నవ్వుతూ నవ్వుతూ చావాలి రా!

 


అన్నయ్యా, ఈయన అన్నింటికీ టెన్షన్‌ పడిపోతూ, పాతవన్నీ తలుచుకుంటూ, తవ్వుకుంటూ తనలోతాను కుమిలిపోతున్నారు, మీరొచ్చి సహాయం చెయ్యాలని చెల్లెమ్మ ఫోన్‌ చేస్తే ఇటొచ్చా. 

నువ్వలా మొహం ముడుచుకుని కూచోడం, 
ప్రతిదానికి చిటపటలాడడం, 
అన్నింటికీ ధుమధమలాడడం 
నీ గుండెకి,
 కాలేయానికి, 
ఊపిరితిత్తులకి,
మూత్రపిండాలకి 
మంచిది కాదు. తెలిసిందా?

చూడ్రా, 
నవ్వడం ఒక మెగా భోగం!
నవ్వకపోవడం ఒక జెయింటు రోగం!

నేను కనిపెట్టిన నవ్వో థెరపీ తో నీ జబ్బులన్నీ మాయమైపోతాయి.
ఓకే?

ముందుగా నువ్వు మా కితకితల క్లబ్బులో చేరాలి.
 రోజూ ఉదయాన్నే అక్కడ మా అసిస్టెంట్లు నీకు వద్దన్నా కితకితలు పెట్టి నవ్విస్తారు. 
తర్వాత నీకు మావాళ్ళు తెలుగులో వచ్చిన హాస్య రచనలు, జోకుల పుస్తకాలు, హాస్య పత్రికలు ఇస్తారు. 
నువ్వు చెయ్యాల్సిందల్లా హాయిగా అవన్నీ చదువుకోవడం, చదువుకుని చదువుకుని నవ్వుకోవడం! సరేనా? 

ఇలా రోజంతా చేసి రాత్రి పడుకోబోయే ముందు, ఒకసారి గాఠ్ఠిగా నవ్వేసి పడుకోవాలి! ఓకే!

ఆర్నెల్ల తర్వాత- 

అన్నయ్యా! ఘోరం జరిగిపోయిందన్నయ్యా! 
నవ్వుతూ నవ్వుతూ ఆయన వెళ్ళిపోయారన్నయ్యా! 
 మీ నవ్వో థెరపీ పని చేసి ఆయన నవ్వడం మొదలు పెట్టారన్నయ్యా! అస్తమానం నవ్వడమే! 
కూర్చున్నా,నించున్నా ఆఖరికి సినిమాలో ఏడుపు సీన్లు వస్తున్నా నవ్వడమే!  

ఆమధ్య మావాళ్ళొకరు పోతే అక్కడా నవ్వుతున్నారు, అంతా ఏడుస్తుంటే! 
ఏవండీ, ఆపండీ, అంటే శవాన్ని చూస్తే ఏదో జోక్‌ గుర్తొచ్చిందిట! అందుకు నవ్వుతున్నానన్నారు!

అల్లుడు ఇంటికొస్తే అతని మీద తాను చదివిన జోక్‌ ఏదో ప్రయోగించి విరగబడి నవ్వారు. అతనిక్కోపం వచ్చి రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. అతని వెనకాల గుమ్మం దాకా వెళ్ళి అతను వెళ్ళిందాకా ఆపండాపండని నేను ఎంత మొత్తుకుంటున్నా వినకుండా విరగబడి నవ్వుతూనే ఉన్నారు!

ఓ రాత్రివేళ లేచి ఇంటి కప్పు ఎగిరిపోయేలా నవ్వడం, నిద్దర్లోను నవ్వడమే! అదేం నవ్వో! పాడు రోగంలాగా దాపరించిందనుకోండి!

చివరికి రెండ్రోజుల క్రితం హాల్లో కూచుని పగలబడి నవ్వుతూ అలాగే వెనక్కి విరుచుకు పడిపోయారు. అదే ఆఖరి నవ్వు.

నలుగురూ వచ్చి నోరు మూద్దామని చూస్తే ఆ నవ్వడంలో బిగుసుకు పోయిందో ఏమో? ఎంతకీ మూత పడదే? 

చివరికి ఆ తెరిచిన నోరు తెరిచినట్టుగా ఉండగానే అంత్యక్రియలు పూర్తి చెయ్యాల్సి వచ్చింది. 

నా అంత్యక్రియల్లో నవ్వుతూ ఉన్నవాళ్ళకే నా ఆస్తి అని వీలునామా రాసి పెట్టి పోయారు, తన సంతకం కింద స్మైలీ గుర్తు పెట్టి మరీ!

అది చూసి మాకిప్పుడు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదన్నయ్యా‌! 😢




ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5