ఆ కిక్కే వేరప్పా!

 


ఈసారి మన క్రౌంచద్వీప డాషింగ్‌ రచైతల సంఘం సంవత్సరీకాలు అంటార్కిటికాలో! 

సంవత్సరీకాలేమిటండీ అశుభం మాటలు?

అదేనయ్యా, ప్రతి సంవత్సరం మనం జరిపే రచైతల సమావేశాలు!

అంటార్కిటికా లోనా?? 
అంత దూరం ఎవరొస్తారండీ? 

వస్తారు.
అంతా వస్తారు.

 వీళ్ళందరికీ ప్రయాణ ఖర్చులు మనకి తడిసి మోపెడు అవుతాయండీ బాబూ!

దారి ఖర్చులు వాళ్ళే పెట్టుకుని వస్తారు.

వారికక్కడ బస?

ఎవరి బస వాళ్ళే చూసుకుంటారు.

మరి వీళ్ళందరికీ అక్కడ భోజనాల ఏర్పాట్లు? 

ఎవరి భోజనం సంగతి వాళ్ళే చూసుకుంటారు.

బాగోదేమోనండీ? 
సరే, మరి వీళ్ళందరికీ శాలువాలూ అవీ?

ఎవరి శాలువా వాళ్ళే తెచ్చుకుంటారు.

అలాగా? ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది.

మీ అయోమయాలు గూట్లో పెట్టి ఆహ్వాన పత్రికలు పంపండి. 

డేరింగ్‌ కథలు/క్రేజీ కవితలు వ్రాసిన  ప్రముఖ రచయిత/కవి అయిన మిమ్మల్ని వచ్చే నెల 15 న అంటార్కిటికాలో జరగబోతోన్న మా రచైతల సమావేశానికి క్రౌంచద్వీప డాషింగ్‌ రచైతల సంఘం సగౌరవంగా ఆహ్వానిస్తోంది. 

ఈ ఆహ్వానితుల్లో కొంతమంది  ఇంత వరకూ ఒకటే కథ, ఒకటే కవిత రాసిన వాళ్ళున్నారు కదండీ?

వ్రాసిన ఒక్క కథ/కవిత తోనే ప్రఖ్యాతి గాంచిన - అని మార్చి పంపండి వాళ్ళకి.

కొంతమంది కేవలం సాహితీ అభిమానులు. వీళ్ళకేం రాయాలి?

ప్రఖ్యాత సాహితీ అభిమానులైన - అని మార్చి పంపండి. 
మీవల్లే సాహిత్యం ఊపిరి పీలుస్తోంది అని కూడా రాయండి. 
మీరు త్వరలో ప్రపంచ ప్రఖ్యాత రచనలు చేస్తారని మా నమ్మకం అని కూడా రాయండి.

సరేగానీ, మనలో మన మాట, అందరూ ప్రఖ్యాతులేనంటారా?

పప్పులో ఉప్పెంత ముఖ్యమో ప్రఖ్యాత అన్న పదం చేర్చడం అంత ముఖ్యం! 

సరేగానీయండీ, వీళ్ళంతా అంత దూరం అంటార్కిటికాకి  పిలవగానే వస్తారని అంత నమ్మకంగా ఎలా చెబుతున్నారు? 

వస్తారయ్యా, ప్రముఖ రచయిత, ప్రముఖ కవి అని మనం ఇచ్చే గుర్తింపు ఏదైతే ఉందో, అందులోనే ఉంది కిక్కంతా! 

దాని కోసం చేంతాడు పట్టుకుని చంద్ర మండలానికి రమ్మన్నా వస్తారు! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5