అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 2
ఈ టూత్‌బ్రష్ కవిత్వం రాసి అవార్డులు సంపాదించాలా?
నావల్ల కాదురా!
సరే, అది వదిలి పెట్టు.
సామాజిక అంశాలు కొన్ని వేడి వేడి టాపిక్స్ ఉన్నాయి.
అవి ప్రయత్నించు. అవార్డులు గ్యారెంటీ. ఓకే?
అతడిని
ఫాలో అయ్యాకే
పురాతన అక్షి పోయి
మోక్షం మొలుచుకొచ్చింది
పునర్జన్మ పిలకలెత్తింది
అతడిని
ఫాలో అయ్యాకే
అహింస నాలో పేట్రేగింది
అతడే నాకు ముక్తిదాత
అతడే అతడే నా విధాత!
ఈ ఫక్కీలో రాసి చూడు. అవార్డు రాకపోతే నన్నడుగు.
ఎవరా అతడు??
బుద్ధుడు.
అంటే తెలీకడుగుతా, బుద్ధుడిని ఫాలో అయ్యాక వీళ్ళంతా వెజిటేరియన్లు అయిపోయారారా?
యజ్ఞాల్లో పశుబలి, జాతరల్లో జంతు బలి హింస.
అదే ఇంట్లోనో, హోటెల్లోనో కోసి వండి ప్లేట్లో పెడితే అది హింస కాదు. ఓకే? క్లారిటీ వచ్చిందా?
సరేరా. తెలీకడుగుతా, మరి బుద్ధుడు అహింస చెప్పాడు కదా,
ఆయన వెజిటేరియనేనా?
ఒరేయ్, అవార్డులు తెచ్చుకునే ఐడియాలు చెబుతుంటే రెటమతం ప్రశ్నలు వేస్తావే? బుద్ధుడు ధిక్కార స్వరానికి ప్రతీకన్న మాట. అర్థమైందా?
కావాలంటే రాముడిని ప్రశ్నిస్తూ కవిత్వం రాయి. నీకు అవార్డులే అవార్డులు.
అమ్మో! అవునా? ఎలా?
నీకు అవార్డులిచ్చే వారు రాముడిని పూజించరు, కాముడిని పూజిస్తారు.
అందుకని వాళ్ళు నీ కవిత్వానికి అవార్డులిస్తారు. ఓకే?
ఇంకా ఈ టైపులో రాయి-
మమ్మల్ని
ఆ జంతువును
తినొద్దనడం
పీడన!
ఈ పక్షిని
కొట్టకు అనడం
వివక్ష!
ఆ జంతువును
కొయ్యొద్దడనడం
అహంకారం!
…
ఇలా రాస్తూ పో. ఓకే?
ఇదీ ధిక్కార స్వరమే. దీనికీ అవార్డులొస్తాయి.
ఇంకా చేటా సంస్థ వారిని ఫాలో అయ్యి ఆ జంతువుని చంపొద్దు, ఈ పక్షిని రక్షించు ఇలాంటి థీమ్స్ లో రాయి. అవన్నీ అవార్డు విన్నింగ్ థీమ్స్.
అలాగా. మరి ఇందాక మాంసాహారాన్ని వెనకేసుకొస్తూ కవిత చెప్పావ్.
ఇప్పుడేంటి జంతువుల్ని కాపాడాలంటున్నావ్?
అదా, Context ను బట్టి ధిక్కార స్వరం మారుతుంది. ఓకే?
ఇంకో మంచి అద్భుతమైన ఐడియా ఇస్తా. నువ్వే ఓ జంతువు వేషం, పిల్లి అనుకో. ఆ వేషం వేసుకుని వీథిలో ఒక బోనులో కూచుని,
పిల్లినంటారు
ముద్దు చేస్తారు
మూడు పుటలా
ముద్ద పెడతారు
అయితే మాత్రం?
సాటి పిల్లులతో
ఆడుకోగలనా?
వీథి కుక్కలతో
పోట్లాడగలనా?
ఎవరితోనైనా
కాట్లాడగలనా?
ఎందుకీ జీవితం?
మాకూ న్యాయం కావాలి!
మాకూ న్యాయం కావాలి!
ఈ టైపులో కవితను ఎలుగెత్తి చదివావనుకో, నీకు అవార్డులే అవార్డులు. నువ్వు పిల్లిగా ఉన్న ఫొటో పేపర్లలో కూడా వేస్తారు!
ఇంకో విషయం మర్చిపోయా.
అవార్డులు రావాలంటే నీ కవిత్వంలో వచ్చిద్ది, పోయిద్ది, వస్తాంది, అంటాంది, ఎలిపోయొచ్చినవ్, యాదిమర్సినవ్ - ఈ టైపులో స్థానిక యాసలో రాయాలి. అది నేర్చుకునే పనిలో ఉండు.
వస్తుంది, పోతుంది ఇలా రాస్తే?
అలా రాస్తే అది బ్రాహ్మణ మనువాదం. ఓకే?
ఇంకో విషయం, ఆవకాయలకి, గోంగూర పచ్చళ్ళకి అవార్డులు ఇవ్వరు. నీ కవిత్వంలో దండిగా, ఎండు సాపలు, తలకాయ కూర, తొడకాయ కూర, మెడకాయ కూర - ఇలాంటివి వండితే అవార్డులు పండుతాయి.
ఓకే?
శివ,శివా! అసలెందుకు రాయాలిరా ఇవన్నీ?
నన్ను ప్రశ్నించడం కాదురా. నీ కవిత్వంలో ప్రశ్నించు. ధిక్కార స్వరం వినిపించు. అసలు కవి అన్న వాడు ఎప్పుడు ప్రశ్నిద్దామా అని పెన్ను పట్టుకుని రెడీగా ఉండాలి. బజారుకు వెళ్ళావనుకో, అక్కడ షాపులో చెగోడీలు చూసావనుకో, వెంటనే పెన్ను తీసి ప్రశ్నించాలి.
అమ్మ చేసేటి
చెగోడీలు
జేబుల నిండా
నింపుకోని
తొవ్వలో తినేటోల్లం
మురిపెంగా ఏలికి తొడిగి
కరకరా నమిలేటోల్లం
ఈ షాపులో చూడు
పైసలిచ్చి
అదానీ చేతి చెగోడీలు
కొంటాన్నాం!
అంబానీ చేసిన
జిలేబీలు తింటాండం!
రాజ్యం బూటుకాళ్ళ కింద
చెగోడీలు
పిండి పిండి
అవుతాన్నాయ్!
జిలేబీలు
జ్యూసు లేక
జావగారి
పోతాన్నాయ్!
ఇలా రాసేసి వెంటనే బ్రాందీ జ్యోతికో, విస్కీ ప్రభకో పంపేయాలి.
అంత ఫాస్ట్ గా స్పందిస్తేనే చలామణీలో ఉండేది, అవార్డులొచ్చేది. ఓకే?
నీ ఐడియాలకో దండం రా!
శ్రోత్రియః అకామహతః ద్రఢిష్టః బలిష్టః అని ఉపనిషత్ వాక్యం.
సదాచార సంపన్నత, నిగ్రహ శక్తి,శారీరక మానసిక ధృఢత్వము,బలము బ్రహ్మవిద్యకు అవసరమని ఆర్ష వచనం. ఇది కవికీ వర్తిస్తుందని నమ్ముతా.
నాయమాత్మా బలహీనేన లభ్యః
బలహీనులకు ఆత్మసాక్షాత్కారం లభించదు- బలహీనులకు ఉత్తమ కవిత్వము సిద్ధించదు. ఇదీ నా విశ్వాసం. అంతేరా.
ఏంటో ఒక్కముక్క అర్థమైతే ఒట్టు. అవార్డులొచ్చే మంచి మంచి ఐడియాలిస్తుంటే మృతభాషలో ఏమేమో ముత్యాలు రాలుస్తావే?
నువ్వింత ఛాందసుడివని అనుకోలేదు సుమీ.