పద్యపాక ప్రవీణ

 


మిర్చీలను కూర్చి జారుగ కల్పుము
శనగపిండి, మజ్జారే బజ్జీలను
వేయించుము సలసల నూనెన్‌!
బుజ్జీ, ఆ బజ్జీలను బొజ్జ నిండ 
జోరుగ తినిన‌ అవుదువు బజ్జీ! 

దారినపోయే దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు? 

ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన జయమాలినీ ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము. 


కలిపితి నే
శనగపిండి
కలిపితి మరి
కారముప్పు
ఉల్లి ముక్కలతోడన్‌!
దించితి నే
పకోడీలు వాయల్వాయలు
అకటా మరి
ఒక్కటైన మిగలదె
నాకు, రుచి చూడంగన్‌!

 దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు? 

ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన సిలుకు స్మిత ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము. 

చిక్కుళ్ళు తినిన
ఎక్కిళ్ళు వచ్చును
చెక్కిళ్ళు నొవ్వగన్‌
చక్కని కారపుచెక్కలు
చేసితినక్కా తినుము
నీ పళ్ళు విరుగగన్‌!

 దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు? 

ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన జ్యోతిలక్ష్మి ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము. 


చుట్టితిని సున్నుండలు
చుట్టితి జీలేబీలు చుట్టి
న చుట్టే చుట్టితి కారప్పూసల్‌
బెట్టు చేయక సుష్టుగ తినుమా
 చిట్టెమ్మా, నా చేతి చిట్టి గట్టి చెగోడీల్‌! 


 దానయ్య: ఇదేం పద్యమండీ? ఏమిటి దీని ఛందస్సు? 

ఛందో రావు: ఇది నేను కనిపెట్టిన హెలెన్  ఛందస్సు. మీకు నచ్చినచో లైకు కొట్టి షేరు చేయుము. 

దానయ్య: ఏమిటండీ,ఉన్న ఛందస్సులు చాలవన్నట్టు ఎందుకీ కొత్త కొత్త ప్రయోగాలు? 

ఛందోరావు: మనకు ఎన్నియో వంటకములు కలవు. అయిననూ క్రొత్త క్రొత్త వంటకములకై యత్నించుచుంటిమి. అది యెట్లో ఇది అట్లే. 

దానయ్య: మీ భాష ఏమిటో వింతగా ఉంది. అయినా ఆ ఛందస్సులకు ఇంకే పేర్లూ దొరకనట్టు ఐటం పాటలకు డాన్సాడే నటీమణుల పేర్లు పెట్టారే? 

ఛందోరావు: నేను ఫక్తు మానవతావాదిని. వారు మాత్రము మనుష్యులు కారా? వారు చేసిన సమాజసేవ ఎట్టిదో తెలుసునా? వారిని గౌరవించుటకై వారి నామములనే నా ఛందస్సులకు నామకరణము చేసితిని. 

దానయ్య: ఛందస్సు సరేనండీ. మరి కవిత్వము? కవిత్వము ఉండొద్దూ పద్యాల్లో? 

ఛందో రావు: పకోడీల మీద, చెగోడీల మీద ఫలానా కవిగారు పద్యాలు చెబితే మెచ్చుకున్నారే? మరి నా పద్యాలకేమి లోటు? 

దానయ్య: ఛందస్సు చట్రాల్లో డొల్ల పదాలను బిగించి జనాలను భయపెట్టే బదులు ఆ ఛందోబందోబస్తులను తెంచి కవిత్వము వ్రాయవచ్చును కదండీ?

ఛందోరావు: ఏమిటి మీరననునది? కవిత్వము కన్న ఛందస్సు మిన్న. నేను మూడు పూటలా ముప్పై పద్యములు వ్రాసెదను. నా రెండు వేల పేజీల పద్యాల పుస్తకం pdf పంపుదును. చదువుకొనుడు. 

దానయ్య: పద్యాలు,ఛందస్సులు సరేనండీ. మరి కవిత్వం? …

ఛందో రావు: నాకు అ.రి.సె  సంస్థ వారు “పద్యపాక ప్రవీణ” బిరుదమును ప్రసాదించిరి. అది అందుకొనుటకు నేను పోవలయును. మరియొక క్రొత్త ఛందస్సుతో మరల కలిసెదను. 
ఛందోబద్ధ నమస్కారములతో, పద్యజన విధేయుడు.  

దానయ్య: అది కాదండీ, ఈ ఒక్కమాటా చెప్పి వెళ్ళండి. 
ఛందస్సు సరే, మరి కవిత్వము??



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు