ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 4

 


నీకో దణ్ణం! అవార్డుల కోసం నువ్వు చెప్పే ముగింపులు నేనివ్వను గాక ఇవ్వను! 

నీ ఇష్టం రా, నీ మేలు కోరి మంచి ఐడియాలు ఇచ్చా. కాదంటే నీ ఇష్టం. అన్నీ పూజారి మీద, రాముడి మీద కథలేనా ఇంకేమన్నా రాసావా?

స్త్రీల అభ్యుదయం కోరి మంచి మంచి కథలు రాసాను రా. 
అవీ వెయ్యలేదు ఈ పత్రికలు.
 ఎందుకో తెలీదు.

లేడీస్‌ మీద అయితే తప్పకుండా తీసుకోవాలే?
 ఏదీ, ఓ కథ చెప్పు?

ఒక నిరక్షరాస్య నేపథ్యం నుండి వచ్చిన అమ్మాయి ఎన్నో కష్టాల కోర్చి బాగా చదువుకుని జీవితంలో పైకొస్తుంది. 
ఇదీ ఒక కథ సారాంశం. 
ఇది బ్రాందీ జ్యోతి తిరస్కరించిన కథ.
ఎలా ఉంది?

చందమామకి,బాల మిత్రకి పంపు. 

అదేంటి? అలా అనేసావ్‌?

అదంతే. ఇంకో కథ చెప్పు? 

ఒకడు ఒకమ్మాయిని ప్రేమించానని తన ప్రేమను తెలియజేస్తాడు.
తనకు కనీ పెంచిన తల్లిదండ్రులే ముఖ్యమని, వాళ్ళని బాధ పెట్టనని, వాళ్ళు చూసిన వరుడినే చేసుకుంటానని అతని ప్రేమని ఆమె తిరస్కరిస్తుంది. ఇదీ కథ.
విస్కీ ప్రభకు పంపితే తిరగ్గొట్టింది. 
ఎలా ఉంది? 

ఇది blog లో రాసుకో. నువ్వు తప్ప ఎవడూ చదవడు. Next? 

ఒకామెకు చిన్న వయసులోనే భర్త పోతాడు. ఇద్దరు పిల్లలుంటారు.
 ఒక వ్యాపారం ప్రారంభించి, విజయం సాధించి పిల్లలను వృద్ధిలోకి తీసుకొస్తుంది. ఇదీ ఆ కథ సారాంశం. 
వారుణీ వాహిని పత్రిక విసిరి కొట్టింది! 

ఇది blog లో పెట్టడానికి కూడా పనికి రాని కథ. 
దీని స్టాండడ్‌ ఫేస్‌బుక్‌ గోడ!‌ 

ఏమిట్రా, అన్నీ పనికిరాని కథలే అంటున్నావు?? 
వీటిల్లో స్త్రీజనాభ్యుదయం ఉందిగా? 

నువ్వు చెప్పే కథలన్నీ 1950s కథలు.
 ఇప్పుడన్నీ ఇస్త్రీవాద కథలదే హవా!

ఇస్త్రీవాదమా? అదేంటీ? 

చెప్తా విను. ఈ వాదం కింద స్థూలంగా నాలుగు రకాల కథలుంటాయ్‌. 

1. పారిపోవడం,లేచి పోవడం,వెళ్ళి పోవడం, వదిలించుకోవడం. 

2. పురుషుడిని అనుకరించడం - తాగడం, తిరగడం, స్నేహాలు. 

3. అధునిక స్త్రీని ఆకాశానికి ఎత్తుతూ, 
హిందూ సంప్రదాయ స్త్రీని హేళన చేస్తూ వ్రాసే కథలు.

4. స్వేచ్ఛ అంటే శృంగార వీథుల్లో షికార్లు చేయడం అని ప్రబోధించే అక్రమ,అనులోమ, విలోమ ప్రేమలను సమర్థించే కథలు.

ఇలాంటి కథలు వ్రాస్తేనే నీకు అభ్యుదయ రచైతగా ప్రఖ్యాతి.
నువ్వేమో పాత మాగాయ పచ్చడిలో పెరుగు కలిపి పోపు వేసి పాఠకులకు పెట్టాలని చూస్తున్నావ్‌! 
వాళ్ళుకు కావాల్సింది కుండ బిర్యానీ! తెలిసిందా? 
నీ కథలన్నీ ప్రచురింపబడాలంటే నేను చెప్పినట్టు మార్చి తిరగరాయి.ఓకే? 

నువ్వు చెప్పిన మొదటి కథలో బాగా చదువుకున్న అమ్మాయి వేరే మతం అబ్బాయితో live-in లో ఉన్నట్టు మార్చి మసాలా చేర్చి రాయి. 
సరేనా? 

లివిన్నా??

రెండో కథలో అమ్మాయికి అబ్బాయిలు నచ్చరని, అమ్మాయిలే నచ్చుతారని పాఠకులను ఒప్పించేటట్టు సున్నితంగా రాయి. 

అమ్మాయితో అమ్మాయా??

మూడో కథలోని business women కి మూడు పెళ్ళిళ్ళు, నాలుగు బ్రేకప్‌లు - అల్లం వెల్లుల్లి పేస్ట్ దట్టించి రోస్ట్ చేసిన పెసరట్టులా టేస్టీగా రాయ్‌! 

అన్నేసి పెళ్ళిళ్ళూ పెటాకులూనా??

రేయ్‌, రేయ్‌! నువ్వు నీ ఆశ్చర్యాలతోనే గుండాగి చచ్చేటట్టున్నావ్‌! 
ప్రస్తుతం trending ఇవేరా నాయనా! 
ఈ కథల్లోనే depression,loneliness ఇలాంటివన్నీ పడుగు పేకలా అల్లావనుకో, ప్రగతిశీల పాప్‌ స్టార్‌వి అవుతావ్‌! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5