या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
సభ కిటకిటలాడుతోంది అక్కడ.
చిఱుతప్రాయపు కుఱ్ఱవాడొకడు, నిండా పదహారేండ్లు లేవతనికి.
అవధానిగా రంగప్రవేశం చేసి పృచ్ఛకులను నిరుత్తరులను చేసిపారేస్తున్నాడు. శెహభాష్ అనిపించుకుంటూ ఉన్నాడు ప్రేక్షకులతో, కరతాళ ధ్వనులు అలలలుగా పైకి లేస్తుండగా. అవధాన సీమలో వ్యాఘ్రంలాగా సంచరిస్తూ చెలరేగుతున్నాడు.
అవధాని గారికి మంచి పిల్లను వెతికి పెడతాం, తాళి కడతారా అన్నాడు అప్రస్తుత ప్రసంగి.
అవధాని గారి పద్యం అమ్మాయి నడకలాగా ఉందని చమత్కరించాడో పృచ్ఛకుడు.
అవధాని గారు నరసింహుడినే కాదు, ఆయన ఒళ్ళో కూచున్న లక్ష్మిని కూడా చూడాలని ముసిముసి నవ్వులు నవ్వాడు మరో పృచ్ఛకుడు.
యువ అవధాని వలపుల మీద, వివాహం మీద అనేకానేక ఛలోక్తులతో అవధానం ఆహ్లాదకరంగా సాగింది.
విజయవంతంగా ముగిసిపోయింది కూడాను.
ఇంతలో ఎక్కడనుండి వచ్చాడో ఓ వృద్ధుడు, నుదుటిని త్రిపుండ్రాలు,
చెవులకు బంగారు దిద్దులు, మెడలో రుద్రాక్షలు,పచ్చని మేనిఛాయ.
ఆశీస్సులు నీకు బాబూ, ఆ సరస్వతీ దేవి కటాక్షం నీకుంది. అద్భుతంగా వచ్చాయి పూరణలు!
అయితే బాబూ, ఒక్క విషయం. ఇక్కడ నీ మీద ఛలోక్తులాడిన పృచ్ఛకులున్నారే, వారూ ఒకప్పుడు నీలాగే గొప్ప మేధోసంపత్తితో మహోత్సాహంతో సాహితీ రంగంలోకి కాలుమోపిన వారే. అయితే ఇతరేతర అనేక విషయాలు వారి జీవితాలను ఆక్రమించి శాస్త్రము,సాహిత్యము కేవలం అభిరుచులుగా మిగిలినవి.
వారి శక్తియుక్తులన్నీ సంసార నిర్వహణకు,ధన సంపాదనకు ఖర్చు పెట్టేసారు, కాలం గడిచిపోయింది.
వారి కర్మ ఎటు లాక్కుపోతే అటుపోతున్నారు నిస్సహాయంగా.
ఇప్పుడు వారు చేయగలిగిందల్లా వారు పడ్డ గోతిలోకి నీవంటి వారిని కూడా నెట్టడడమే. నీ ప్రతిభ,స్వచ్ఛత వారిని కలవరపెట్టాయి. వారు పోగొట్టుకున్న ప్రతిభాపూర్ణమైన బాల్యం గుర్తొచ్చింది పాపం.
ఈ బాలుడు మనకన్నా చాలా చాలా గొప్పవాడైయ్యేట్టున్నాడే అన్న ఈర్ష్య ఆవరించింది.
కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు ఏవీ ఇంకా అంటక స్ఫటికంలాగా స్వచ్ఛంగా ఉన్నాడే అని అసూయ వారి హృదయాల్లో ఎక్కడో పొడసూపింది. వెంటనే లోకసంబంధమైన బురదలున్నాయే, అవన్నీ నీకు అంటించడానికి బయలుదేరారు.
చూడు నాయనా, బ్రాహ్మణులు ఉద్యోగాల్లోకి, వ్యాపారాల్లోకి వెళ్ళి ధన సంపాదనలోకి దిగడం వారికి లాభదాయకము,సుఖదాయకము. నిజమే.
కానీ, వేదం,శాస్త్రం ధర్మనిష్ఠతో అధ్యయనం చేసేవారు లేక లుప్తమైపోతే దేశానికి, సనాతన ధర్మానికి తీరని నష్టం. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించడం లేదు కదా అని నిరాశ చెందరాదు.
భగవంతుడు నీకు కావాల్సినంత మేధస్సును, బుద్ధికుశలతను ఇచ్చాడు.
ధనాన్ని,సుఖాన్ని పక్కన పెట్టి ధర్మ రక్షణకు జీవితాన్ని అంకితం చెయ్యి, విజయోస్తు!
అంటూ అక్కడినుండి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.
అవధాని గారు పక్కకు తిరిగి ఏదో వింటున్నట్టుగా ఆగి పోవడం తెలిసిందిగానీ అతనెందుకు అలా కూర్చుండి పోయాడో అక్కడెవరికీ అర్థం అయింది కాదు.
( या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी।
The wakefulness of the yogi is the night for the ordinary person.)