తిరుమలగిరి రాయా!

 

విన్నారుగా ఈ దారుణం? 

తిరుపతి ప్రసాదంలో ఏమిటేమిటో కలిపారుట!

విన్నానండీ,విన్నా.

ఆ చేసిన వాడెవడో వాడి కట్టుడు పళ్ళు గొంతులో ఇరుక్కుని ఛస్తాడు! 

చాలా క్రియేటివ్‌గా తిడుతున్నారే? 

నేను తిట్టడం కాదండీ, ఇలాంటి వెధవల సంగతి శ్రీవారే చూసుకుంటారు. 
అయినా కర్మ అనేది ఒకటుంది కదండీ, ఆ వెధవలెవరో, వాళ్ళని కొట్టి తీరుతుంది!

అంటే మనమేం చెయ్యక్కర లేదంటారా? 

మనమేం చెయ్యగలుగుతామండీ. ఆ ప్రసాదం మనం తినడమేకాక, ఏవండోవ్‌, తిరుపతి వెళ్ళొచ్చాం, ప్రసాదం తీసుకోండీ, అని పదిమంది చేతా తినిపించిన మహాపాపానికి ఓ రోజు అన్నం మానేసి, శ్రీవారిని క్షమాపణ కోరుతూ ప్రాయశ్చిత్తం చేసుకుంటాం.
 అన్నట్టు ప్రాయశ్చిత్త శ్లోకం మీకు WhatsApp లో వచ్చిందా? 
రాకపోతే చెప్పండి, నేను పంపుతా.

అది నాకూ వచ్చిందిలెండి. ప్రాయశ్చిత్తాలు సరే, ఇంక మనం ఏమీ చెయ్యలేమా? 

ఏం చేస్తామండీ?

ఇన్ని కోట్లమంది హిందువుల్లో ఒక పది లక్షల మందైనా అక్కడికి వెళ్ళి నిరసన తెలియజేసారా? మళ్ళీ ఇలాంటివి చెయ్యడానికి భయపడాలి కదండీ?

అబ్బే, భయపెట్టడాలు అవీ మన పద్ధతి కాదండీ. ఆత్మోద్ధారణ, ప్రాయశ్చిత్తం, పశ్చాత్తాపం,పాపభీతి, నిర్లిప్తత, నిర్మమత ఇవే మన ధర్మం బోధిస్తోంది. 

కనీసం దీని మీద న్యాయం కోసం పోరాడవచ్చును కదా?

అబ్బే, పోరాడ్డాలు, ఆరాట పడ్డాలు మన పద్ధతి కాదండీ. మనదంతా శాంతి,ప్రశాంతి,యోగం,ధ్యానం,పూజ,పునస్కారం. ఇంతే. 

మరి క్షాత్రం? కురుక్షేత్రం?

అవి ఉన్నాయనుకోండి. అయినా సామాన్యులం మనమేం చేయగలం చెప్పండి. బాధ పడ్డం తప్ప. 

ఇంకా,ఈ సో కాల్డ్ మేధావులు ఎలాగెలాగ వదరుతున్నారో చూసారా? 
లడ్డూనే పెట్టాలా ప్రసాదంగా, బిర్యానీ పెట్టొచ్చు కదా అని ఒకాయన జోకుతాడు. గోవు మూత్రం పవిత్రం కానీ కొవ్వు కలిస్తే తప్పా అని ఒకాయన వాగుతాడు. ఎంత దారుణమండీ! హిందూ మెజారిటీ దేశంలో ఇదీ మన పరిస్థితి! 

మరి మీరేమైనా సమాధానం ఇస్తున్నారా వాళ్ళకి?

ఎంతమందికని సమాధానమిస్తామండీ? వాళ్ళ పాపాన పడి వాళ్ళే పోతారు. శ్రీవారే వాళ్ళ మూతులు పగలగొడతారు. 

శ్రీవారు,కర్మ తప్ప మనమేం చెయ్యలేమంటారా? 

అబ్బే, భగవంతుడిని మించిన వాళ్ళమా మనం చెప్పండి? 
అయినా ఎవరి కర్మ వాళ్ళని చుట్టుకుని తీరుతుంది. 

 ప్రతి మనిషీ దైవస్వరూపం అని చెబుతోంది కదా మన ధర్మం. మరి మనలోని దైవం మన ధర్మాన్ని కాపాడ్డానికి అసురుల మీదకు యుద్ధానికి వెళ్ళాలా వద్దా? 
శ్రద్ధ లేని దాన్ని దేన్నో ఎద్దులు తొక్కిపోయినాయట. 
అలాగుంది మన సంగతి. 

మీరు చెప్పేది బానే ఉందనుకోండీ..

అహం బ్రహ్మాస్మి అనిన్నీ మీకు తెలుసును కదా. శ్రీవారి భక్తులుగా మీ వంతు యుద్ధం మీరూ చెయ్యండి. 

అబ్బే, ఎందుకండీ అవన్నీను. మీరు చూస్తూ ఉండండి, ఆ చేసిన వాళ్ళెవరో సలసల కాగే సాంబారు కాగులో పడి…


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5