శ్రీ శ్రీ చంద్ర చెకోడీ

 


గగనమంతా నిండి 

పొగలాగు క్రమ్మి,

బహుళ పంచమి జ్యోత్స్న 

భయపెట్టు నన్ను!


కవిత బానే ఉంది. వెన్నెల పొగలాగా కమ్మడం ఏమిటో  విచిత్రం! వెన్నెల భూమి మీదకు కురుస్తుందిగానీ ఆకాశమంతా నిండడం అదేమిటో చూసావుటయ్యా చోద్యం? 


ఆకాశపుటెడారి 

అంతటా, అకట!

ఈ రేయి రేగింది 

ఇసుక తుపాను!


తెలుగు నాట ఎడారులున్నవా? ఆకాశం ఎడారిలాగా ఉందిట! ఆ ఎడారిలో “ఇసుక” తుఫాను రేగిందిట! అంటే ఆకాశంలో ఇసుక తుఫాను! అవకాశం ఉందా? 


గాలిలో కానరాని 

గడుసు దయ్యాలు

భూ దివమ్ముల మధ్య 

ఈదుతున్నాయి!

రవిగాంచని చో కవిగాంచునని ఊరికే అన్నారా? ఎవరికీ కనిపించని గడుసు దయ్యాలు కవిగారికి కనిపించాయి. అవి భూ దివమ్ముల మధ్య “ఈదుతున్నాయి”ట! దెయ్యాలు గాలిలో హాయిగా ఎగిరిపోతాయని విన్నాంగానీ ఇలా కష్టపడి ఈదుతాయని ఇంతవరకూ తెలవదు సుమీ! 


నోరెత్తి, హోరెత్తి 

నొగులు సాగరము!

కరి కళేబరములా 

కదలదు కొండ!

ఆకాశపు టెడారి

లో, కాళ్లు తెగిన

ఒంటరి ఒంటెలా

గుంది జాబిల్లి!


పర్వతాలు, కొండలు ఏనుగులులాగా ఉన్నవని పోల్చడం మన సాంప్రదాయం. కానీ కవిగారు వాటిని చచ్చిన ఏనుగుతో పోల్చి పోయారు పాపం. ఏనుగు బతికినా వెయ్యే చచ్చినా వెయ్యే అన్నారు కనుక ఆలాగున సరి పెట్టుకొమ్మని కవిగారి కరి కిరికిరి కాబోలు. 

ఆకాశపుటెడారి అని ఒకసారి చెప్పింది చాలలేదేమో సత్యం సత్యం పునః సత్యం అన్నట్టు మళ్ళీ చెప్పారు కవిశ్రీ.

 కాళ్ళు తెగిన ఒంటరి ఒంటెట! కాళ్ళు విరగడం కాదు, కాళ్ళు “తెగిన”ట! అంటే ఎవరో కోసేసినట్టు రూఢి అవుతోంది. సరే, ఆ విషయం పక్కన పెట్టండి, ఒంటెకు చంద్రుడికి రూప సారూప్యత ఏమైనా ఉందా? 

కాళ్ళు లేని ఒంటె బొమ్మ గీస్తే అది జాబిల్లిలాగా ఉంటుందా? ఉండదే?? 

అసలు జాబిల్లి అంటే తెలుగు వారి మనస్సులో అందమైన ఊహలు మెదులుతాయి గానీ ఈ విదేశీ బ్రాండు రసాభసలు ఒంటెలు గాడిదలు మెదలవు మరి.

 అయినా ఎడార్లు,ఒంట్లు, ఇసుక తుఫాన్లు ఈ అరేబిన్‌ నైట్స్ ప్రతీకలు ఏమిటో కవి గారి పాశ్చాత్య పైత్యమని సరిపెట్టుకోవాలి.

విశ్వమంతా నిండి, 

వెలిబూదివోలె,

బహుళ పంచమి జ్యోత్స్న 

భయపెట్టు నన్ను! 


పైన గగనమంతా నిండి అన్నాక మళ్ళీ “విశ్వమంతా నిండి” అనుడు ఏమిటో ఆ పరమాత్మ కెరుక. విశ్వమా? గగనమా? ఏదో ఒకటి సరిగ్గా చెప్పాలని నా డిమాండు. అది చెప్పడానికి కవి గారు ప్రస్తుతం మన మధ్య లేరు కనుక గాలిలో ఈదే గడుసు దెయ్యాలను అడిగి తెలుసుకుంటాను. స్వస్తి.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు