The hyper sensitive గృహిణి

 



ఇదిగో చూడండీ, నా మనసు జున్ను ముక్కలాంటిది. ఎవరన్నా చిన్న మాటన్నా పడలేను. 
కత్తితో పచక్‌ పచక్‌ మని కోత పెట్టినట్టు అయిపోతుందది. అదేనండీ,జున్ను ముక్కలాటి నా మనసు.
 తట్టుకోలేను!

ఒకసారి మా పెద్దన్నయ్యా వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, 
అదిగో అందరికీ మా పెద్దన్నయ్య సింగపూరు నుండి తెచ్చిన కప్పుల్లో కాఫీ ఇచ్చి, నాకు మాత్రం మామూలు మేడ్‌ ఇన్‌ అనకాపల్లి కప్పులో కాఫీ ఇచ్చింది మా పెద్ద వదిన!
దాంతో నా మనసు కాగుతున్న సాంబారులా కుతకుతలాడి పోయింది. వెళ్ళి మా అన్నయ్యతో చెప్పా. 
తన భార్యని మందలించాలా?
కావాలని చేస్తుందా ఏమిటి? చిన్న విషయాన్ని పెద్దది చెయ్యకు అని నన్నే ఉప్మాలో కరివేపాకులా తీసిపారేసాడు. 😢
ఇది జరిగి పాతికేళ్ళవుతోంది!
ఆ రోజునుండి ఈ రోజుదాకా మా పెద్దన్నయ్య గుమ్మం తొక్కలేదు నేను!

అల్లాంటిదే మరో అవమానం. 

పంక్తిలో  భోజనాలకి కూచున్నానా,పిండి వడియాలంటే ఇష్టమని తెలిసీ నోరు తెరిచి మారు అడిగిన నాతో, 
అయిపోయాయి అక్కా! ఏమీ అనుకోకండీ! అంది, మా రెండో పిన్నత్త గారి మూడో కోడలు,కిసుక్కున నవ్వుతూ.
 అది వినగానే ఆ అవమానానికి వేగిపోయిన అప్పడంలా అయిపోయింది నా హృదయం. 😢
ఇది జరిగి ఇరవై ఏళ్ళవుతోంది!
ఆ రోజునుండి ఈ రోజు వరకూ మా పిన్నత్త గారింట్లో విస్తరి వెయ్యలేదు నేను!

ఇంకోటీ చెప్తా. 

మా ఆడపడుచు కూతురు పెళ్ళికి నాకు పెట్టిన చీర గురించి.
 
ఎల్లాంటి చీర పెట్టిందో తెలుసా? నాకు ఆ రంగు నచ్చదని తెలిసీ, ఆ రెండంచుల చీర నేను కట్టనని తెలిసీ, సరిగ్గా అల్లాంటి చీరే పెట్టింది. 
అదేమిటంటే, ఆఫర్‌ లో కొన్నాను, పరవాలేదులే, ఈసారికి కట్టుకోవమ్మా అంది వెటకారంగా.
నా మనసుంది చూసారూ, పాలల్లో ఉప్పు గల్లు వేసినట్టు విరిగిపోయింది. 😢
ఇది జరిగి పదేళ్ళవుతోంది!
ఆ రోజునుండి ఈ రోజు వరకూ మా ఆడబడుచు మొహం చూడలేదు నేను!

ఇదిగో, ఇంతలేసి అవమానాలు చేసారా? ఏమిటమ్మా మా ఇళ్ళళ్ళో ఏ కార్యక్రమాలు జరిగినా రావూ? అంటూ సాగదీస్తారు మళ్ళీ వీళ్ళే, ఏమీ ఎరగనట్టు, అంతా మర్చిపోయినట్టు. 

అన్నవాళ్ళు, అవమానం చేసిన వాళ్ళు మర్చిపోయినా పడ్డవాళ్ళం మనం మర్చిపోతామా? 

ఛీ!ఛీ! పాడు లోకం,పాడు మనుషులు! 😢

నేనైతే ఒకటే అనుకున్నా, నన్నింత బాధపెట్టిన వాళ్ళు నా గుమ్మంలోకి రావద్దు, చచ్చినా ఈ జన్మలో నేను వాళ్ళ గడప తొక్కను అని! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5