ఆ “పాత”మధురాలు!
ఆ రోజుల్లో పది పైసలకి పిప్పర్‌మెంటు తెల్లదారంతో కట్టి తిప్పుకుని ఆడుకోడానికి,అదొచ్చేది, గుర్తుందా?
ఆడుకున్నాక పిప్పర్మెంటు తినేసి ఆ తాడుకి గొల్డ్ స్పాటు మూతలుంటయ్యే, అవి తగిలించి ఆడుకునే వాళ్ళం!
అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭
అప్పట్లో నారింజ తొనలని అమ్మే వాళ్ళు. చప్పరించుకుంటూ సైకిల్ తొక్కుకుంటూ ఊరంతా తిరిగే వాళ్ళం. ఎంత బాగుండేదో!
అవును,ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭
ఆ రోజుల్లో హనీ చాక్లెట్లని అమ్మేవాళ్ళు. పావలాకి ఒకటి. ఎంత బాగుండేవో అచ్చం తేనెలాగే. ఇప్పుడెక్కడా రావట్లా.
అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭
ఆ రోజుల్లో బాల్ పాయింటు పెన్ను రీఫిల్ ముక్కు తీసి అందులో ఇంకు పోసి రాసేవాళ్ళం కదూ? ఏంటో ఆ రోజులు మళ్ళీ వస్తయ్యా?
అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭
ఆ రోజుల్లో మినీ ఇంకు పెన్నులు బుడ్డి బుడ్డివి దొరికేవి.
నా దగ్గరా ఒకటి ఉండేది.
బాల్ పాయింటు పెన్నుల్లో హీరో పెన్నులే వాడేవాడ్ని.
ఆ పెన్నులు నా దగ్గర ఇంకా భద్రంగా ఉన్నాయ్!
అవును, ఆ రోజులే వేరు! మళ్ళీ రావు! 😭
ఎవరండీ వీళ్ళంతా?
పాత సంగతులు మాట్లాడుకుంటూ ఏడుస్తున్నారు?
అది ఏడుపు కాదులెండి,
ఒక కంటిలో ఆనందబాష్పాలు.
ఒక కంటిలో విషాదబాష్పాలు.
వీళ్ళంతా 70ల్లో పుట్టిన వాళ్ళు.
వారం వారం ఇక్కడికొచ్చి బజ్జీలు నములుతూ పాత సంగతులన్నీ నెమరు వేసుకుంటూ ఉంటారు.
గడచిన కాలం మధురమని ఆనందం,
అయ్యో మళ్ళీ రాదని విషాదం!
అన్నట్టు, ఆపాత మధురాలని వీళ్ళకో WhatsApp Group కూడా ఉంది. అందులో గోల్డుస్పాటు మూతలు, ఏడో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం,ఏడు పెంకులు, బిళ్ళంగోడు, తంపటేసిన తేగలు, గోళీకాయలు ఇలాంటి ఫొటోలు post చేసుకుని ఆనంద విషాద బాష్పాలు కారుస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.
మరి ఆమూల ఇంకో గుంపు కూడా బజ్జీలు తింటూ ఏడుస్తోందే?
వాళ్ళు 60 ల్లో పుట్టిన వాళ్ళు.
వాళ్ళకీ ఓ ఆపాత మధురాలు WhatsApp group ఉంది.
ఈ మూల గుంపు?
వాళ్ళు 50 ల్లో పుట్టిన వాళ్ళు.
మరి వాళ్ళు?
40 ల్లో పుట్టిన వాళ్ళు.
అయ్య బాబోయ్! ఇప్పుడే గుర్తొచ్చింది!
మా ఆపాత మధురాలు మీటింగ్‌కి టైమౌతోంది!
నేనూ మా అడ్డాకి వెళ్ళి అక్కడినించి గతంలోకి వెళ్ళాలి!
మావాళ్ళంతా ఈపాటికే గతంలోకి వెళ్ళిపోయి ఉంటారు!
ఉంటా మరి, మళ్ళీ వస్తా!