ట నెత్తిన మొట్టిన ఠ కథ
మూడవ ప్రశ్న:
అరవై యేళ్ళు నిండిన సందర్భంగా చేసుకునే ఉత్సవం పేరు వ్రాయుము.
ఓస్,ఇంతే కదా అనుకున్నా గానీ కాయితం మీద కలం పెట్టగానే గట్టి అనుమానం ఒకటి పొడసూపింది.
ఇంతకీ అది షష్టి పూర్తా? షష్ఠి పూర్తా అని!
వెనక్కి తిరిగి వెంకోజీ పేపర్లోకి చూద్దును కదా,
“ఆరవైయ్యవ పుట్టిన్రోజు” అని రాసి ధైర్యంగా కూచున్నాడు.
ఖర్మరా బాబు అనుకుని, ఇటు వైపు వామువాదిని పేపర్లోకి తొంగి చూడగా,
అరవైయ్యవ పుట్టిన రోజా? అసలేం సాధించారని పుట్టిన రోజులు చేస్కోడం?
పుట్టిన రోజులు, చచ్చిన రోజులు జరుపుకోవడం బూర్జువా క్రియేటేట్ ద్రోహం. ఈ పండుగలు పబ్బాలు అన్నీ మనువాదుల కుట్ర. మనకోసం అక్కడ అన్నాయ్‌లు అక్కాయ్‌లు పోరాడుతుంటే మనం పుట్టిన రోజులు చేస్కోడం ఏమిటి? ..
అయ్య బాబోయ్! ఏమిటో ఈ గోల? అయినా ఈవిడ తన పుట్టిన రోజుకి దెయ్యం పిల్లలా మొహం అంతా కేక్ పూయించుకున్న ఫొటో ఒకటి ఫేస్‌బుక్ లో చూసానే అప్పుడెప్పుడో? అనుకుంటూ అయినా నాకెందుకొచ్చిన గొడవా అని విస్కీ స్వామి పేపర్లోకి చూద్దును కదా,
అది షష్టి పూర్తి/షష్ఠి పూర్తి కావొచ్చు. రెంటిలో ఏదో ఒకటి రైటు. ఏది రైటైతే దానికి మార్కులు వేయగలరు. నాకూ ఆమధ్య అరవై నిండాయి. కానీ నా లేడీ ఫాన్స్ హర్టవకుండా “మళ్ళీ వచ్చిన పదహారో వసంతం” అని కాప్షన్ పెట్టి ఫేస్‌బుక్‌లో పెట్టా. దానికి లేడీస్ నుండి ఒకటే అభినందనలు వచ్చి పడ్డాయ్. ఇంతకీ నాకు మార్కులు వేస్తున్నారు కదూ? మినిమం అరవై అయితే బెటర్. ఇట్లు మీ సగోత్ర విస్కీ స్వామి. ♥️♥️🌷
ఇతగాడి సొంత డబ్బా తప్ప పనికొచ్చేది ఒక్కటీ లేదు కదా అని కొంత విచారించి, అచ్చ తెలుంగు కవివరేణ్యులేమైనా పనికొస్తారేమోనన్న ఆశ రెపరెపలాడగా చూద్దును కదా,
అరువదవ పుట్టు పండువ
అని వ్రాసి కలాన్ని బుగ్గన పెట్టుకుని ఉన్నాడాయన గారు!
ఎవరైనా ఫొటో తీసి పేపర్లో వేస్తారేమో అన్నట్టుగా రెడీగా కూచుని.
ఏడిసినట్టే ఉందీ అచ్చ తెలుగని, చండ్ర హింసని చూసి ఠ ని గాలిలో వ్రాసి అవునా అని నిశ్శబ్దంగా అడుగుతుంటే, అర్థం కానట్టు మొహం పెట్టేడు.
ఇదంతా పరీక్షకుడు గమనిస్తున్నట్టు గమనించి ఎక్కువ చేస్తే పట్టుబడే ప్రమాదం ఉంది కనుక అంతకన్నా సాహసానికి పాల్పడక,
నా సొంత బుర్రనే వాడదామని నిర్ణయానికి వచ్చి దీర్ఝంగా ఆలోచించగా,
“షష్టీ విభక్తి” అనునది జ్ఞప్తికి వచ్చినది!
షష్టీ విభక్తి అంటే ఆరవ విభక్తి! అంటే, షష్టి అంటే ఆరు.
అలాగైతే, “షష్ఠి” అంటే అరవై!!
Simple! హమ్మయ్యా! చిక్కు ముడిని నాకు నేనే విడదీసుకున్నందుకు నన్ను నేను మిక్కిలిగా అభినందించుకుని,
“షష్ఠి పూర్తి” అని వ్రాసి నాలుగవ ప్రశ్నలోకి దుమికితిని.
(షష్టాష్టకము/షష్ఠాష్ఠకము సశేషము)