త్వం శుంఠ! త్వం శుంఠ!

 


ప్రతి ఒక్కడూ అభిప్రాయాలు చెప్పేవాడేనండీ!‌


అవును,బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికీ ఒక అభిప్రాయం ఉంటుంది. 
అవకాశం వచ్చినప్పుడు చెప్పెయ్యాలని తహతహలాడుతుంటాడు!

అసలు ఈ అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయంటారు? 

వాళ్ళు పెరిగిన వాతారణం, 
వాళ్ళు చదివిన పుస్తకాలు,
కలిసిన మనుషులు,
చూచిన ఫిల్ములు 
ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిసి అభిప్రాయాలను ఏర్పరుస్తాయి.

ఈ అభిప్రాయాలు మారుతాయంటారా?

ఓ!మనుషులు మారిపోయినట్టే 
అభిప్రాయాలూ తరచూ మారిపోతాయి! 

సోషల్‌ మీడియాలో ప్రతి ఒక్కడూ అభిప్రాయాలు చెప్పేవాడే!

అవును, ప్రపంచ సమాచారపు వెల్లువలో నేను సైతం నా అభిప్రాయాన్ని వ్యక్తపరచాను! అన్నదే ఇప్పటి నినాదం!

అభిప్రాయాలకు విలువ ఉంటుందంటారా?

వ్యష్టి అభిప్రాయపు విలువ సమాజంలో ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది. 
సమష్టి అభిప్రాయపు విలువ సమూహం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది.

సోషల్‌ మీడియాలో ఎంత అసభ్యకరమైన అభిప్రాయాలు వ్రాస్తున్నారో చూసారా?   

తన పేరు బయటికి రాదంటే మనిషిలోని అసలు మనిషి బయటికి వస్తాడు!

అభిప్రాయాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటారా?

మనిషి ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టే వ్యక్తిత్వం ఏర్పడుతుంది.

గొప్ప అభిప్రాయాలను వెలిబుచ్చే వారి గురించి ఏమంటారు?

నిజంగా గొప్పవారైనా కావాలి,
లేక తెలివైన వారైనా కావాలి. 


తన సొంత అభిప్రాయాల కన్నా 
నలుగురు మెచ్చే అభిప్రాయాలను వ్యక్తం చేసేవాడు?

లోకం పోకడ తెలిసిన వాడు!

రచనలు కూడా అభిప్రాయాలేనంటారా?

సృజనాత్మక రచనకు ఊహే ప్రాణం. 
కానీ, సిద్ధాంతాలకు బానిసలైన రచయితలు చేసేది మాత్రం
వారి అభిప్రాయాల వమనం!

అభిప్రాయాలను వెలిబుచ్చినందుకు ప్రమాదంలో పడ్డవారున్నారే?

అవును. 
అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసేందుకు తగిన వాతావరణం ఉండాలి. 

భావస్వేచ్ఛ గురించి మాట్లాడే వారు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చెయ్యడం లేదూ?

అవును. 
దుర్వినియోగం చెయ్యడానికే భావస్వేచ్ఛ గురించి మాట్లాడ్డం కద్దు. 

భావస్వేచ్ఛ గురించి మాట్లాడే వారు ఎదుటివారి భావస్వేచ్ఛను గౌరవిస్తారంటారా?

తరచుగా ఇది ఏకపక్షం.
 పక్షపాతం. 
ఇంకా తరచుగా వామపక్షం!

అభిప్రాయాల మీద మీ అభిప్రాయాలు బావున్నాయి.

కానీ, ఎవరి అభిప్రాయాన్నీ సరుకు చెయ్యక్కరలేదన్నది నా అభిప్రాయం. 
నా అభిప్రాయం మీద మీ అభిప్రాయం ఏమిటి?

అంటే అభిప్రాయాల మీద ఇప్పటి వరకూ నేను చెప్పిన నా అభిప్రాయాలను కూడా పట్టించుకోనవసరం లేదని మీ అభిప్రాయమా? 

అవును, మీ అభిప్రాయాల మీద కూడా అదే నా అభిప్రాయం! 

అలాగా! అయితే తమరి ఆ సదరు అభిప్రాయం 
శుద్ధ తెలివి తక్కువ అభిప్రాయమని నా అభిప్రాయం! 

నా అభిప్రాయాన్ని తెలివితక్కువ అన్న మీరే 
తెలివితక్కువ వారని నా అభిప్రాయం! 

నన్ను తెలివి తక్కువ అన్న తమరే పరమ శుంఠలని నా అభిప్రాయం!

నన్ను శుంఠ అన్న మీరే శుంఠన్నర శుంఠలని నా అభిప్రాయం! 

అలాగా! ఇంక మాటల్లేవ్‌! 
ఇదిగో నా అభిప్రాయం తీసుకోరా!

డిష్షుం!

అలాగా! ఇంక మర్యాదా లేదు,గోంగూరా లేదు! 
ఇదిగో, నా  అభిప్రాయం తీసుకో బే!

డిష్షుం! డిష్షుం!

డిష్షుం! డిష్షుం!

 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు