ఈ దరిని ఆ దరిని దుఃఖదాయిని

 


మా నాయకుడు పడవల్లో తిరిగి వరదబాధితులను 
పరామార్శిస్తున్నాడు, చూసావా? 
అదీ లీడర్‌షిప్పంటే! 

అబ్బో, నిజమే!

అందరికీ పులిహోర పాకెట్లు, పెరుగన్నం పాకెట్లు 
పంచుతున్నారు, చూసావా? 
అదీ మనోళ్ళలో మంచితనమంటే!

అబ్బా‌! నిజమే!

అదిగాదన్నాయ్‌, 
మరి అసలికీ వరదలే రాకుండా చెయ్యొచ్చు కదన్నాయ్‌?

ఓరి పిచ్చోడా! 
వరదలు చైనాలో వత్తయ్‌‌! 
జపాన్‌లో వత్తయ్‌! 
అస్సాంలో వత్తయ్‌! 
ఆస్ట్రేలియాలో వత్తయ్‌! 

మన్దసలికే కోస్టల్‌ ఏరియా!
రాకుండెట్టుంటయ్‌?

అదిగాదన్నాయ్‌, ఆ ఏరు పొంగిందంటగా? 

ఆ,పొంగితే?
 ఏరన్నాక వరదలకి పొంగకుండుండిద్దా?

అదిగాదన్నాయ్‌, ఆ ఏరు సగం నదిలోను, సగం చెఱువులోను కలుసుద్దంటగా?

అయితే? 

నదిలోకి పోయే దారి సరింగా కట్టలేదంట! 
చెఱువులోకి పోయే తోవంతా బొక్కలున్నాయంట!
కాలవంతా చెత్తంట!

అయితే? 

ఏరు ఆక్రమించి ఇళ్ళు కట్టేసేరంట!
చెరువును ఆక్రమించి ఇళ్ళు కట్టేసేరంట!
దిక్కుతోచక ఏరు పొంగి ఊళ్ళోకి వచ్చేసిందంట! 

అయితే ఏమంటావ్‌ ఇప్పుడు?

శాస్విత పరిష్కారం చూడాల గదా అన్నాయ్‌!

రే, నువ్వేమన్నా రాజికీయ నాయకుడివా?
 శాస్విత పరిష్కారాలని న్యూస్‌ పేపరు మాటలు చెబున్నావ్‌? 

వరదొచ్చిందా,
పరామార్శించామా,
పులిహోర పంచామా
ఇదేరా జనం చూసేది.

అంతేనంటావా అన్నాయ్‌? 

అంతే రా నాయనా!

అయ్యో, ముందు ముందు ఇంద్రుడు, వరుణుడు కలిసి వరద పోటెత్తించితే అప్పుడు ఆ నదీ ఈ ఏరు ఆ కాలువ పొంగి పొర్లి అమరావతీ నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు ఎటు కొట్టక పోతయ్యోనని చానా బెంగగా ఉందన్నాయ్‌!

ఏడిసావ్‌లే! ముందు పులిహోర కలుపు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5