కచటతపలకు గసడదవలు!

 


వెంకట లక్ష్మి: మీ కథలో ఒకచోట “కూరకాయలు” అని వ్రాసారేమిటండీ?

రచయిత: అది కూరలు+కాయలు. ద్వంద్వ సమాసము. అది అలాగే వస్తుంది. మీకు వ్యాకరణము అదీ తెలియదనుకుంటా. పరవాలేదు, ఇంటికెళ్ళి నేను వ్రాసిన వ్యాకరణ వాక్కాయ చదువుకోండి. 

అభిమాని అంధారావు: ఆహా! ఎంత బాగా చెప్పారండీ గురువు గారూ!

వెంకట లక్ష్మి:  కూరకాయలు ఎలా అవుతుందండీ? కూరగాయలు కానీ కాయగూరలు కానీ అనాలి గానీ? 
  
రచయిత: కాయగూరలు వేరు. కూరగాయలు వేరు. కాయల్ని వండితే కూర అవుతాయి, అవి కాయగూరలు. కూర వండడానికి వాడేవి కాయలు. కాబట్టి అవి కూరగాయలు. కానీ, కాయకూరలు అనడమే రైటు. 

అభిమాని అంధారావు: ఆహా! ఎంత బాగా చెప్పారండీ గురువు గారూ!
మా గురువు గారికి నాలుగు పీహెచ్చిడీలు, వారి ఖాతాలో వంద పరిశోధనా పత్రాలు ఉన్నాయి. వారి పరిజ్ఞానాన్నే ప్రశ్నిస్తారా? ఎంత ధైర్యం?

వెంకట లక్ష్మి: అది కాదండీ, ద్వంద్వ సమాసములో రెండవ పదం కచటతపలు గసడదవలుగా మారతాయి కదా? కూరగాయలు,కాయగూరలు రెండిటి అర్థం ఒకటేనండీ!

కుటుంబ రావు: కూరగాయలు రైటా కాయగూరలు రైటా అని మగాళ్ళం మేమే చెప్పలేక పోతున్నాం. నీకెందుకమ్మా ఇవన్నీ? హాయిగా ఇంటికెళ్ళి కూరగాయలతో కాయగూరలు చేసుకోక? 

అధిక ప్రసంగి సుబ్బారావు: మేడమ్‌ మీ ప్రొఫైల్‌ ఫోటోలో ఎర్ర చీరలో చాలా అందంగా ఉన్నారు మేడమ్‌. మా ఆవిడకు కూడా సరిగ్గా ఇలాంటి చీరే ఉన్నది. 

వెంకట లక్ష్మి: subject మాట్లాడుతుంటే మధ్యలో చీర బావుందంటారేమిటండీ? 

అధిక ప్రసంగి సుబ్బారావు: అబ్బే, నేను కూడా subject లోకే వస్తున్నా. మీకు ఏ కూరంటే ఇష్టం మేడమ్‌? 

పెద్ద మనిషి అప్పారావు: నాకు ఈ subject మీద మంచి గ్రిప్పు ఉంది. విడిగా ఫోన్‌ చేస్తే explain చేస్తా. 

అభిమాని అంధారావు: మా గురువు గారు అంత వివరంగా చెప్పాక మళ్ళీ సందేహమేమిటి? 

వెంకట లక్ష్మి: అది కాదండీ,ద్వంద్వ సమాసము మీది పరుషములకు 
గసడదవలు ఆదేశముగా వచ్చును కదండీ? 

కుటుంబ రావు: పరుషాలన్నీ పురుషులకే. 

అధిక ప్రసంగి సుబ్బారావు: అచ్చు ఆలాటి రవికే మా ఆవిడకీ ఉంది మేడమ్‌! ఇంతకీ మీకు ఏ కూర ఇష్టమో చెప్పలేదు.

వెంకట లక్ష్మి: ఏంటండీ ఏదో పెద్ద వారు కదా అని ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నారు?

కుటుంబరావు: ఎర్ర చీర కట్టుకుని ప్రొఫైల్‌ ఫొటో పెడితే అలాగే మాట్లాడతారమ్మా. మగాళ్ళం మేమే ఫొటోలు పెట్టట్లేదు!

అధిక ప్రసంగి సుబ్బారావు: అబ్బే, ఎర్ర చీర కట్టుకున్న లేడీలు మా ఆవిడలాగే సౌజన్యశీలురు, సౌభాగ్యవతులు,సుమంగళులు,సుశీలురు అని చెప్పడమే నా ఉద్దేశ్యం మేడమ్‌ గారు! 

వెంకట లక్ష్మి: కూరగాయలు, కాయగూరలు రెండూ ఒకటే. అది ద్వంద్వ సమాసము. దీని గురించి చెప్పండి! 

అభిమాని అంధారావు: మా గురువు గారు నొక్కి వక్కాణించాక ఇంకా ఏమిటి? కూరలు వండితే కూరగాయలు. వండకపోతే కాయగూరలు. ఇంతే! సింపులు! గురువు గారు, నమో నమః

పెద్ద మనిషి అప్పారావు: నిజానికి అది కూరగాయాలు. కూరలు తరిగేటప్పుడు గాయాలు అవుతాయి కదా, అందుకని అలా అంటారు. 
విడిగా ఫోన్‌ చేస్తే explain చేస్తా. 

వెంకట లక్ష్మి: కూరలంటే ఆకు కూరలు కదండీ?
 ఆకు కూరలు, కాయలు కలిపి కూరగాయలు లేక కాయగూరలు. 

కుటుంబరావు: ఆడదానికి అంత అహంకారం ఎందుకమ్మా? ముందు కూరల్లో కారం వేయడం నేర్చుకోండి. 

వెంకట లక్ష్మి: ఏమిటండీ మీరంతా ఇలా ఉన్నారు? ఈ గ్రూపూ వద్దు. ఈ చర్చలు వద్దు. వస్తా.

Venkata Lakshmi left the Telugu Bajji group 

రచయిత : నా వ్యాకరణ వాక్కాయ పోస్టేజీతో కలిపి ధర ఎంతో చెబుదామనుకున్నా. ఇంతలోనే వెళ్ళిపోయారు.

అభిమాని అంధారావు: గురువు గారి పుస్తకం చదివే యోగ్యత ఆవిడకి లేదు. ఏం జేస్తాం.

కుటుంబరావు: పులుసు చేసుకునే ఆడదానికి అంత తలబిరుసు పనికి రాదు. 

అధిక ప్రసంగి సుబ్బారావు: బుట్ట చేతులు పెట్టించుకోండి మేడమ్‌ మీకు బాగా సూటౌతుందని చెబుదామనుకున్నా. ఆవిడకు ఇష్టమైన కూరేమిటో కూడా చెప్పకుండా పోయారు. 


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5