్పే అభ్యుదయం అవీ నాకూ కొంత ఉన్నాయిలేరా! 
ఈ కథలోనే మానవత్వం చొప్పించి మార్చి రాసి బడ్వైజర్‌ ప్రభకు పంపా.
వాళ్ళూ తిరస్కరించారు అదేంటో మరి? 
 ఎలా మర్చానో చెబుతా విను.

తన తల్లి నగలను తీసుకుని రైల్లో భద్రాచలానికి ప్రయాణిస్తున్న మన పూజారి, ప్రయాణం చేస్తున్నంతసేపూ ఎవరితోనూ మాట్లాడడు. కలవడు. 
జపం చేసుకుంటూ ఉంటాడు. అక్కడే ఓ పక్కగా కూచుని సంధ్యావందనం కూడా చేస్తాడు. అక్కడున్న వాళ్ళంతా అతనిని ఛాందసుడిగా భావిస్తారు. ఇంతలో అక్కడ ఉన్న ఓ వ్యక్తికి అత్యవసర వైద్య సహాయం అవసరమౌతుంది. వెంటనే ఈ పూజారి అతనికి అత్యవసర చికిత్స అందించి, అన్నీ తానై అతని ప్రాణాలను రక్షించి, ఆ పెట్టెలో ఉన్న వారందరి మన్నన పొందడంతో కథ ముగుస్తుంది. 
ఎలా ఉంది కథ? 

బానే ఉందిగానీ, మంచి అభ్యుదయ కథ కావాల్సిన దాన్ని గబ్బు లేపావ్‌! 
కథలో మానవత్వం ఉండాల్సింది పూజారి పాత్రకు కాదు!
తాగుబోతు,తిరుగుబోతు,బిచ్చగాడు, వేశ్య ఇలాంటి పాత్రలకు!
పూజారి, భూస్వామి,ధనవంతుడు, పెద్ద ఉద్యోగి- ఇలాంటి పాత్రలకు మానవత్వం ఉండే అవకాశం లేదు. అర్థమైందా? 

హుమ్‌, అందుకేనేమో, విమర్శక అధమాగ్రేసరుడైన విస్కీ స్వామి కూడా నా పెగ్గు పక్కన పెట్టుకునే స్టఫ్‌లో ఇంతకన్నా ఎక్కువ మసాలా ఉంటుంది, స్పైసీనెస్‌ లేని చప్పిడి కథ అని జోక్‌ చేసాడట! 

చూసావా మరి, అతను చెప్పింది నిజమే. పేలవంగా ఉంది నీ కథ. Blog లో పెట్టుకోవడానికి, ఫేస్‌బుక్‌ గోడ మీద కొట్టుకోడానికి పనికొస్తుంది!

వేశ్య అంటే గుర్తొచ్చింది. 
నీకొక అద్భుతమైన అభ్యుదయ ఐడియా ఇస్తా.

 దీనికి మాత్రం తిరుగులేదంతే! 
ఈ కథ రాసావో, దీనితో నువ్వొక అంతర్జాతీయ కథకుడివై పోతావ్‌!
 చైనా నుండీ అమెరికా దాకా అందరూ ఉపన్యాసాలిమ్మని పిలిచేస్తారంతే నిన్ను! 
బోడ్స్ స్కాలర్‌షిప్‌, రోమన్‌ సిప్పిప్పిప్పీ అవార్డు వచ్చినా ఆశ్చర్యం లేదు. చెప్తా విను.

మన పూజారి తన తల్లి నగలను, తన సామాన్లను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటాడు. తన భోజనము, మంచి నీళ్ళు మడిగా తనే తయారు చేసుకుని వెంట తెచ్చుకుంటాడు. ఇతని జపము, వేషము,ధోరణి ఎదురుగా కూచున్న వేశ్యామణికి నవ్వు తెప్పిస్తాయి. ఆమె ఇతనిని ఆట పట్టించడం మొదలు పెడుతుంది.
 
కొంచెం చపాతీ నాకూ ఇస్తారా స్వామీ అని అడుగుతుంది తమాషాగా. 
అతను ఎత్తి చేతిలో వేస్తాడు. అది చూసి నవ్వుతుంది. ఏదో అతని కాలు తొక్కుతుంది. కొంచెం కాలు తియ్యమ్మా అంటాడు ఆ అమాయక చక్రవర్తి. ఇలా రెండు మూడు మసాలా సంఘటనలు రాయి. సరేనా?

ఇంతలో ఆ రైలుకి ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో ప్రాణాలకు తెగించి ఆ పూజారిని కాపాడుతుంది ఆ వేశ్య. మొదట ప్రాణాలు పోతున్నా ఆమె సహాయం తీసుకోవడానికి హీరో ఇష్ట పడడు. 

అప్పుడు మానవత్వం అంటే ఏమిటి, మనిషికి మనిషికి మధ్య ఉండాల్సినవి ప్రేమ, కరుణ, జాలి, దయ etc etc,. అని ఆ వేశ్య చేత ఉపన్యాసం ఇప్పించాలి.  
శంకరులకు అతనెవరో జ్ఞానబోధ చేసాడని, కౌశికుడికి ధర్మవ్యాధుడనే కసాయి కళ్ళు తెరిపించాడని ఆ వేశ్య చేత చెప్పించాలి. 
ఇంకా వేదాలనుండి, పురాణాల నుండి కొన్ని కొటేషన్లు ఆవిడ నోటి వెంట పలికించాలి. 
అలా ఆ వేశ్యామణి వల్ల రక్షింపబడ్డ మన అజ్ఞానాంధకారంలో ఉన్న పూజారి, చివరికి తన తల్లి నగలను ఆమె చేతిలో పెట్టి ఆమెను చేపట్టడంతో కథ ముగుస్తుంది. 
బాగుందా? 

రెడ్‌లైట్‌ ఏరియాలోను లేకపోతే పోలీస్‌ స్టేషన్ల చూట్టూ తిరిగే పాత్రకు పురాణాలు, వేదాలు డైలాగులు ఏమిట్రా నాయనా? 

అదే మరి. నీ కథలు ప్రచురింపబడడం లేదంటే ఇందుక్కాదూ? నీకు అభ్యుదయంలో ఓనమాలు తెలీదని అర్థం అవుతోంది. అసలు వేశ్య పాత్ర కథానాయికగా ఉన్న ఏ కథ అయినా, సినిమా అయినా సూపర్‌ హిట్‌! అసలు ఈ కథను సినిమాగా తీస్తామని డైరక్టర్లు నీ ఇంటి ముందు క్యూ కట్టకపోతే నన్నడుగు. 

ఓ ఏభై లక్షలు మనవి కాదనుకుంటే నువ్వూ నేనే తియ్యొచ్చు ఈ కథతో సినిమా. విజయవాడ నుండి బందరు వెళ్ళే పాసింజరులో తీసామంటే లో బడ్జెట్‌ లో అయిపోతుంది. వేశ్య పాత్రకు బూరె బుగ్గల బెంగాలీ భామ కాన్‌కాన్‌ సేన్‌ ని తీసుకొద్దాం. పూజారిని అల్లరి పెట్టే సీన్లలో రాజశేఖరా, నీపై మోజు తీరలేదురా, రసిక రాజ,తగువారము కామా లాంటి మాంఛి పాట ఒకటి రాయిద్దాం.

ఈ సినిమా అన్ని international film festivals వెళుతుంది చూడు.
Best art film గా మనకు పేరు,అవార్డులు!


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5