వినరా వేమా!
ఇవాళ ఈ ఊళ్ళో పోతూ పోతూ ఉంటే మేడి చెట్టు కనిపించింది. వెంటనే -
మేడిపండు జూడ మేలిమై ఉండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిఱికి వాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ
అన్న వేమన్న పద్యం గుర్తొచ్చేసింది. భలే పద్యం కదూ?
పద్యం మంచిదే. కానీ ఈ పోలికలో ఓ తిరకాసు ఉంది.
ఏంటదీ?
చెబుతా విను. పద్యంలో పోలిక ఏమిటి?
నిగనిగలాడే చక్కని మేడి పండు = పిఱికి వాడు
పండులోని పురుగులు = వాని మదిలోని బింకము
పిఱికి వాడు అంటే పిఱికి వాడని మనకు కనిపిస్తున్న వాడు మంచి నిగనిగలాడే పండు ఎలా అవుతాడు? చక్కగా బింకంగా ఉండడాన్ని పురుగులతో ఎలా పోలుస్తారు?
పిఱికివాని మదిని బింకమీలాగురా అంటే, “ పైకి పిఱికిగా కనిపిస్తూ లోపల బింకంగా ఉండే వాడు” అన్న అర్థం వస్తోంది ఇక్కడ. చూసావా?
అవును.
కానీ, వేమన్న చెప్పదలచుకున్నదేమిటి?
“పైకి బింకంగా కనిపిస్తున్నా లోపల పిఱికి వాడు” అని కదా?
మరి పద్యంలో అందుకు వ్యతిరేకంగా ఉంది. గమనించావా?
ఇప్పుడు పద్యంలో పోలిక ఎలా ఉండాలంటే-
నిగనిగలాడే చక్కని మేడి పండు = పైకి బింకంగా కనిపించే వాడు
పండులోని పురుగులు = లోపల మాత్రం పిఱికి తనం
కానీ, “పైకి బింకంగా కనిపించే పిఱికి వాడు” అన్న అర్థంలో రావాలంటే పద్యంలో ఇమడ్చడం కుదరకో, అందుకు సరైన పదం లేకో, వేమన్న ఇలా సరి పుచ్చేసి ఉంటాడని నా అనుమానం.
నిజమేరా. చిన్నప్పటినుండీ ఈ పద్యం చదువుకోవడమేగానీ ఇలాంటి సందేహం నాకెప్పుడూ రాలేదు. బావుంది నీ విశ్లేషణ. అలా తెలుగు వెలుగు హోటెల్లో టీ తాగుతూ మాట్లాడుకుందాం పద.