అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 1
ఈ కవులందరికీ ఎన్నెన్ని అవార్డులో చూసావా?
నాకేంట్రా ఒక్క అవార్డూ రావడం లేదు?
రేయ్, పువ్వుల మీదా ఆకుల మీదా రాస్తే అవార్డులు రావు.
పువ్వులు ఆకులే వస్తాయి.
మరి?
అవార్డులు రావాలంటే నీకో ఎజెండా ఉండాలి.
ఎజెండా ఉంటే టూత్‌బ్రష్ మీద కూడా కవిత్వం రాసి అవార్డులు కొట్టొచ్చు!
అవునా? అదెలా?
చెబుతా విను.
కచ్చికతో
పళ్ళు తోమే నాచేతిలో
కుచ్చుల కుంచె పెట్టి
కుచ్చు టోపీ పెట్టావు కదరా
బహుళజాతి కుక్కా!
ఇలా రాయాలి. తెలిసిందా?
కుచ్చుల కుంచె ఏమిటి?
అంటే టూత్ బ్రష్ కి తెలుగు అన్న మాట.
అయ్య బాబోయ్! మరి కుక్కా నక్కా అంటున్నావేంటీ?
అలాగే ఆవేశంగా రెచ్చిపోవాలి. అప్పుడే నీకు అవార్డులొస్తాయి.
ఇందుకోసం నువ్వు మంచి మంచి తిట్లు ప్రాక్టీస్ చెయ్యాలి. ఓకే?
ఆవేశమే కాకుండా సెంటిమెంట్లు కూడా బాగా పండుతాయి.
నేను పొద్దున్నే
టూత్ బ్రష్తో
పళ్ళు తోముతుంటే
దూరాన పల్లెలో
తల్లి పేగు కదలాడింది
యాప పుల్ల
యాది లేదా నాయనా
అన్న ఆ తల్లి ప్రశ్న నాలో
తన్నుకులాడింది
ఇలాగ సెంటిమెంట్ కూడా మనం టూత్ బ్రష్ తో పండించొచ్చన్న మాట. తెలిసిందా?
పళ్ళు తోమడం ఏమిటి? తల్లి పేగు ఏమిటి?
సంబంధం ఏమైనా ఉందారా??
సంబంధం సారాయి ఏమీ అక్కర లేదు.
పోపు వేసినట్టు మధ్య మధ్యలో తల్లి పేగు, పేగు బంధం, మట్టి వాసన, పల్లె తల్లి, బువ్వ, చట్టిలో చద్దన్నం, గంజి నీళ్ళు - ఇలాంటి పదాలను flavor కోసం అక్కడక్కడా వెయ్యాలి. తెలిసిందా?
ఇంకా,
నా చేతిలో
పదుంపుల్ల పెట్టి
నువ్వు మాత్రం
టూత్ బ్రష్ తో
తోమావు కదరా!
తరతరాల తోముడులో
నీ పళ్ళు తెల్లబడ్డాయ్
నా పళ్ళు పచ్చబడ్డాయ్!
ఎన్నాళ్ళిది ఎన్నాళ్ళు?
బాంచెత్!
ఇలా తిడుతూ రాసుకుంటూపోవాలి. సరేనా?
సరేగానీ, ఇందాక కవితలో టూత్ బ్రష్ ను తిట్టి పదుంపుల్లను పొగిడావ్, ఇప్పుడేంటి రివర్స్ గేర్‌లో వస్తున్నావ్?
ప్రపంచీకరణను తిట్టేటప్పుడు అలా రాయాలి,
ఇక్కడి హిందుత్వాన్ని తిట్టేటప్పుడు ఇలా రాయాలి.
ఓకే? అప్పుడు ఆ వాదం వాళ్ళు, ఈ వాదం వాళ్ళు ఇద్దరూ నీకు అవార్డులిస్తారు. అర్థమైందా?
ఇంకా చూడు-
ఏ పురాణం చూసినా
ఏమున్నది గర్వకారణం
మగాడి పళ్ళకి బంగారు టూత్‌బ్రష్షంట
ఆడదానికి మాత్రం వేపపుల్లే
ఏముందిలే ఆడదే కదా అని
ఆ పురాణాలు రాసినోడికీ చులకనే!
ఇలా రాయాలి. అప్పుడు ఈ వాదం వాళ్ళు కూడా నీకు అవార్డ్లిస్తారు. ఓకే?
ఏ పురాణంలో ఉందిరా ఇదంతా??
ఏ పురాణంలోనూ లేదు అని నిరూపించుకోవడం సాంప్రదాయవాదుల పని. మనం ఒక రాయి వేస్తాం అంతే. తెలిసిందా?
ఇప్పుడింకోటి విను-
అతడొచ్చాకే
మనకు టూత్బ్రష్ వచ్చింది
అతడొచ్చాకే
మనకు టూత్ పేస్టుకు
స్పెల్లింగు తెలిసింది
అందుకే అతడే అతడే
మన ఆత్మీయ డాడీ!
ఎవరా అతడు??
ఆంగ్లేయుడు.
ఆంగ్లేయుడా?? మన దేశాన్ని వందల సంవత్సరాలు దోచుకొని, ఇక్కడ కృత్రిమ కరువులు, కాటకాలు సృష్టించి లక్షలాది మంది చనిపోవడానికి కారణమై.. మన రక్తంతో వాడి సామ్రాజ్యాన్ని కట్టుకుని.. వాడిని బయటికి పంపడానికే కదరా స్వాతంత్ర్యోద్యమంలో అన్ని వేలమంది ప్రాణత్యాగం చేసింది? వాడు డాడీయా??
ఆగాగు. అంత ఆవేశ పడకు. అవార్డులు రావాలంటే మన సొంత అభిప్రాయాలు పనికి రావమ్మా. ఫ్లో లో వెళితేనే పేరు, పెంపు. నేను చెప్పినట్టు రాస్తే ఈ వాదం వాళ్ళు కూడా నీకు అవార్డ్ ఇస్తారు.
ఇక నీ ఇష్టం.
అవార్డుల కోసం నువ్విచ్చిన ఐడియాలకో నమస్కారం!
కోకిల ఎందుకు పాడుతుంది? పూలు ఎవరి కోసం పూస్తాయి?
నేనూ అలాగే నా ఆనందం కోసం నాకు నచ్చినట్టు కవిత్వం రాస్తా.
ఏ అవార్డులు నాకు రాకపోయినా పర్లేదురా!
ఏడిసినట్టే ఉంది నీ రీజనింగు. నీ వాలకం చూస్తుంటే ఇలాగే ఏ అవార్డులు రాకుండా మట్టిగొట్టుకు పోయేట్టున్నావ్!
నా మాట విను. మాటతో బాటు ఆటా పాటా కలిపావనుకో,
ఇంక నీకిక ఎదురు లేదంతే! ఏదో ఒక బీటు వాయిస్తూ, స్టెప్పు వేస్తూ,
నా పదుంపుల్ల లాక్కుంటివిరో!
నా బొగ్గుపొడి తీస్కుంటివిరో!
నా కచ్చిక పీక్కుంటివిరో!
నీ టూత్‌బ్రష్
నీ టూత్‌బ్రష్
నీ టూత్‌బ్రష్
నా సేతిలో బెట్టి పోతివిరో!
పారిన్ కొడకో
కార్పొరేటోడా!
ఇలా ఆవేశంగా చిందు వేస్తూ ఏదో అదృశ్య శక్తిని కొట్టడానికి వెళుతున్నట్టు జనం మీదికి ఎగిరెగిరి దూకితే చాలు, నీకు అవార్డు ఇవ్వడం కాదు, నీ పేరు మీదే అవార్డులు ఇస్తారు. తెలిసిందా?
ఇందాకట్నించీ చూస్తున్నాను, అవార్డులు అవార్డులు అంటున్నావ్, ఎవరిస్తార్రా అవార్డులు?
ఇంకెవరూ? ఆ టూత్‌బ్రష్షుల కంపెనీ వాడే!
టూత్‌బ్రష్షుల కంపెనీ వాడా? వాడెందుకిస్తాడు??
వాడంటే వాడు డైరెక్టుగా ఇవ్వడు.
ఈ వాదాల వాళ్ళందరూ స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ వద్దన్నా దేశానికి సేవ చేస్తూ ఉంటారు.
వాళ్ళిచ్చే అవార్డులను టూత్ బ్రష్ కంపెనీ వాడు sponsor చేస్తాడు.
వాడెందుకు చేస్తాడు??
చెయ్యక పోతే వాడి టూత్‌బ్రష్ తయారీ మీద కాలుష్యమని, పర్యావరణమని, ప్రమాణాలు పాటించడం లేదని ఏమేమో చెవాకులు ప్రచారం చేసి వాడి good will పోగొడతారని భయంతో వాడు వీళ్ళకి రౌడీ మామూలు ఇస్తుంటాడు. అదంతా వేరే కత. మనకనవసరం.
నీకు అవార్డు ఎలా వస్తుందో చూసుకో ఫస్టు.