అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 3

 


ఒక పని చెయ్యి, నా దగ్గర ఇంకో తిరుగులేని ఫార్ములా ఉంది. అది ఫాలో అయితే అవార్డులే అవార్డులు. ఓకే?

 అదే సెక్యులర్‌ శాంతిదూత కవిత్వం. దానికి తిరుగులేదంతే. 

ఉదాహరణకు- 


అతడు ప్రేమగా బిర్యానీ కలుపుతుంటే
ఉపనిషత్  వాక్యం గుర్తొచ్చింది
అతడు టకటకా కైమా కొడుతుంటే
 పురాణంలా వినిపించింది
అతడు మేకను కోస్తుంటే
అతనిలో నాకు ఈశ్వరుడు కనిపించాడు
పరమేశ్వరా! ఆ మేకను నేనైతే ఎంత బాగుండు! 

ఈ టైపులో రాయాలన్న మాట. ఓకే?

అలా రాస్తే తిడతారేమోరా??

ఎవ్వరూ తిట్టరు.ఇలా రాసి అలా ఫేక్‌బుక్‌లో పోస్టు చేయగానే, 

ఎంత బాగా చెప్పారు సార్‌! ఆ మేకను నేనైతే ఎంత బాగుండు! 
ఆ మేకను నేనైతే ఎంత బాగుండు! 
ఆ మేకను నేనైతే ఎంత బాగుండు! 
ఆ మేకను నేనైతే ఎంత బాగుండు! 

అంటూ కొన్ని వేల కామెంట్లు రాకపోతే నన్నడుగు. 

ఇది శాంతిదూత టైపు కవిత్వమని చెప్పాగా. అదే పంథాలో, 

అతన్నేమీ అనకండి
అతనికలా బోధింపబడింది
భగవంతుడా! అతను రాయితో కొట్టడానికి
నా తలను తన ముందు పెట్టనివ్వు!  
అతను నచ్చినట్టు బాదుకోడానికి
నా వీపును వినమ్రంగా వంచనివ్వు!
భగవంతుడా! అతను నా సోదరుడు
అతను నన్ను చంపుకోవడానికి ఒక్క అవకాశమివ్వు!



ఈ టైపులో అంతా ఆవేశపడుతున్న కల్లోల సమయంలో మనం ఇలా శాంతి పావురాలు ఎగరెయ్యాలి. అప్పుడిక అవార్డులే అవార్డులు. సరేనా?

కొంతమంది ఇది చదివి ఆవేశపడి ఆయాసం తెచ్చుకోవచ్చు. వాళ్ళకి సైతం కూల్‌గా కవిత్వంతో సమాధానం చెప్పాలి. 

అతన్నేమైనా చెయ్యాలంటే
నన్ను దాటివెళ్ళాలి
అతన్నేమైనా అనాలంటే
నన్ను తిట్టాలి
సోదరులారా! ఆవేశ పడకండి!
మనది బ్రాందీ మార్గం!
రండి! అతను కొట్టడానికి
మీ వీపులు అరువివ్వండని
అభ్యర్థిస్తున్నా!
ముకుళిత హస్తాలతో
మోకరిల్లుతున్నా!

ఈ రకంగా శాంతి దూత టోన్‌ కొనసాగించాలి. ఓకే? అప్పుడింక ఫేస్‌బుక్‌లో ఓట్లు గుద్దుకోడమే! 

ఓట్లేమిటి??

ఓట్లంటే లైకులు. ఓకే? ‌

శాంతిదూత అన్ని వర్గాలనూ కలుపుకుపోవాలి, అన్ని వాదాలను మెచ్చుకోవాలి. ఓకే? 

“అసలు రాముడున్నాడా?” టైపు నాస్తిక ఎడమ పుస్తకాలకు కూడా ముందుమాటలు రాసి మెచ్చుకుని రావాలి. అప్పుడు కొంతమంది అజ్ఞానులు విమర్శించడానికి వస్తారు. వాళ్ళకి కూడా అదే టోన్‌లో-

రామయ్యా! 
వీళ్ళు చూసావా?
నేను చేసింది తప్పంటున్నారు!
వీళ్ళకేం తెలుసు
మనం ప్రతిరోజూ రాత్రి
మాట్లాడుకుంటామని
నా భజన విననిదే 
నువ్వు నిద్రపోవని
పోరాటం నేర్పిన
రాముడంటే నాకు 
ప్రాణమని
వీళ్ళకేం తెలుసు? 

ఇలా అందరినీ కన్ఫ్యూజ్ చేసి అవార్డులు కొట్టేయాలి. సరేనా? 

శాంతిదూత విశ్వమానవుడని చెప్పాగా. 

అజర్ బైజాన్‌
మోహరాత్రులలో
ఎండు రొట్టెలు తిన్నాను
మెసపటేమియా 
ఎడారి ఇసుకలో
పండు ఖర్జూరాలు తిని
సేదతీరాను
ఈజిప్టు పిరమిడ్ 
సాక్షిగా
నేను విశ్వ మానవుడనని
ఎలుగెత్తి చాటాను!
మంగోలియా కవి
 చిన్‌ ఛాఛూ చెప్పినట్టు
ఎక్కడ పుడితే ఏం?
చచ్చాక అందరూ 
గోరీలోకే! 

ఈ మాదిరిగా ఎక్కడెక్కడి నానా దేశాల పేర్లు, ఎవరికీ తెలియని కవుల పేర్లు దొర్లిస్తూ ఉండాలి. ఓకే? 

నాది బ్రాందీ మార్గం
బ్రాందీ పూజలో 
ఒక పుష్పాన్నౌతా
బ్రాందీ భజనలో
ఒక శబ్దాన్నౌతా
బ్రాందీ వాదంలో
నేనొక సేవకుడినౌతా!

శాంతిదూత కవి ఇలా వక్కాణిస్తూ ఉండాలి. తెలిసిందా? 

తెలిసిందిరా! బాగా తెలిసింది!

ఏం తెలిసింది? 

ఈ శాంతిదూత కవిత్వమంతా బ్రాందీ మహిమ అని. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

ప్రచురింపబడే కథలను వండి వార్చడం ఎలా? -1

పద్యం కట్టిన వాడే పోటుగాడు