ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5
ప్రగతిశీల పాప్‌స్టార్ అవ్వాలని నాకేం కోరికలు లేవుగానీ, ఇంకేమైనా కాస్త సున్నితంగా ఉండే ఐడియాలు చెప్పరా,బాబూ!
ఇందుకనే రా, జబ్బలు వాచేలా కథల మీద కథలు రాస్తూ పోయావ్ గానీ నీకు ఒక్క కథా ప్రచురణకు పోలేదు!
ఓకే. సరే, ఒక మంచి ఐడియా ఇస్తా, విను.
నీలాంటి అప్‌కమింగ్ అభ్యుదయ రచైతకి సరిపోతుంది.
అనగనగా ఒక ఆధునిక అభ్యుదయ లేడీ.
సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటుంది.
ఆవిడ సహచరుడు డాలర్ల కోసం దేశాలు పట్టిపోయి ఉంటాడు.
సహచరుడు అంటే Boy friend?
కాదు. జీవన సహచరుడు.
ఓ! అలా చెప్పు. మొగుడా?
మొగుళ్ళు,మొద్దులు సంప్రదాయ స్త్రీలకు ఉంటారు.
అభ్యుదయ స్త్రీలకు సహచరుడు ఉంటాడు. తెలిసిందా?
ఇద్దరికీ తేడా ఏమిటో?
అభ్యుదయ నిఘంటువు ప్రకారం, సహచరుడు సాటి రైలు ప్రయాణీకుడులాంటి వాడు.
మొగుడు అనేవాడు ఒక గుదిబండ.
తెలిసిందా?
ఎలా?
మొగుడు అనే జీవి కుటుంబ గౌరవం, కుటుంబ సాంప్రదాయం, ఆచారాలు,కట్టుబాట్లులాంటి తట్టెడు పితృస్వామ్య బాగేజీతో వస్తాడు.
అదే సహచరుడైతే, ఇంచక్కా చేతులూపుకుంటూ వచ్చి , మనతోపాటు ఇంచక్కా సాయిలాపాయిలాగా, ఇంచక్కా మనం ఎలా చెబితే అలా వింటూ ఇంచక్కా ఉంటాడు.
తెలిసిందా?
బాబోయ్! నాకంతా కొత్తగా ఉందీ టెర్మినాలజీ!
మన బెజ్వాడలో ఎర్రంబలి పబ్లిషింగ్ హవుస్ లో దొరుకుతుంది, అభ్యుదయ నిఘంటువు.
కొనుక్కుని చదువుకో. ఓకే?
Next, మన కథలోకి వద్దాం.
అభ్యుదయ లేడీ ఎదురింట్లో ఆమె సహోద్యోగి తన భార్యతో సహా ఉంటుంటాడు.
ఆ భార్య వ్రతాలూ అవీ చేసుకునే పాతకాలపు సంప్రదాయ స్త్రీ.
ఆ కొలీగ్ వైఫ్ తన వ్రతాలకి, పేరంటాలకు ఈ అభ్యుదయ లేడీని పిలుస్తూ ఉంటుంది.
కానీ, అభ్యుదయ లేడీకి అవంటే చిరాకు, కొలీగ్ వైఫ్ అంటే జాలి.
అయితే, ఆ సహోద్యోగి మాత్రం మన అభ్యుదయ స్త్రీ అంటే చాలా ఇదిగా ఉంటాడు.
అతను అంత ఇదిగా ఉండడం ఆవిడకి అదిగా అనిపిస్తుంది.
ఓకే?
సరిగ్గా ఈవిడ జాగింగ్ చేసే టైంకి తనూ బయల్దేరే వాడు.
అది ఆవిడకి నచ్చలేదు.
జాగింగ్ టైం మార్చుకోవచ్చుగా ఈవిడ?
అభ్యుదయ స్త్రీ ఎవరికో భయపడి జాగింగ్ టైం మార్చుకోదు.
ఈవిడ తాళి వేసుకుంటుందిగా.
సహోద్యోగికి ఆమాత్రం తెలీదా ఏమిటి?
అందుకేరా, నీ కథలు ప్రచురింపడనిది.
తాళి, పాఠోళి అభ్యుదయ స్త్రీకి అవసరం లేదు.
తెలిసిందా?
ఇంకా ఏవో forward messages అవీ పంపేవాడు. అదీ ఈవిడకి ఏదోలా అనిపించి అదోలా అనుకుని చిరాకు పడేది.
Forward message లు పంపితే పుణ్యమే కదరా?
ఏదో నేరమన్నట్టు చెబుతున్నావే?
Forward messages బాటు రోజూ good morning, good evening, good night messages పంపేవాడు. అది మన లేడీ అభ్యుదయానికి నచ్చలేదు, ఓకే?
అంత అభ్యుదయ లేడీ అంటున్నావు, ఏదో కొలీగ్ కాస్త friendly గా ఉంటే తప్పంటున్నావ్?
అభ్యుదయ లేడీ తనకు నచ్చితేనే స్నేహం చేస్తుంది. లేకపోతే కటిఫ్! ఓకే?
ఒక్కసారి అన్నయ్యా! అని పిలిస్తే problem solve కదరా?
దానికింత కథ ఎందుకు?
కూరలబ్బాయిని అన్నయ్యా అని, ఇంటి ఓనర్‌ని బాబాయ్ గారూ అని పిలవడానికి ఆవిడేమీ సాంప్రదాయ దద్దోజన లేడీ కాదు, తెలిసిందా?
అయినా కొలీగ్స్ ని అన్నయ్యా, మామయ్యా అని పిలుస్తారా ఎవరైనా?
అదీ నిజమే. పోనీ, మీరు నాకు just మంచి friend. నాకు నా సహచరుడు ఉన్నాడని చెప్పొచ్చుగా ఈ మోడ్రన్ లేడీ?
మోడ్రన్ లేడీ ఎవరికీ, ఎప్పుడూ సంజాయిషీ ఇవ్వదు. ఓకే?
వాళ్ళ ఆయన ఇదవడం చూసి దద్దోజన స్త్రీ అపార్థం చేసుకుని అభ్యుదయ లేడీని కడిగి పారెయ్యడానికి వస్తుంది.
మన అభ్యుదయ కథల్లో సంప్రదాయ చట్రంలో ఇరుక్కుపోయిన వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తించాలి అన్న రూల్ చెప్పాగా నీకు? అదన్న మాట.
అప్పుడు, మన అభ్యుదయ లేడీ, నా సహచరుడి కన్నా గొప్ప వాడైతే తప్ప నేను ఎవరినీ ఇష్టపడను. మీ ఆయనకి అంత సీన్ లేదు. డోంట్ వర్రీ అంటుంది ఎంతో సౌమ్యంగా, సంస్కారవంతంగా.
ఛీ!ఛీ!ఛీ! ఇవేం కథలురా బాబూ?
ఇవే ప్రచురింపబడే కథలు! తెలిసిందా?
సరేరా. ఇదే కథను ముగింపు మార్చి రాస్తా.
సంప్రదాయ స్త్రీ ఓ రోజు అభ్యుదయ స్త్రీ ఇంటికి వచ్చి, రేపు మీ ఇంటికి నేనూ మీ అన్నయ్యా భోజనానికి వస్తాం వదినా! రేపు భగినీ హస్త భోజనం. ఈయనకు అక్కచెల్లెళ్ళు లేరాయె. నువ్వే చెల్లిగా రేపు నీ చేత్తో భోజనం వడ్డించాలి అంటుంది నవ్వుతూ.
ఇదీ ముగింపు. ఎలా ఉంది? అభ్యుదయ స్త్రీలకు తెలీదేమో గానీ సంప్రదాయ స్త్రీలు ఇలాంటివన్నీ చిటికెలో తేల్చేస్తారు!
రేయ్! రేయ్! పాత చింత పచ్చడి రక్త సంబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం టైపు ముగింపులు ఇచ్చావనుకో, అభ్యుదయ లేడీస్ అంతా కొట్టడానికి వస్తారు!
నువ్వు రాసే భగినీ హస్త భోజనం బెండకాయ ఆ సదరు సంపాదకుడికే తెలిసుండవు! ముందు సంపాదకుడికే తెలుగు రాదు. నువ్వు అతగాడికి తెలియని పదాలతో కథ రాసి పంపావనుకో, తనని అవమానించడానికే అల్లాగ రాసావని, నువ్వో అగ్రవర్ణ అహంకారివని అందుకే పెద్ద పెద్ద తెలుగు సమోసాలు రాస్తున్నావని ప్రచారం చేసి పెడతాడు. తెలిసిందా?
సమోసాలేవిట్రా? సమాసాలు కదా?
కదూ? నాతో అంటే అన్నావ్ గానీ ఇంకెవరితోనూ అనకు.