ఆవకాయ్‌ కాదురా! - 1

 


ఇప్పుడే జాడీలోంచి ఆవకాయ తీసి కంచంలో వడ్డించుకోబోతున్నా, నువ్వొచ్చావ్‌! రా!రా! 

అది ఆవకాయ కాదు, ఆర్యకాయ! 

అదేంటి?

ఆర్యులు తెచ్చిన ఆర్యకాయ తరువాత ఆరెకాయ, ఆరకాయ అయి 
ఆ తర్వాత్తర్వాత “ర” అరిగిపోయి “వ” గా మారి “ఆవకాయ” అయింది!

బానే ఉంది ఆవ పెట్టిన చరిత్ర!
 సరేలే,అన్నం తింటూ మాట్లాడుకుందాం రా!

అది అన్నము కాదు, ఆర్యము! 

ఆర్యులు తెచ్చిన ఆర్యము —> ఆరెము —> ఆనెము —> అన్నెము —> అన్నము అయింది!

మంచిదేలే!
 ఇవాళ భోజనంలోకి ఆనపకాయ కూర!

అదీ ఆర్యులు తెచ్చిందే.
 అసలైతే అది, ఆర్యపకాయ!

ఓహో, బానే ఉంది.
అరిసెలు కూడా ఉన్నాయి, తిందూగానీ రా!

అవి అరిసెలు కాదు, ఆర్యసెలు! 
అవీ ఆర్యులు తెచ్చినవే!

తెస్తే తెచ్చారులేరా, అయితే ఏమంటావ్‌ ఇప్పుడు?

వాటిని మనం బహిష్కరించాలి!
 ఐ హేట్‌ ఆర్యన్‌ సంస్కృతి!

ఓరినీ! ఎందుకో అంత చేటు హేటు? 

వాళ్ళు మనదేశం వాళ్ళు కాదు.
 గుర్రాలేసుకుని ఎక్కడినించో వచ్చారు.

ఓహో! మొత్తం ఆడ,మగ,పిల్లా మేకా మన దేశంలోకి వచ్చారంటావ్‌? 

  లేదు లేదు.
 కొన్ని వేల వేల మైళ్ళు కదా, మగవాళ్ళు మాత్రమే వచ్చారు.

ఓహో! వాళ్ళ వాళ్ళ భార్యాపిల్లల్ని,తల్లుల్ని అక్కడెక్కడో వదిలేసి వీళ్ళు మాత్రం గుర్రాలేసుకుని వేల వేల మైళ్ళు వచ్చారా? 

అంతే! అంతే!
వచ్చి ఇక్కడ లోకల్‌ ద్రవిడ్‌ లేడీస్‌ ని పెళ్ళి చేస్కున్నారు!

అయితే మనలో కలిసిపోయారన్న మాట. 
అయితే ఇంకే?

లేదు,లేదు. వారి ఆధిపత్యం కొనసాగించారు. 
వారి ఆర్య సంస్కృతి తీస్కొచ్చారు.

అంటే వేద విజ్ఞానము అదీనా? మంచిదేగా?

అది కాదు, కులాలను వాళ్ళే సృష్టించారు!

అంటే నువ్వెళ్ళి కుండలు చెయ్‌, నువ్వెళ్ళి బండలు కొట్టు
ఇలా చెప్పారంటావా ఆ వచ్చిన పుంజీడు ఆర్యులు?

అవును. వాళ్ళే ఇవన్నీ చేసారు.

మరి వాళ్ళు రాక ముందు ఇక్కడున్న లోకల్‌ ద్రవిడ్స్ అందరూ ఏం చేసేవారో? 

అది పరిశోధించాలి.
 కానీ ఆర్యన్స్ ఏమేమో శాస్త్రాలు తెచ్చి మన నెత్తిన రుద్దారు, 
లోకల్స్ ని అణిచి పారేసారు!

అంత విజ్ఞానము, సామర్థ్యము ఉన్న వాళ్ళు వాళ్ళ దేశం విడిచి ఇంత దూరం ఎందుకొచ్చారో? అయినా ఈ వేదాలు, వేదాంతాలు వాళ్ళు ఎక్కడ్నించి వచ్చారని చెబుతున్నారో అక్కడ లేవే?

అదీ పరిశోధించాలి.
 ఈ దేశపు మూలవాసులు అడవుల్లో ఉండేవారు. 
ఈ ఆర్యులొచ్చి నగరాలు నిర్మించారు. 

మరి సింధు నాగరికత నగరాల సంగతి ఏమిటి? 

హ్‌మ్మ్, అది వేరే విషయం. 

అది కాదురా, నువ్వు చెప్పే ఆర్య ఋషులంతా అడవుల్లోనే కదా నివసించింది? 

అది వేరే విషయం. తర్వాత మాట్లాడుదాం.
రాముడు ఆర్యన్‌!  రావణాసురుడు నాన్‌ ఆర్యన్‌!
ఆర్యన్‌ vs నాన్‌ ఆర్యనే రామాయణం! ఓకే?

మరి, రావణాసురుడు రావణబ్రహ్మ ఎలా అయ్యాడో?
రాముడు,రావణాసురుడు శివుడినే పూజించారు.
అదెలా?

కౌంటర్లు బానే ఇస్తున్నావ్‌! 
నువ్వెన్ని చెప్పినా ఐ హేట్‌ ఆర్యన్స్! 

ఓహో! బావుంది.
ఈ అరకొర ఆర్యన్‌ నాలెడ్జీ, దాని నించి పుట్టుకొచ్చిన పుట్టగొడుగుల్లాంటి ద్వేషాలు ఎక్కడినించి వచ్చాయో చెబుతా విను. 


బ్రిటీషు వాడు ఇక్కడికొచ్చి ఇక్కడి కట్టుదిట్టంగా ఉన్న ఆచారాలు,అలవాట్లు, సభ్యత,సంస్కృతి చూసి ఆశ్చర్యపోయాడు,అసూయ పడ్డాడు! 

వీటన్నింటికీ మూలకందమైన విజ్ఞానానికి కాపలాదారులుగా ఉన్న బ్రాహ్మణ వర్గాన్నీ చూసాడు. 
వీళ్ళని దెబ్బకొడితే గానీ ఈ సంస్కృతిని సమూలంగా పెకలించలేమని గమనించాడు.  
అలా వాడు పుట్టించిందే ఆర్య ద్రావిడ సిద్ధాంతం! 

మాలాగే ఈ బ్రాహ్మణులు, ఈ భారతీయ సంస్కృతి ఎక్కడినించో వచ్చాయి. ఇవి మీవి కాదు అని ప్రచారం మొదలెట్టాడు! 
దాన్ని సమాజాన్ని ముక్కలు ముక్కలుగా చీల్చడమే పనిగా పెట్టుకున్న వామపక్షాలు అందిపుచ్చుకున్నారు. 
తెలిసిందా?


ఏంటి తెలిసేది? నువ్వు ఆ మేధావుల కన్నా తెలివైన వాడినన్నట్టు చెబుతున్నావ్‌. భాషలోను, పురాణ కథల్లోను మనవి అక్కడివి పోలికలున్నాయని చెబుతున్నారు. తెలుసా?

అప్పుడైతే ఇక్కడినించే భారతీయులు ఆయా దేశాలు ఎందుకు వెళ్ళి ఉండకూడదు? 

అంటే reverse migration అంటావా?

Yes, ఒక్కపక్క భారతీయమైన వేదాలు, ఉపనిషత్తులు, యోగా, సంగీతము,నృత్యము ఇవన్నీ గొప్పవని మెచ్చుకుంటూనే అవి మీవి కాదు, ఎక్కడినించో వచ్చిన ఆర్యులు ఇచ్చారంటున్నారు చూసావా? 
అంటే మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసి పోయారు! 

ఇదంతా రైట్‌ వింగర్స్ చెప్పే మాటలు. నేన్నమ్మన్‌!

నా మాటలెందుకు నమ్ముతావ్‌, నా ఆవకాయ ఎందుకు తింటావ్‌,
ఆ బ్రిటీషు మానస పుత్రులు, మొగలాయి చెంచాలు, కోరలమార్కుడి కోరస్‌ గాళ్ళు చెప్పినవైతే వింటావ్‌! సరేలే, భోం చేద్దాం రా!
 ఇవాళ అరిటాకుల్లో భోజనం!

అవి అరిటాకులు కావు, ఆర్యటాకులు!
అవీ ఆర్యులు తెచ్చినవే! 

రేయ్‌,రేయ్‌! కొట్టానంటే గరిక ఆర్యవరంలోకి పోయి పడతావ్‌!

గరిక ఆర్యవరమా? 

అదే మన గడ్డి అన్నారం! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5