రెండు హరికేన్ బెరిల్ దినములు
అది 2024 వత్సరము నాటి జులై మాసము.
ఆనాడు,హయగ్రీవ నగరమందు కోటీ పురమునున్న మా స్వగృహమునందు నాటి తుఫాను ప్రచండ కాళరాత్రి గాఢాంధకారములో, పెనుగాలులకు తాండవమాడుతున్న చెట్లను గవాక్షముగుండా చూచుచూ, ఇంట విద్యుచ్ఛక్తి లేకున్ననూ అప్పుడప్పుడూ లక్ష దీపాల కాంతులతో వచ్చిపోవు మెరుపులను కాంచుచు భయము విస్మయముల మిశ్రమ భావనకు లోనైతిని. అహో,ఏమి ఈ ప్రకృతి విలయ తాండవము!
అంతలో ఇంటి పైకప్పు మీద రాక్షసులు నడచిపోవుచున్నారా అన్నటుల భయోత్పాతము గలిగించు భయంకర శబ్దములు వినవచ్చెను. చెట్ల కొమ్మలు విరిగిన శబ్దములు,ప్రళయ ఝంఝూమారుతముల వికటాట్టహాసములు కర్ణకఠోరమాయెను.
ఆ కాళరాత్రి ఇంటి పైకప్పు తప్పక ఎగిరిపోవుననియే తోచెను. కుటుంబమంతయూ ఇంటిలోని ఒక సురక్షిత ప్రదేశమునకు చేరితిమి.
తాగు నీరును,ఇతర అవసరములకు వాడుకొను నీరును ముందు జాగ్రత్త చర్యగా భద్రపరచితిమి. ఆ రాత్రి ఎట్లో గడిచెను.
మరునాడు అంతర్జాల సదుపాయము లేనందున విధి నిర్వహణ సేయలేనని మా ముఖ్య కార్యనిర్వహణాధికారికి చెప్పివేసితిని. విద్యుచ్ఛక్తితో బనిచేయు ఆధునిక గృహోపరణములే కాక చరవాణి సైతము మూగవోయినందున ఆ రోజు జీవనమంతా క్రొత్తగా తోచెను.
బయట భోరున వర్షము కుండపోతగా కురియుచూనే ఉన్నది.
సహజ వాయువు సరఫరా ఆగనందున నిప్పుపెట్టెనుపయోగించి పొయ్యి వెలిగించి వంట ముగించితిని. భోజనములైన పిమ్మట చేయుటకు వేరొక పని లేనందున నా గ్రంథాలయమును సవరించుట,పుస్తకముల దుమ్ము దులుపుట, ఇంతవరకు తెరువని పుస్తకములను వేరు చేయుట మున్నగు పనులు చేసితిని. కొన్ని పేజీల రచన సాగించితిని. కొత్త పుస్తకమొకటి తెరచి ఏకబిగిన వంద పేజీలు చదివితిని. ఇటీవల కాలములో పుస్తకము తీరుబడిగా చదువు వెసులుబాటును, ఆసక్తియు నేడే కలిగెను. పూర్వపు రోజులు తిరిగి వచ్చినటుల తోచి డెందము ఆనందముతో నిండెను.
ఇంతలో సాయంకాలమాయెను. చీకట్లు ముసిరెను. కొవ్వొత్తులు వెలిగెను. సాయంకాలపు భోజనములు ఆ దీపముల వెలుగులో ముగించి ఆ చిమ్మ చీకట్లలో వ్యాహ్యాళికి పోవగా, ఆహా, విద్యుత్ దీపకాంతులు అడ్డురానందున ఆకాశము సహజసిద్ధముగను,
అందలి తారలు తళుకులీనుచూ అప్పుడెప్పుడో చిన్నతనమునందు శుద్ధ పల్లెటూరిలో నులకమంచములపై పరుండి చూచి ఆనందించిన మిసమిస తళుకు తారలు జ్ఞప్తికి వచ్చి మది ఆనందోత్ఫుల్లమాయెను. మెరయుచున్న ఆ తారాహారావళులను చూచుచూ చీకట్లలో మా ఇంటి వీథుల్లో తిరుగుచూ మా ఇరుగుపొరుగు వారితో మాటలాడుచు బాల్యపు దినములను మరల అనుభవించితిని.
చీకట్లలో నిదిరించుటలోని ప్రాచీన ఆనందమును మరల అనుభవించి ఆనందించితిని.
మరల తెల్లవారెను. అదే స్థితి కొనసాగెను. కానీ ఆనాడు వర్షము ఆగెను. ఎండ తీవ్రమాయెను. శీతలోపకరణములు ఏవియూ పనిచేయనందున గృహమునందు ఉక్కపోత పెరిగెను. అన్ని తలుపులు,గవాక్షములు తెరిచితిమి. చల్లని పిల్లగాలి వీచి ఉపశమనము కలిగెను.మధ్యాహ్న భోజనానంతరము గవాక్షముల వద్ద చాపలు పరచితిమి. చిన్ననాడు ఎండాకాలపు మధ్యాహ్న వేళలలో చాపల మీద నిదురించిన చల్లని రోజుల జ్ఞాపకము మరల మేల్కొన్నది. సాయంకాలము ఇరుగుపొరుగులతో కలిసి ఆరుబయట కాఫీలు,అల్పాహారము సేవించు ఆహ్లాదకరమగు అపురూప సన్నివేశము తటస్థించి చాన్నాళ్ళకు జీవితాన్ని అనుభవించుచున్న అనుభూతి కలిగెను.
ఇంతలో విద్యుత్ సౌకర్యము పునరుద్ధరింపబడెను. కల వంటి ఆ ప్రాతజీవితమునుండి మరల ఆధునిక జీవనములోనికి వచ్చిపడితిమి.
చరవాణులు మ్రోగినవి. దూరదర్శనులు మాట్లాడమొదలిడినవి.
శీతలోపకరణములు తిరిగి కృత్రిమ శీతలత్వమును గొనితెచ్చినవి. మా జీవితములోనికి తుఫాను తెచ్చిన ప్రశాంతత పోయి, తుఫాను ఆగుటచే మరల జన జీవన పరుగుపందెపు అల్లకల్లోలము ప్రవేశించినది.