సోకు, దీని కాలికి మొక్కా!
మొన్నీ మధ్య భారతదేశానికి వెళ్ళినప్పుడు ఓ వేడుకలో మా బంధువే ఒకావిడ మీ నాన్నగారు ఇంతింత పెద్ద కళ్ళతో ఎంత అందంగా ఉండే వారో అన్నది చేతులతో పెద్ద కళ్ళను అభినయిస్తూ. ఆయన పోయి ఇరవై యేళ్ళు అవుతోన్నా ఆ స్త్రీమూర్తికి ఆ రూపం జ్ఞాపకాల్లో నిలిచిపోయింది పాపం.
నిజమే, పెద్ద కళ్ళు, కోటేరులాంటి ముక్కుతో సినిమా హీరోలా ఉండేవారు మా నాన్నగారు. కానీ, సంప్రదాయ బ్రాహ్మణులందరిలాగే తన అందం పట్ల ఖాతరీ కానీ, అందంగా ఉన్నానన్న స్పృహ గానీ లేని సరళ స్వభావి ఆయన.
సినిమాల్లో చక్కని అందమైన కళ్ళున్న ఏకైక హీరో ఎన్టీఆర్ గారే.
ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర! అన్నది వరూధిని ప్రవరాఖ్యుని కళ్ళను పరోక్షంగా పొగుడుతూ.
ఆడలేడి కళ్ళలో సుదక్షిణ కళ్ళను దిలీపుడు, మగలేడి కళ్ళలో దిలీపుని కళ్ళను సుదక్షిణ చూసుకున్నారట పరస్పరం, రథం మీద అడవిలో వెడుతూ, పక్కన ఆగి ఉన్న లేళ్ళను చూస్తూ. (రఘు వంశం)
కళ్ళలోనే అందమంతా ఉంటే, ఆ కళ్ళతోనే అందాన్ని చూడగలం.
సోకు, దీని కాలికి మొక్కా! అన్నాడుగా ఓ సినీ కవి
( ఏ సినిమా?, రచయిత?) ఆ మాటలో గొప్ప ఔన్నత్యం ఉంది.
మన వారు సౌందర్యాన్ని ఆరాధించడం, గౌరవించడం నేర్పి,
గుణః భూషయతే రూపం అని కూడా చెప్పారు.
గుణం వల్లే రూపం ఇనుమడిస్తుందని.