ఎవ్వరైనా కానీవోయ్‌! - 2

 


మరి కవి గారు ఈ కవిత ఎందుకు రాసినట్టు?

చెబుతా విను. 

తాజ్‌మహల్‌ నిర్మాణానికి
రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?  అన్నది వినగానే నీ ఊహకు వచ్చేది ఏమిటి?

ఎవరో వెనుకనుండి అదిలిస్తుంటే, కొరడా పట్టుకుని నిలబడితే పెద్ద పెద్ద బండరాళ్ళను మోస్తున్న బక్కచిక్కిన కూలీలు. అవునా?

ప్రభువెక్కిన పల్లకి కాదోయ్‌
అది మోసిన బోయీలెవ్వరు? అనగానే, 

చేతి వేళ్ళనిండా ఉంగరాలతో, పెద్ద బొజ్జతో, పల్లకీలో ఓ ధనవంతుడు 
సుఖంగా కూర్చుని ఉంటే పాపం డొక్కలెండిన కూలీలు 
నలుగురు ఆ భారీకాయాన్ని మోస్తూ ఉన్న దృశ్యం. అవునా? 

మేం రాళ్ళెత్తితేనే వీళ్ళకు భవనాలు, మేం పల్లకీలు మోస్తే వీళ్ళు వాటిలో దర్జాగా తిరుగుతున్నారు అని ఆ శ్రమజీవులకు అనిపిస్తుంది ఇది చదివితే. అవునా? 

సరిగ్గా ఈ ఊహ రావాలనే, 

చిరకాలం జరిగిన మోసం
ధనవంతుల పన్నాగాలు
ఇంకానా ఇకపై చెల్లవు! అని నినదిస్తున్నాడు మహాకవి. 

అయితే ఒకటి ఆలోచించు. 
కూలీలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నా ఇల్లు కట్టించుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. అంటే కూలీలకు పని లేదు. నిరుద్యోగం ప్రబలిపోయి ఉంది. ఆకలి కేకలు వినవస్తున్నాయి. అప్పుడు హఠాత్తుగా ఓ షరాబు ఓ పెద్ద మహల్‌ కట్టించడానికి బయలు దేరాడు. అప్పుడు మళ్ళీ కూలీలందరి ఇళ్ళలో పొయ్యి వెలిగింది. 

అంటే ఏమిటి? నీకు పని వచ్చి ఉంటే చాలదు. 
ఆ పనికి విలువ కట్టి ప్రతిఫలం ఇచ్చేవాడు కావాలి. 

డబ్బిచ్చి పల్లకీ ఎక్కేవాడు లేకపోతే పల్లకీ మోసే బోయీలు ఈగలు తోలుతోవాలి.  

ఇది పట్టించుకోకుండా,

నరజాతి చరిత్ర సమస్తం 
దరిద్రులను కాల్చుకు తినడం!  అంటున్నాడాయన ఆవేశంగా. 


ఎందుకు ? మహాకవికి ఆమాత్రం తెలియదా? 

కవులు ఊహాజీవులు. ఆదర్శవాదులు. అందుచేత, ధనవంతుల దగ్గరే, బలవంతుల దగ్గరే శక్తి అంతా పోగుపడి ఉండడం అన్యాయమంటున్నాడు మహాకవి.  

ధనవంతుని ధనం అందరికీ పంచబడాలని, పేదల ఆకలి తీరాలని కలలు కంటున్నాడు. 


అదెలా సాధ్యం? 

 తను పట్టుకున్న  సిద్ధాంతం వెంట నడిచేవారికి మనమంతా బలం ఇస్తే వారంతా ఆ పంపిణీ పని చేస్తారని ఢంకా బజాయిస్తున్నాడు. 

అందుకే,

కనబడలేదా మరో ప్రపంచపు 
అగ్ని కిరీటపు ధగధగలు! 

అని ఇక్కడినుండి మరో ప్రపంచానికి ఆశ చూపిస్తున్నాడు కవి. 

ఇది విని మనమూ ధనవంతులమైపోవచ్చునని శ్రమజీవులు అపోహ పడడం సహజమే. 

ఒక వ్యక్తిని మరొక్క వ్యక్తి
పీడించే సాంఘిక ధర్మం
ఇంకానా ఇకపై సాగదు! అన్న కవి గారి మాటలకు, 

సమానత్వం వచ్చేస్తుందని ఆనందించడం సహజమే. 


కానీ, విషయం అది కాదు. 

 మసక మసక చీకటిలో బ్రాడ్వేలో కాంచన మాలను ఆలోచిస్తూ తన సిద్ధాంతం పేపరును తిరగేసి పట్టుకున్నాడు మహాకవి. 

అది బీదవాడిని ధనవంతుడిని చేసి సమానత్వం సాధించడం కాదు.
ధనవంతుడిని బీదవాడిని చేసి సమానత్వం సాధించడం! 

చేతిలో నిండుగా సిరా పోసిన కలము, హృదయంలో మెండుగా ఆవేశము, మనసులో దండిగా మానవత్వము ఉండడం చేత, ఉడిపి శ్రీకృష్ణ విలాస్‌లో అటు చూస్తే బాదం హల్వా, ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ ఉండగా, 
వాటిని వదిలేసి,

ఏ వెల్గులకీ ప్రస్థానం? 
ఏ స్వప్నం? ఏ దిగ్విజయం!

అని వాపోతున్నాడు అమాయకంగా. 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

కుబెగ్గరేరా!