ఇరుగు - పొరుగు

 


మూర్తి కొత్త దేశానికి కొత్తగా వచ్చాడు. 

ఇరుగు-పొరుగు అన్న యాప్‌లో చేరండి, మీ ఇరుగు పొరుగు వారు పరిచయమౌతారు, చుట్టు పక్కల ఏం జరుగుతుందో తెలుస్తుందని తెలిసిన వారు సలహా ఇస్తే ఉత్సాహంగా అందులో చేరాడు. 

ఆ సదరు యాప్‌లో ఇరుగుల ఇడుములు,ఇష్టాలు,పొరుగుల పాట్లు, పండగలు ఏమిటో చూద్దామని అక్కడ పేస్టు చేయబడ్డ పోస్టులు చూడబోయాడు -

1. మీలో ఎవరిదో డాగు మా లానులో పూపింది. 
అది మాకు మిక్కిలి క్లేశము కలిగించినది.
ఆ సదరు అనుచిత కార్యమును మా యొక్క కెమెరా క్లిక్కింది. చూడుడి.

2. మీ డాగు మా డాగుని చూచి బార్కుట చేత మా డాగుకు జ్వరము వచ్చినది. అది డిప్రెషనుకు లోనై ప్రస్తుతము మానసిక వైద్యునిచే చికిత్స తీసుకొనుచున్నది. అందుచే మా కుటుంబము మొత్తము కుంగిపోతిమి.
మా గరాజు బయలున మేము ఏర్పాటు చేసిన కెమెరా ఆ భయభ్రాంత బార్కును మొత్తము పదిల పరచినది. చూడుడి.

3. దెయ్యాల పండుగ నాడు మేము బయట ఉంచిన చాకోలెట్టులు నింపి పెట్టిన బొచ్చెను పిల్లవాడొకడు ఎత్తుకు పోయినాడు.
 ఆ బొచ్చె తస్కరణ మొత్తము మా పంచలోని కెమెరా ఒడిసి పట్టినది.
 ఆ యొక్క పిల్లవాని తల్లిదండ్రులు వానిని మందలించి, మా బొచ్చెను, మీ పిల్లవాడు తినగా మిగిలిన చాకోలెట్టులను పట్టుకొచ్చి ఇచ్చి మంచి నైబర్లమని నిరూపించుకోండి. లేదా…

4. ఇదిగిదిగో చూడండి, నిన్న రాత్రి మా గరాజులో తిరుగుతున్న ఏలియన్‌! మా కెమెరా బంధించింది. ఆ బూదర బీదరగా కొంచెం కొంచెం కదులుతున్నట్టుగా ఉందే, అదే ఏలియన్‌ అనుకుంటున్నా. దెయ్యం కూడా కావొచ్చు. మీరేమంటారు నైబర్స్?

5. నేను దేవుడంటే భయపడే పరిశుద్ధజీవిని. నాపాటికి నేను నాలుగు పిల్లుల్ని పెంచుకుంటూ బతుకుతుంటే ఎవరో ఆకతాయి పిల్లలు మా ఇంటి కాలింగ్‌ బెల్‌ డింగ్‌ డాంగ్‌ చేసి పోయారు. ఈవేల్టికి ఇది రెండోసారి. మా కెమెరా ఆ డింగ్‌డాంగ్‌ డింకీలను పట్టింది. మీలో ఎవరి పిల్లలో చూసుకుని మందలించండి. లేకపోతే ఈసారి తళతళలాడే నా తుపాకీని బయటకు తేవాల్సి ఉంటుంది. నైబర్సు అందరికీ శుభ సాయంత్రం. 

6. నా వద్ద మకిలి పట్టిన కప్పులు, క్రాకులిచ్చిన సాసర్లు, తుప్పు పట్టిన టీ టేబులు, కాలు విరిగిన కుర్చీ ఒకటి ఉన్నాయి. నైబర్స్ కి ఉచితంగా ఇస్తున్నా. వచ్చి పట్టుకెళ్ళగలరు.

ఒక్కో పోస్టుకి వంద మంది మాట్లాడిన మాటలున్నాయి.
ఈ పోస్టులు చూసాక ఉన్న కాస్త బుర్రా పోయిన మూర్తి యాప్‌ మూసేయబోతూ చివరాఖరిగా ఓ పోస్టు ఏదో ఆకర్షించగా చదవబోయాడు-

ఇతగాడు ఎవరో అనుమానితుడులాగా ఉన్నాడు. పొద్దున ఇళ్ళ వంక చూస్తూ నెమ్మదిగా నడుస్తూంటే అనుమానం వచ్చి  ఫొటో తీసా. 
ఇతడు ఐదడుగులు ఉంటాడు, బట్టతల. వయసు నలభై నలభై ఐదు మధ్య ఉండవచ్చు. తీవ్రవాదికానీ, ఉగ్రవాది కానీ, అగ్రవాది కానీ అయి ఉండవచ్చు. రాబరు కూడా కావొచ్చు. తస్మాత్‌ జాగ్రత్త! 

కింద చూస్తే తన ఫొటోనే! పొద్దున వాకింగ్‌ చేస్తున్నప్పటి ఫొటో!

అది చూసి కళ్ళు గిరగిరా తిరిగి ఢామ్మని పడిపోయాడు మూర్తి! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు