Guide (1965)

 


చాలా యేళ్ళ తరువాత Guide సినిమా చూసాను. ఆర్‌.కే. నారాయణ్‌ గారి The guide (1958) నవల ఆధారంగా తీయబడ్డ సినిమా ఇది. 

కథ మూడు పాత్రల మధ్య నడుస్తుంది. నృత్యకారిణి, దేవదాసి అయిన రోజీ, ఆమె భర్త మార్కో, కథకి హీరో రాజు. ఈ పాత్రల స్వభావాలు, స్వభావాల్లోని మార్పులు- మానవ మనస్తత్వాలను పరిస్థితులు ఎలా ప్రభావితం చేస్తాయో చాలా సహజంగా చూపిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా రాజులో జరిగే మార్పులు, మామూలు జీవితం నుండి ఉన్నత స్థితికి వెళ్ళడం, అక్కడనుండి పతనం చెంది చివరకు అనుకోకుండా ఒక సదాశయం కోసం ప్రాణత్యాగం చేయడంతో ముగుస్తుంది. మనిషి జీవితంలోని వివిధ దశలను చూపించడంలో ఈ సినిమా కథ ఒక గొప్ప స్థాయిని అందుకుంది. 

కథ హక్కుల కోసం ఆర్‌.కే.నారాయణ్‌ వద్దకు ఖరీదైన కారులో వచ్చారుట దేవానంద్‍. చెక్కు బుక్కు తీసి ఎంత కావాలో వ్రాసి ఇస్తానని దేవానంద్‍ అంటే, సినిమా హిట్టయ్యాక ఇవ్వండని నారాయణ్‌ అన్నారట. ఇంత అద్భుతమైన సినిమా, కథ తన కాలానికన్నా ముందుండడం వల్ల (పేరు వచ్చినా) ఆర్థికంగా విజయం సాధించలేక పోయింది. దాంతో కథ ఇచ్చిన నారాయణ్‌ గారికి ఒక్క పైసా ముట్టలేదుట! ( దేవానంద్‍ తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఈ సినిమా తీసారుట.) ఇది హాలీవుడ్‌ లో తీయబడి, అమెరికాలోను విడుదలైంది, 1965 లోనే. 

ఈ సినిమాకు ఇంకో ముఖ్యమైన ఆకర్షణ అద్భుతమైన సంగీత సాహిత్యాలున్న పాటలు. ఆజ్‌ ఫిర్‌ జీనే కీ తమన్నా హై, నైనా లాగేరే, తేరే మేరే సప్నే అబ్‌ ఏక్‌ రంగ్‌ హై, గాతా రహే మేరా దిల్‌  లాంటి అమృతంలాంటి పాటలు, ఒకదానిని మించినవి ఒకటి ఈ సినిమాలో ఉన్నాయి. ఒకే సినిమాలోని అన్ని పాటలు అద్భుతంగా కుదరడం ఓ విచిత్రం. S.D.బర్మన్‌ సంగీత దర్శకత్వంలో, శైలేంద్ర సాహిత్యంతో, రఫీ,లత,కిషోర్‌ కుమార్‌ ల గాత్రాలతో సృష్టింపబడ్డ ఈ అమృత గుళికలు 100 greatest Bollywood soundtracks జాబితాలో చోటు చేసుకోవడం విశేషం. 

దేవానంద్‍ గొప్ప ఆకర్షణ కలిగిన కథానాయకుడు. ఈ సినిమాకు కథ హీరో అయితే ఆ కథలోని హీరోగా సరిగ్గా సరిపోయిన వ్యక్తి దేవానంద్‍. 

సినిమా YouTube లోను, ఇంకా ఇతర మాధ్యమాల్లోను లభిస్తోంది. వీలైతే చూడండి. 

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? - 5