ఎవ్వరైనా కానీవోయ్! - 1
తాజ్‌మహల్ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
ఆహా! ఎంత బాగా చెప్పాడో కదా మహాకవి?
వినడానికి బానే ఉంది. కానీ లాజిక్ లేదు.
అదేంటి? అలా అనేసావ్?
ఆ అన్నది మహాకవి!
కావొచ్చు. విషయం ఎవరన్నారని కాదు.
అసలు ఎవడైనా కూలీ పనికి ఎందుకు వెళ్తాడు?
డబ్బు కోసం?
కదా. వీడు శ్రమ ఇచ్చాడు, వాడు డబ్బిచ్చాడు.
అయిపోయింది లావాదేవీ.
డబ్బూ ఇచ్చి, పేరు కూడా కూలీకే ఇవ్వాలంటే ఎలా చెప్పు?
దీన్నే కొంచెం వివరంగా చెబుతా విను.
ఎవరైనా తాజ్ మహలో, రాజ్ మహలో ఎందుకు కట్టిస్తారు బోల్డంత డబ్బు ఖర్చు పెట్టి?
పేరు కోసం!
కట్టిన వాడికి కూలీ, కట్టించిన వాడికి పేరు.
ఇప్పుడా డబ్బూ కూలీకి ఇచ్చి,
పేరు కూడా కూలీకే రావాలంటే
ఆ కట్టించే వాడు ఎందుకు కట్టించాలి?
ఇంకొంచెం వివరంగా చెబుతా విను.
చాలా డబ్బు ఖర్చు పెట్టి నువ్వో ఇల్లు కట్టించావనుకో. ఫలానా సుబ్బారావు గారిల్లు ఎంత బావుందండీ? అని ఎవరైనా అంటే, అబ్బే, ఆయనేమన్నా రాళ్ళెత్తడా? సిమెంటు మోసాడా? ఆ ఇల్లు కట్టింది మాఊళ్ళో కూలీలు. అంటే నీకెలా ఉంటుంది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్
అది మోసిన బోయీలెవ్వరు? కూడా డిటో.
బోయీలు కూలీకి వచ్చిన వారు. మోసినందుకు వారికి డబ్బు ముడుతుంది. వారు పేరు కోసం రాలేదు. డబ్బు కోసం వచ్చారు.
పల్లకీ కొనుక్కుని, డబ్బిచ్చి అది ఎక్కి వచ్చేవాడు పేరు కోసం వచ్చేవాడు. ఆ పేరు కూడా కూలీలకే అయితే ఆ పల్లకీ ఎందుకు? కూలీలకు డబ్బివ్వడం ఎందుకు?
నువ్వు చెప్పేది బానే ఉంది కానీ కవిగారి ఉద్దేశ్యం సామాన్యుని జీవితం చరిత్రకెక్కాలననుకుంటా.
ఈ రాణీ ప్రేమ పురాణం
ఆ ముట్టడికైన ఖర్చులు
ఇవి కావోయ్ చరిత్రసారం! అన్నాడందుకే.
చూడు సుబ్బారావు, రాణీ గారి ప్రేమ పురాణంలో ఎన్నో మలుపులు,సాహసాలు,సౌందర్యాలు ఉండి మనసును రంజింపజేస్తాయి.
సామాన్యుడి జీవితంలో ఏముంటుంది? మూడు వేలు కట్నం తీసుకుని మేనత్త కూతుర్ని పెళ్ళి చేసుకున్నా అని కథ రాస్తే ఏముంది అందులో? అందరి కథల్లో అదో కథ.
ఇంతకీ సామాన్యుడికి కూడా సినిమాల్లో పెద్ద పెద్ద సెట్టింగులతో గొప్ప గొప్ప కథలే కావాలి. అక్కడ కూడా తన జీవితాన్నే చూపిస్తే వాడే చూడడు!
“ఆ ముట్టడికైన ఖర్చులు” దేశానికి అవసరం. యుద్ధంలో ఎంత నష్టం వచ్చిందో, ఎంత ఖర్చు అయిందో ప్రజలకు అవసరం.
నీ ముక్కుపొడుం డబ్బా నెలసరి ఖర్చులు ఎవడికి కావాలి?
అది కాదయ్యా, సామాన్యుని జీవితాన్ని చరిత్ర గుర్తించలేదంటున్నాడు మహాకవి. అందుకే,
నైలునదీ నాగరికతలో
సామాన్యుని జీవనమెట్టిది? అంటున్నాడు.
సామాన్యుని జీవితంలో చరిత్రకు ఎక్కగలిగేవి ఏముంటాయి చెప్పు.
పొద్దున్నే నిద్ర లేచాను. పళ్ళు తోమాను, ఇడ్లీ తిన్నాను. అని రాస్తే దానిలోంచి స్ఫూర్తి పొందడానికి ఏముంది?
అదే గొప్పవారి చరిత్ర వ్రాస్తే అందులో,
సాహసం,పట్టుదల,వ్యూహం, చతురత,పూనిక,ధైర్యం,
సదాచార సంపన్నత,నిష్ట,దైవ భక్తిలాంటి గొప్ప గుణాలు ఎన్నో ఉండి సామాన్య ప్రజలకు ప్రేరణ అవుతాయి. సామాన్య కుటుంబంలో పుట్టి మాన్యుడైతే అతనూ చరిత్రలోకి ఎక్కుతాడు. సామాన్య కుటుంబాల్లో పుట్టి చక్రవర్తులు,పండితులు,మహా యోగులు అయి చరిత్రకు ఎక్కిన వారు ఎందరో ఉన్నారు. చరిత్రలోకి ఎక్కడానికి గొప్పతనమే గీటురాయి.
కవిగారు చెప్పినట్టు కేవలం సామాన్యుడవడమే అర్హత కాదు.
మరి, చారిత్రక విభాత సంధ్యల
మానవ కథ వికాసమెట్టిది? అంటున్నాడు కవి.
నీ ఉద్దేశ్యంలో సామాన్యులకు చరిత్రలో స్థానమే లేదా?
ఎందుకు లేదు? మహారాజు గురించో, చక్రవర్తి గురించో వ్రాస్తే ఆయన పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారా? ఆ రాజు పన్నులతో ప్రజలను పీడించాడా? కన్నబిడ్డల్లా పాలించాడా? బావులు,చెరువులు తవ్వించాడా? అతని పాలనలో కరువు కాటకాలతో ప్రజలు అల్లాడారా? లేక అన్నపానీయాలకు లోటు లేకుండా సంతోషంగా ఉన్నారా? రాజు దేవాలయాలు అవీ కట్టించి కళాకారులను ఆదరించి కళలను పోషించాడా? ఇత్యాది తెలుస్తాయి. అదే చరిత్రకు ఎక్కిన సామాన్యుని జీవనం.
అందుచేత సామాన్యుని జీవనం చరిత్రకు ఎక్కలేదనడం అసంబద్ధం.