ఏడుపేరా శాశ్వతం!

 


Congrats ఆంటీ, మీ అబ్బాయికి REC లో సీటు వచ్చిందటగా? 

ఆ,ఏదో వచ్చిందిలేమ్మా. మా తోడికోడలి కొడుక్కి IIT లో సీటు వచ్చింది.
మా వెధవ సరిగ్గా చదివేడిస్తేగా. పొద్దున్నుంచీ బెంగతో నేనూ మీ అంకులూ కాఫీ కూడా తాగకుండా బాధగా కూచుండిపోయాం.

Congrats ఆంటీ, మీ అబ్బాయికి కాంపస్‌ సెలెక్షన్‌లో మంచి ఉద్యోగం వచ్చిందటగా? 

ఆ,ఏదో వచ్చిందిలేమ్మా. వీడికన్నా మా ఎదురింటి అబ్బాయి పాకేజీ ఎక్కువ. వెధవ సరిగ్గా చదివేడిస్తేగా. పొద్దున్నుంచీ బెంగతో నేనూ మీ అంకులూ టిఫిను కూడా చెయ్యకుండా బాధగా కూచుండిపోయాం.

Congrats ఆంటీ, మీ అబ్బాయికి మంచి పెళ్ళి సంబంధం వచ్చిందటగా? 

ఆ,ఏదో వచ్చిందిలేమ్మా. మా వాడికి వచ్చిన సంబంధం కన్నా పెద్ద సంబంధం వచ్చింది మా ఆడపడుచు కొడుక్కి. మా వెధవ ఎంత చెప్పినా వినకుండా ఈ పిల్లనే చేసుకుంటానని కూచున్నాడు. పొద్దున్నుంచీ బెంగతో నేనూ మీ అంకులూ భోజనం కూడా చెయ్యకుండా బాధగా కూచుండిపోయాం.

Congrats ఆంటీ, మీ అబ్బాయి అమెరికాలో ఇల్లు కొన్నాడటగా? 

ఆ,ఏముందిలేమ్మా, మా చెల్లెలి కొడుకు ఇంతకన్నా పెద్ద ఇల్లు కొన్నాడుట. మా వెధవకు నాలుగు వ్యాపారాలు చేసి సంపాదించుకోవడం తెలిసేడిస్తేగా. పొద్దున్నుంచీ బెంగతో నేనూ మీ అంకులూ డిన్నరు కూడా చెయ్యకుండా బాధగా కూచుండిపోయాం.

Congrats ఆంటీ, అమెరికాలో మీ అబ్బాయి,కోడలు దగ్గర ఉంటున్నారటగా? 

ఆ,ఏముందిలేమ్మా, మా కోడలూ ఉద్యోగం వెలగబెడుతోందిగా.
 పొద్దున్నే కొడుకు,కోడలూ ఉద్యోగాలకు వెళ్ళిపోతే లంకంత కొంపలో నేనూ మీ అంకులూ బిక్కుబిక్కుమంటూ కూచోవాలి. 
ఆవిడగారొచ్చి ఇచ్చిందాక కాఫీ నీళ్ళకీ గతి లేదు మాకు. 
మా తోటి కోడలి కోడలు ఇంటి పట్టునే ఉండి వేళకి భోజనము, గంట గంటకీ ఆరారగా ఫలహారాలు చేసి పెడుతుందిట. మా కోడలూ ఉంది ఎందుకూ? ఈ విషయమే చెప్పుకుంటూ పొద్దున్నుంచీ బెంగతో నేనూ మీ అంకులూ ఇండియానుండి తెచ్చుకున్న జంతికలు కూడా నోట్లో వేసుకోకుండా బాధగా కూచుండిపోయాం.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు