ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 3

 


ఆపరా నీ దిక్కుమాలిన ఐడియాలు! 
వింటుంటేనే ఒళ్ళంతా కంపరమెత్తుతోంది!
 ఛీ!ఛీ! ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో అసలు? 

చూడరా,నువ్వు ఒక్కసారి అభ్యుదయ వాదవయ్యావనుకో, 
నీ మైండ్‌ ఫ్రీ అయిపోతుంది. అప్పుడింతకన్నా గొప్ప గొప్ప ఐడియాలు తామరతంపరగా వస్తాయి నీ బుర్రలోకి! 

అంటే మైండ్‌ దొబ్బుతుంటావ్‌, అంతేగా? 

హిహి, ప్రచురింపబడే కథలు రాయడం రాదు గానీ జోకులు మాత్రం బానే వేస్తున్నావ్‌రా! 

నా జోకులకేంలే గానీ, ఇదే కథని మళ్ళీ మార్చి, ఎంతో ప్రాణం పెట్టి రాసారా. వరుణోదయం పత్రికకు పంపా. వాళ్ళైతే నా కథను తిరిగి పంపుతూ నన్ను నానా తిట్లు తిడుతూ ఒక ఉత్తరం కూడా జత చేసి పంపారు. అంత గొప్ప కథ గురించి అలా ఎందుకు రాసారో, ఎందుకు తిరగ్గొట్టారో ఇప్పటికీ నాకు మిస్టరీయేరా! 

ఈసారి ఏం మార్చి పంపావో?

మన పూజారి, తల్లి నగలతో భద్రాచలం రామయ్య దర్శనానికి వెళుతుంటాడా, ఆ పెట్టె నిండా రామ భక్తులే ఉంటారు. అందరు కోలాహలంగా రామ భజన చేస్తూ సాగుతుంటారు. 
మన పూజారి తన తల్లి నగలను రామయ్యకు, సీతమ్మకు సమర్పించడానికి వెళుతున్నాడని తెలుసుకొని వారంతా అభినందిస్తారు. ఆ పెట్టెలో ఒక మాలదాసరి కుటుంబం కూడా ఉంటుంది. వారికేదో ఇబ్బంది వస్తుంది. సాటి రామభక్తుడికి కష్టం వస్తే మిగిలిన రామభక్తులు ఊరుకుంటారా? వారంతా ఆ కుటుంబానికి సహాయం చేసి కాపాడతారు. 
 అదే పెట్టెలో ప్రముఖ ప్రవచనకర్త యాగంటి యోగేశ్వరరావు గారు ఉంటారు. ఆయన రామాయణ ప్రవచనం వింటూ రామభక్తులంతా భద్రాచలం చేరుకుంటారు. 
పూజారి తన తల్లి నగలను సీతారాములకు సమర్పించడంతో కథ ముగుస్తుంది.
ఇదీ కథ సంక్షిప్తంగా. 
నువ్వే చెప్పు బాలేదూ కథ? 

ఇదసలు కథేనట్రా? ఉప్పూ కారం పోపు ఏమీ లేకుండా?
కథలో అభ్యుదయం ఎక్కడుందో చెప్పు? 

అన్ని వర్గాల వాళ్ళు కలిసి ప్రయాణం చేసి ఒకే రాముడిని దర్శించుకోవడం అభ్యుదయం కాదుట్రా? 

ఖర్మరా నాయనా! నిన్ను మార్చడం నావల్ల అయ్యేటట్టు లేదు. చివరగా ఒక version చెబుతా. ఇలా కథ రాస్తే సాహితీ లోకంలో నీ పేరు స్థిరపడుతుంది. నువ్వూ ఓ అభ్యుదయ రచయితగా ఆ గుంపులో కుదురుకుంటావ్‌. చెబుతా విను.

పూజారి తన తల్లి నగలతో రైలులో ప్రయాణిస్తూ ఉంటాడు. 
అదే పెట్టెలో తాతాచారి,వెంకోజీ,జెఫ్ఫా భాయి తదితర ప్రముఖ రచైతలు, మేధావులు ప్రయాణిస్తుంటారు. వారంతా పూజారిలా సంకుచిత చట్రంలో ఇరుక్కుపోయిన వారు కాదు, అభ్యుదయానికే మంచి నీళ్ళు తాగించగల మోనాలిసాలు!

మధ్యలో మోనాలిసా ఎందుకొచ్చిందీ?

దీన్నే చైతన్య స్రవంతి స్టైలంటారు. ఇవన్నీ తెలియాలంటే నువ్వు అమ్యూనిస్ట్ ఆర్కిస్ట్ పెసిమిస్ట్ నిహిలిస్ట్ ఐడియాలజీలన్నీ చదవాలి. అది నువ్వు అభ్యుదయవాదివి అయితేనే సాధ్యం. సరే, వాటి గురించి నిన్ను తర్వాత educate చేస్తా. ఇక కథలోకి వద్దాం. 

పూజారి తన తల్లి నగలను రాముడికి ఇవ్వడానికి వెళుతున్నాడని తెలుసుకున్న తాతాచారి ముసిముసిగా నవ్వుతూ, అసలు రాముడు దేవుడని మీరెలా చెబుతారు? ఎన్నెన్నో రామాయణాలున్నాయ్‌? ఎందరెందరో వాల్మీకులున్నారు? అని నేనూ షూలేసు రాసిన వ్యాసాలు మీరు చదవలేదా? అని సౌమ్యంగా అడుగుతాడు. 

మన పూజారి మొహం ఎర్రగా చేసుకుని మారు పలక్కుండా కూచుంటాడు. 

రాముడు సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. అది వివక్ష. 
అతన్ని ఇతన్ని చంపాడు అదీ వివక్షే. 
అని జెఫ్ఫా భాయి నవ్వుతూ అంటాడు. 

మన పూజారి మొహం ఎర్రగా చేసుకుని మారు పలక్కుండా కూచుంటాడు. 

ఆగాగు. ఇంత మాత్రం చచ్చుపుచ్చు ప్రశ్నలకు పూజారి సమాధానం చెప్పలేక పోతాడా? 

మన అభ్యుదయ కథల్లో పూజారి అనే వాడు అజ్ఞానానికి, గత కాలపు శిథిల సంప్రదాయాలకి ప్రతీక. తెలిసిందా? సమాధానాలు అతను చెప్పగలిగినా మన కథల్లో మాత్రం మెదలకుండా నీళ్ళు నములుతూ కూచోవాలి. ఓకే? 

ఇంకో ముఖ్య విషయం, అభ్యుదయ పాత్రలు నెమ్మదిగా,సౌమ్యంగా, సంస్కారవంతంగా ప్రవర్తించాలి.
 సంప్రదాయల్లో ఇరుక్కుపోయిన పాత్రలు మాత్రం మొండిగా,మూర్ఖంగా, అహంకారంగా,అమానవీయంగా ప్రవర్తించాలి.
 ఇది శిలాశాసనం. గుర్తు పెట్టుకో. ఓకే?
ఇక కథలోకి వద్దాం.

ఇంతలో, రాముడికి నగలెందుకు?
 ఆయన పెట్టుకుంటాడా ఏమన్నానా? 
అంటాడు Mr.సత్రకాయ్.

మధ్యలో ఈ సత్రకాయ్ ఎవరూ?

సత్రకాయ్‌ గారు సెక్యులర్‌ హిందువు! ఓకే? 

Next, ఆ పెట్టెలోకి  బుల్‌బుల్‌ ఎక్కుతాడు. అతన్ని ఆ పెట్టెలో ఉన్న మేధావులంతా admiring గా చూస్తారు. 

బుల్‌బుల్‌ ఏమిటీ? వేరే మతమా?

Very good. బాగా చెప్పావ్‌. ఈ పాత్ర రాకతో మన కథ అభ్యుదయం వైపు అడుగు వేసింది. ఓకే?

బుల్‌బుల్‌కి తీరని ఆరోగ్య సమస్య అని పెట్టెలో ఉన్న అభ్యుదయ రచైతలకి, మేధావులకి తెలుస్తుంది. 

వాళ్ళంతా పూజారి వంక కోపంగా చూస్తారు.

పూజారి వంక ఎందుకూ కోపంగా చూడ్డం?

ప్రపంచంలో ఉన్న బాధలన్నింటికీ పూజారే కారణమని అభ్యుదయ మేధావుల నిశ్చితాభిప్రాయం. అందుకే అలా చూస్తారు. 

ఒక్క హిందూ పూజారినేనా? 
మిగతా మతాల మత పెద్దలను కూడానా?

అయ్యయ్యో, only హిందూ పూజారిని మాత్రమే. 
కథ వ్రాసేటప్పుడు ఈ విషయంలో నువ్వు చాలా clarity తో ఉండాలి సుమీ! 

రాముడి కోసం మీరు తీస్కెళ్తున్న నగలను బుల్‌బుల్‌ గారికి ఇవ్వండి అంటాడు Mr.సత్రకాయ్‌.

పూజారి అయోమయంగా చూస్తాడు.

జంధ్యామార్కుల వాళ్ళు ఎందుకిస్తారూ? 
అంటాడు జెఫ్ఫా భాయి. 

బుల్‌బుల్‌ పదో కొడుక్కి ఫీజు కట్టడానికి డబ్బు లేదని తెలుస్తుంది వారందరికీ. 

మళ్ళీ వాళ్ళంతా పూజారి వంక కోపంగా చూస్తారు.

రాముడి కోసం మీరు తీస్కెళ్తున్న నగలను బుల్‌బుల్‌ గారికి ఇవ్వండి అంటాడు Mr.సత్రకాయ్‌.

పూజారి అయోమయంగా చూస్తాడు.

జంధ్యామార్కుల వాళ్ళు ఎందుకిస్తారూ? 
అంటాడు జెఫ్ఫా భాయి. 

బుల్‌బుల్‌ కి సొంత ఇల్లు లేదన్న విషయం తెలుస్తుంది వారందరికీ. 

మళ్ళీ వాళ్ళంతా పూజారి వంక కోపంగా చూస్తారు.

రాముడి కోసం మీరు తీస్కెళ్తున్న నగలను బుల్‌బుల్‌ గారికి ఇవ్వండి అంటాడు Mr.సత్రకాయ్‌.

పూజారి అయోమయంగా చూస్తాడు.

జంధ్యామార్కుల వాళ్ళు ఎందుకిస్తారూ? 
అంటాడు జెఫ్ఫా భాయి. 

నగలిచ్చెయ్యండి, మీకు బరువు తగ్గుతుంది, హీహీ అంటాడు తాతాచారి నవ్వుతూ. 

అలా అక్కడ ఉన్న అభ్యుదయ రచైతలు బలవంతంగా పూజారి కళ్ళు తెరిపించి, అతనిలో జ్ఞాన సూర్యుడిని వెలిగించి, రాములవారి కోసం తీసుకెళుతున్న అతని తల్లి నగలన్నీ బుల్‌బుల్‌ అనే పాత్రకు ఇప్పించడంతో కథ అభ్యుదయమౌతుంది. 

ఈ కథ తప్పకుండా ప్రచురింపబడుతుంది, నా మాట విని వీరంగం పత్రికకు పంపు. 

మంచి కథ చెప్పావురా. అలాగే రాసి వీరంగం పత్రికకు పంపుతా. 

అయితే ముగింపు మారుస్తా- 

వాళ్ళ మాటలన్నీ వింటున్న పూజారి లేచి నిలబడి -

నా దేశం,నా ధర్మం,నా నగలు,నా రాముడు! 
నా దేశంలో నా దేవుడికి నా నగలు సమర్పించుకుంటుంటే మీరెవర్రా విమర్శించడానికి? తలకు మాసిన కుంకల్లారా! 

నా నగలు నేనెవరికిచ్చుకోవాలో మీరు చెప్పడమేమిట్రా పాచి మొహంతో నల్ల కాఫీ జుర్రే కుక్క మూతి పిందెల్లారా! అంటూ అక్కడున్న వాళ్ళకు దేహశుద్ధి చేయబోతే  పరిగెత్తే ఓపిక లేక ఈ అభ్యుదయ రచైతలంతా కలిసి రైలు బాత్రూంలో దాక్కోవడంతో కథ ముగుస్తుంది! 

రేయ్‌!రేయ్‌!రేయ్‌! ఆపరా నీ సోది! 
లౌక్యం,చాకచక్యం రెండూ లేవు నీకు!
ఇలాంటి ముగింపు నీ డైరీలో రాసుకుని నీ ఇంట్లో పెట్టెలో పెట్టుకో.
నేను చెప్పిన ముగింపు ఇచ్చావనుకో, నీకు హీనపక్షం వీవర్స్ బంట్‌ అవార్డో, ఫ్రీబీస్‌ ఇంటర్నేషనల్‌ అవార్డో వస్తుంది. ముగింపులోనే మోక్షం ఉంది. కాస్త తెలివిగా ఆలోచించూ.. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5