తెలుగు జల్లు పిలుస్తోంది,ఓటరయ్యా!

 


ఓటరు మహాశయా! మా తెలుగు జల్లు పార్టీ గుర్తు “మామిడల్లం”. 
మామిడల్లానికే మీ ఓటు వేసి గెలిపించ ప్రార్థన.

తెలుగు జల్లా? ఎక్కడా వినలేదే? ఎప్పుడు పెట్టారీ పార్టీ?

ఇవాళ పొద్దున్నే పుట్టింది.
 మధ్యాహ్నం లేచి నడిచింది.
 సాయంకాలానికి ఓటరు ముంగిట నిలిచింది. 

ఓహో! మీ గుర్తు మామిడల్లమా?

అవును. 
అల్లం గుర్తుతో ఇంకో పార్టీ ఉంది.
 మీరు జాగ్రత్తగా చూసి ఓటు వెయ్యాలి. సరేనా? 

అల్లానికి మామిడల్లానికి తేడా రుచి చూస్తేగానీ తెలీదు కదండీ? 
చూసి ఎల్లా చెప్పడం? 
ఇంతకీ ఏ ఆశయంతో పార్టీ స్థాపించినట్టో?

మాది తెలుగు కవుల పార్టీ. 
తెలుగును రక్షించడం కోసం పెట్టాం. 

అల్లం పార్టీ వాళ్ళని చూడండి. వాళ్ళకు తెలుగు రాదు.
 “కనిగిరి” ని “కలిగిరి” అని పలికే వింత బాపతు. 

బెల్లం పార్టీ వాళ్ళకి అసలు తెలుగే అక్కర లేదు.
తెలుగు జాతి మొత్తాన్ని  బ్రిటీషు వాడి భాషలోకి, బ్రిటీషు వాడి మతంలోకి మార్చాలని జనాలను పాకం పడుతున్నారు. 

బెల్లం వాళ్ళు పంచేదానికి రెండు రెట్లు పప్పు బెల్లాలుగా డబ్బు పంచుతామని అల్లం వాళ్ళు చెబుతున్నారు గదండీ? 

అబ్బా, పంచడాలు,ఎంచడాలు కాదయ్యా, 
ఒకడిది చచ్చు తెలుగు, ఇంకోడిది పుచ్చు తెలుగు అని చెబుతున్నా. 

మరి మీది?

అచ్చు తెలుగు! కమ్మెచ్చు తీసినట్టుండే తీపి తెలుగు!

సరేనండీ, ఒక్క తెలుగేనా? దేశంలో ఎన్ని సమస్యలు లేవు?

ఉన్నాయి. అవన్నీ తీరుస్తాం.

 ప్రజలెవరైనా 1-800-తె-లు-గు అనే టోల్‌ ఫ్రీ నంబరుకి కాల్‌ చేస్తే చాలు. 
క్షణాల్లో అక్కడ వాలుతాం!

ఓహో! అలాగా! మా బొంగు నగర్‌ కాలనీలో దోమల బాధ ఎక్కువగా ఉందండీ. 

ఓస్‌, అంతే కదా. ఆచార్య గోడ మీద పిల్లి నాయకత్వంలో మా వచన కవులను అక్కడికి పంపుతాం. వారు తమ నానీలు, చెడ్డీలు,మిడ్డీలు అనబడే వివిధ రకాలైన మినీ కవితలను ఎలుగెత్తి చదవగానే దోమలన్నీ మందలు మందలుగా పాకిస్థాన్‌ పారిపోతాయి. సరేనా?

కుక్కల బాధ, పందుల బాధ కూడా ఎక్కువ సార్‌!

దానికి మా ఎర్ర కవులే సరి. ఎర్ర జెండాలతో కోరల మార్కుడి బొమ్మ పట్టుకుని, శునకము వలె, వరాహము వలె, బొంగు నగర్‌ కింగుల వలె అని ఎలుగెత్తి నినదించగానే కుక్కలు, పందులు చైనాకి పారిపోయి ఇక రమ్మన్నా రావు. ఓకే? 

నల్లల బాధా ఎక్కువే సార్‌!

దానికైతే అవధానులే సరి! నిశ్చింతగా ఉండు. 

సీజన్‌లో కోతుల మూక మా బొంగు నగర్‌ మీద దాడి చేస్తుంది,సార్‌! 

కోతులా? చాలా సింపులయ్యా, మా వాడిని పంపి పేరడీలు చదివిస్తా! ఓకేనా?

బానే ఉందండీ. ఇంతకీ మీ పార్టీ ప్రత్యేక హామీలేమన్నా ఉన్నాయా? 

హామీ అంటే హామీ ఒకటుంది. 

ప్రతి రోజు ప్రతి ఊళ్ళోను సాయంకాలం కవి సమ్మేళనం ఏర్పాటు చేస్తాం. ప్రజలందరూ తప్పనిసరిగా హాజరు కావాలి. లేకపోతే మూడేళ్ళు జైలు శిక్ష, పది వేలు జరిమానా! 

వామ్మో, ఇదేదో కొత్తగా ఉంది. వచ్చిన వాళ్ళకి భోజనాలేమైన పెట్టించే పథకం ఉందా?

వచ్చిన ప్రతి ఒక్కరికీ దాహానికి దోసిళ్ళ నిండా సమృద్ధిగా నదీజలాలను ఇప్పిస్తాం!

అబ్బో, పెద్ద కానుకే! ఇంకా ఏమేమి చేస్తారో?

మీ బొంగు నగర్‌ పేరుని “సాహితీ సమరాంగణ సార్వభౌమ నగర్‌” గా మారుస్తామని హామీ ఇస్తున్నాం!

నా ఓటు మీకే వేస్తా గానీ, ఇప్పుడే అల్లం పార్టీ వాళ్ళు అయిదు వేలు, బెల్లం పార్టీ వాళ్ళు పదివేలు ఇచ్చి వెళ్ళారు. మీరేం ఇస్తారు?

డబ్బేమిటివయ్యా, వెధవ డబ్బు? నీకోసం మంచి పాట పాడతా విని ఆనందించు. 

తెలుగు జల్లు 
కురుస్తోంది ఓటరయ్యా!
మామిడల్లం 
పిలుస్తోంది!
ఓటెయ్యవయ్యా!

రెపరెపలాడు
బాలెట్‌ పేపర్లో
మామిడల్లాన్ని
గిల్లి చూసుకో!

ఓ..ఓ..ఓ!


బావుంది కదూ పాట! పాట ఉంటే డబ్బు గిబ్బు ఎందుకయ్యా?
అయ్యయ్యో, అదేంటి, ధడేల్‌మని తలుపేసుకుని పోతున్నావ్‌?
నే చెప్పేది విన్నవయ్యా!

నీకోసం మాంఛి పద్యం చెబుతా...

జెండా పై మామిడల్లము…


ఇదిగో,ఇదిగో, మీ పక్క కాలనీ పేరు “అవధాన చింతామణి నగర్‌” గా మారుస్తామయ్యా..

ఆ పక్క కాలనీ పేరు “మహాకవి మల్లయ్య నగర్‌” గా మారుస్తా.. 

ఇంకా చాలా హామీలున్నయ్‌.. ఇదిగో,బాబు, ఓటరు మహాశయా, తలుపు తియ్యవయ్యా!




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు