ధ పొట్టలో చుక్క కథ

 


అప్పనంగా వచ్చిపడుతున్న తెలుగు భాషాప్రవీణ డిగ్రీ ఒకటి జేబులో వేసుకుందామని చాలామంది క్రౌంచద్వీప కవులు, రచయితలు ఈమధ్య పెన్నులు,అట్టలు పుచ్చుకుని ప్రవేశ పరీక్షకు బయల్దేరారు. 

వాళ్ళల్లో నేనూ ఒకడిని. 

యాభై ఏళ్ళుగా సాహిత్యాన్ని వేయిస్తున్నా. ఇంకా వేగవలసింది చాలా ఉంది. అంచేత తెలుగులో ఓ డిగ్రీ కూడా ఉంటే అలంకారప్రాయంగా ఉంటుందని బయల్దేరా. 

తీరా పరీక్ష హాల్లో చూస్తే నా బెంచీ చుట్టూ నాకు తెలిసిన వాళ్ళే! 
ఇదేదో భలే భలేగా బావుందే! ఇంక విందుగా పసందుగా పరీక్ష పాసైపోవచ్చనుకున్నా. 

మొదటి ప్రశ్న: 
First Literary meeting అన్న ఆంగ్ల పదాన్ని తెలుగులో వ్రాయుము. 

ఓస్‌,ఇంతే కదా, నా సుదీర్ఘ సాహితీ జీవితంలో ఎన్నెన్ని మీటింగులెట్టలేదూ? అనుకుంటూ జవాబు రాసి పారేసా. 

“ప్రధమ సాహితీ సమావేశం” 

ఇంతలో గొప్ప అనుమానం వచ్చిపడింది. “ప్రధమ” నా? లేకపోతే “ప్రథమ” నా? పొట్టలో చుక్క ఉందా లేదా అని! 

నా వెనక బెంచీలో నా సీనియరు వెవ్వెవ్వే వెంకోజీ పేపర్లో కాపీ కొడదామని వెనక్కి తిరిగి చూసా. 

“మొదటి లిటరరీ మీటింగు” అని ఉంది!

అది చూసి డంగయ్యా! అవునూ నేను కూడా “మొదటి” అని రాయెచ్చుగా? ప్రధమ కోసం పాకులాడే బదులు? అని అనుకునేలోగా పరీక్షకుడు వచ్చి “మొదటి” అన్న పదం నిషిద్ధం అని ప్రకటించేటప్పటికి తొలి అవధానానికి కూర్చున్న లేత అవధానిలా నాతోబాటు అంతా కళవళపడ్డారో నిమిషం. 

నేను వెనక్కి తిరిగి భలే అయ్యిందిలే నీకు వెంకోజీ అన్నట్టు ఓ వెకిలి నవ్వు నవ్వి, నా పక్క బెంచీలో కూచున్న జెప్ఫా భాయి ఏం రాసుంటాడా అని తొంగి చూస్తే, వాడు వెంకోజీ కన్నా అధ్వాన్నం!

“ప్రత్మ శాహ్తీ సమావేషం” అని రాసి గర్వంగా తలెగరేస్తున్నాడు!
 
ఓరి వీడి గీర గాడిదలెత్తుకు పోనూ! అనుకుంటూ నన్నిక కాపాడే దేవుడు నా స్నేహితుడు భాషేషేనని, భాషేషుని పేపరులోకి తొంగి చూసా. 

ప్రధమ కి ప్రథమ కి తేడా గురించి వేల యేళ్ళుగా భాషా పండితులు తన్నుకుంటున్నారనడానికి మనకు నిదర్శనాలున్నాయని తెలుస్తోందని తెలుస్తోంది. 
అసలు ప్రధమ అన్నది మెసపటేమియా పదం ప్రొధొమే అన్న పదం నుండి వచ్చింది. అది ప్రస్‌ + ధస్‌ ల కరచాలనం వల్ల వచ్చింది. 
ప్రథమ అన్నది నైలు నదీతీరంలో ఓ రాయి మీద వ్రాసిన లిపిలో దొరికింది. కానీ ఆ రాయి మీద ప్రథ్‌ వరకే ఉంది. మిగిలిన భాగం విరిగిపోయి నైలు నదిలో పడి కొట్టుకుపోయి ఉంటుందని భావిస్తున్నారు భాషాశాస్త్రవేత్తలు. ప్రస్తుతం ఆ రాతి ముక్క ప్రయాణ మార్గాన్ని పరిశోధిస్తున్నారు… 

ఇలా పేజీలకు పేజీలు వ్రాస్తూ ఇప్పటికే నాలుగు ఎడిషనల్‌ పేపర్లు తీసుకున్నాడు! ఓసి తెలుగోయ్‌! 

ఇంక ఎడమ వైపు కూచున్న వీరంగం స్వామి పేపర్లోకి చూసా.

“పెహ్లీ తెలంగీ ములాఖాత్‌” అని రాసేసి అందరి వంకా కోపంగా చూస్తున్నాడు! 

అయ్య బాబోయ్‌! నాకెందుకొచ్చిన గొడవ అనుకుని కాపీ కొట్టడానికి విస్కీ స్వామి బెటర్‌ అని అతని పేపర్లోకి తొంగి చూస్తే,

“ప్రధమ సాహితీ సమావేశం” లేక “ప్రథమ సాహితీ సమావేశం” రెంటిలో ఏదో ఒకటి రైటని నాకనిపిస్తోంది. ఈ పరీక్ష పేపరు దిద్దుతున్న మీదీ మా గోత్రమేనని నాకు తెలుసు. నా గోత్రం నాకు ఈమధ్యే తెలిసింది. వెంఠనే హిందూబంధూ సభ పెట్టేసా. మిమ్మల్ని దానికి ట్రెజరర్‌ కమ్‌ సెక్రెటరీని చేస్తా. కానీ ఒక్క షరతు! ఈ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానానికి నాకు ఫుల్లు మార్కులు వెయ్యాలి మీరు. వేస్తున్నారంతే. మీరు వేస్తారని నాకు తెలుసు! వేస్తారు కదూ! ఇట్లు మీ సగోత్ర విస్కీ స్వామి. ♥️♥️

ఓరి దేవుడోయ్‌, నేరుగా పేపర్లు దిద్దేవాళ్ళకే పాలకోవా వేస్తున్నాడు వి.స్వా!

ఇంతకీ నా సందేహానికి సమాధానం దొరకలేదు. దూరంగా చండ్రహింసా రావు పక్కనున్న ఇస్త్రీవాదికి సైటు కొడుతూ కాలక్షేపం చేస్తున్నాడు. సమాధానం రాసేసినట్టున్నాడు అందుకే కాన్ఫిడెంటుగా ఉన్నాడని, నా పొట్ట వంక చూపిస్తూ సైగ చేసా, ఒకటో ప్రశ్న అని ఓ వేలు గాల్లోకి చూపిస్తూ. నా ప్రశ్న అర్థం అయ్యిందో లేదో బట్టతల చూపిస్తూ హిహ్హీ అని నవ్వాడు. అయితే పొట్టలో చుక్క లేనట్టే అని అర్థం చేసుకుని చుక్క పెట్టకుండా చక్కా రెండో ప్రశ్నలోకి వెళ్పోబోయా. 

ఇదంతా క్రీగంట గమనించిన పరీక్షకుడు నన్నూ చండ్రహింసని పరీక్ష హాల్లోంచి బయటికి పొమ్మంటే, మాకిదంతా కొట్టిన పిండి కనుక మేమిద్దరం పరీక్షకుడిని కన్ఫూజ్‌ చేసి తప్పంతా ఇస్త్రీవాది మీదకు నెట్టి మా స్థానాల్లో మేం మళ్ళా కూచున్నాం. 

చుక్క తెచ్చిన చిక్కును చుక్క మీదకు నెట్టి చక్కా కూచున్నా చుక్క ఉంచాలా వద్దా అన్న నా సందేహం తీరలేదు. ఆశ చావక వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూస్తే “1 వ లిటరరీ మీటింగు” అని రాసి ఉంది.

అబ్బా, ఉపాయం బావుందని “1వ సాహితీ సమావేశం” అని సమాధానం రాసి, ఈ భాషాప్రవీణ పరీక్షకు ఈమాత్రం తెలుగు చాల్లే అని రెండో ప్రశ్నలోకి నడిచా. 

(ప్రథమ/ప్రధమ అంకము సమాప్తము.)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5