మెలిక శ కుంటిన కథ

 


రెండవ ప్రశ్న: 
Helmet అను ఆంగ్ల పదమునకు సరియైన తెలుగు పదమును సూచించుము. 

అరెరే,ఇది నాకు తెలిసిన పదమే! సమయానికి గుర్తొచ్చి చావడం లేదని ఏదైనా హింటు దొరుకుతుందేమోనని వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూసా. 

“హెల్మెట్టు” అని రాసి ధీమాగా కూచున్నాడు వెంకో.

హెల్మెట్టు, కందట్టు,ఆమ్లెట్టు ఏంటో వీడి బొంద తెలుగు అనుకుంటూ జెప్ఫాభాయి పేపరులోకి చూసా. 

“తల్కి ఇన్ప టోపీ” అని రాసి ఈ పేటకు నేనే మేస్తిరీ టైపులో కూచున్నాడు. 

ఓరి వీడి తెలుగు తగలెయ్యా అనుకుంటూ మనకు అచ్చ తెలుగు కవీశ్వరులైతే మంచి సహాయమౌతుందని ఉపాయంగా ఆలోచించి, మెడ కొంచెం బారసాచి వారి పేపరులోకి తొంగి చూద్దును కదా,

“డిప్పకాయ డొప్ప” 
లేక 
“తలకాయ గురుగు ముంత”
 లేక 
“డిప్ప తపేలా” 

 ఇంకనూ అచ్చ తెలుగు కూతలు వలసిన వారి మేలు తలపుల కొరకు నా కూత పెట్టె అంకె: 123-123-1234. తల్లి విన్కి చున్కి మాటలు కన్కి అచ్చ తెనుగు మన కలుగు వెలుగు మలుగు నలుగు. మంగిడీలు.🙏


 అమ్మోయ్, ఇది మనకు పనికొచ్చే తెలుగు కాదని వీరంగం స్వామి పేపరులోకి చూద్దును కదా,

“శిర్‌ కీ దావత్‌వాలీ భాండీ” or “తల్కాయ్‌ భాండీ” 

అని రాసేసి అందరివంకా నిప్పులు కురిపిస్తున్నాడు. 

పోనీ, వాదకవి కంది గింజల గారి వద్ద కాపీ కొట్టవచ్చును కదా అని, 
మా జోరుగా మిడిసి పడుతున్న వారి వంక తొంగి చూస్తే,

హెల్మెట్టు
తెలుగోడి
తల కట్టు
కాదంటె
తెగ తిట్టు
బూతు కొట్టు!
పెసరట్టు
ఉల్లట్టు
మరి పట్టు
అట్టా పెట్టు 
తల తట్టు
హెల్మెట్టు
చెప్పాగా
తెలుగోడి
తల కట్టు
కాదంటె
తెగ తిట్టు
బూతు కొట్టు!

అంటూ జోరుగా రాసుకుంటూ పోతున్నాడు. అక్కడ అడిగిందేమిటి, ఈయన రాసే కొండవీటి చేంతాడేమిటని విస్తుపోయి,
ఇదీ మనకు పనికిరాదని విస్కీ స్వామి పేపరులోకి చూస్తే, 

“శిరో భారము” అనగా శిరస్సు మీద పెట్టుకునే భారము 
అని వ్రాసి చిరునవ్వులు చిందిస్తున్నాడు,
 బ్రాకెట్లో ఇట్లు మీ సగోత్ర స్వామి అని కూడా వ్రాసి కూచున్నాడు. 

ఆహా! గుర్తొచ్చింది! శిరఃస్రాణము కదూ! Yes! అదే! అదే! 
కానీ, విసర్గ ఉన్నదా? లేనట్టే ఉంది! 

ఇంతలో కలకలం. పరీక్షకుడిని ఎల్లాగో బెదిరించి లోనికొచ్చిన ఇస్త్రీవాది కేకలు పెడుతోంది. భాషకీ లింగభేదం ఉంటుందండీ! ఈ హెల్మెట్టన్నది స్త్రీలింగమా? పుంలింగమా? చెబితేగానీ పరీక్ష జరగనివ్వనని ఉక్రోషపడుతోంది. 

పరీక్షకుడు ఆ గొడవలో ఉన్నాడు కనుక ఇదేదో మనకు లాభించేట్టుందని, నా స్నేహితుడు చండ్రహింస వైపు చూసి చేతులు గుండ్రంగా విసర్గలాగా చేసి, ఉందా అన్నట్టు సైగ చేసా. వెంటనే ఎడమ చెవి గోక్కుని నాకు సమాధానం చెప్పాడు. ఎడమ చెవి గోక్కుంటే “లేదు” అని, కుడి చెవి గోక్కుంటే “ఉంది” అని మేం పెట్టుకున్న కొండ గుర్తుల్లో రెండు.

అయితే “శిరస్సు స్రాణము” అని వ్రాయనా? అనుకున్నా గానీ అప్పుడవి రెండు పదాలై పోతాయే? ఇంతకీ “స్రాణము” అన్న పదం ఉందా అని డౌటొచ్చింది. “స్రావము” ఉన్నప్పుడు “స్రాణము” ఎందుకుండదూ? ఉండే ఉంటుంది.  అది “శ్రాణము” కూడా కావొచ్చునేమో శ్రావణములాగా? తలకి వ్రణము కాకుండా కాపాడేదేమో శ్రాణము? 
అనీనీ సందేహము ఆవరించిందిగానీ చివరికి స్రాణమే గెలిచింది. 

పోనీ, శిరస్సు + స్రాణము = శిరస్స్రాణము అని రాస్తే! 
శిరస్సు పగిలి స్రావము రాకుండా కాపాడునది శిరస్స్రాణము! 

అహా, సెహభాష్‌! అని నన్ను నేను అభినందించుకొని నేను సమాధాన పడిన ఆ సమాధానాన్ని అక్కడ సంధించి మూడో ప్రశ్నలోకి అడుగు పెట్టాను. 

(సశేషము/శసేషము/ససేషము/శశేషము)


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5