రామజోగి మందు కొనరే! (విరిగిన మనసుకు లేపనము)

  1.  నీ పోస్టులు నాకు నచ్చట్లేదు. 

      అందుకే  నిన్ను సోషల్‌ మీడియాలో బ్లాక్‌ చేసా. 

ఓ! అవునా! అయితే ఒక పని చేయి. ఒక గుంట గరిటె నిండా నీళ్ళు పొయ్యి. అందులో  ఒక మిల్లి గరిటెడు  ఉప్పు వెయ్యి. ఆ తరువాత అందులో దూకి చావు. 

2. నీకు నాకు కటిఫ్‌!

మంచిది. ఇకనించీ నీ దారి ఆర్కిటికా వైపు, నాది అంటార్కిటికా దిక్కు.

3. నేను responses మాత్రమే ఇవ్వగలను.

అవసరం లేదు. నీ responses అన్నీ అన్నవరం హండీలో వేసి ఇంటికి పోయి నిద్ర పో.

4. నేను నీతో కావాలనే పలకట్లేదు.

చాలా మంచి నిర్ణయం. నాక్కావలసింది అదే. Continue చెయ్యి.

5. నీ మాటలు నాకు నచ్చడం లేదు. అందుకే దూరం పెట్టా.

Thank you so much. నీకు నచ్చే మనుషుల్ని వెతుక్కుని వాళ్ళతో వడియాలు తింటూ హాయిగా బతుకు.

6. నిన్నటిదాకా నీ ప్రాణస్నేహితుడిని. ఇవేల్టినుండి కాదు.

ఎవరి ప్రాణాలు వారి వద్దే అట్టేపెట్టుకోవడం శ్రేయస్కరం. తూర్పుకి తిరిగి సూర్యభగవానుడికి దణ్ణం పెట్టు. 

7. నీ సిద్ధాంతాలు నా సిద్ధాంతాలతో విభేదిస్తున్నాయి. అందుకే నిన్ను ఉప్మాలో కరేపాకులా విస్సిరి అవతలేసా. 

అరే! నువ్వింత మంచివాడవని నాకు తెలియదు సుమీ! నీ బుర్ర అడ్డమైన సిద్ధాంతాల గడ్డి మేసి అస్తవ్యస్తంగా పనిచేస్తోంది. దానికింత గడ్డి పెట్టు. తవుడు, ఎండు గడ్డి కూడా పనిచేస్తాయి.

8. నేను నీకు స్నేహితుడినే, నీ శత్రువుకీ స్నేహితుడినే.

చాలా సంతోషం. నువ్వు వాడికే స్నేహితుడిగా ఉండు. 

9. నేను నీకు బంధువునే.  నాకూ,మీ నాన్నకీ పడేది కాదు. అందుకే నువ్వంటే నాకు చిన్నచూపు. 

మీ మాటల్ని బట్టి  మీ ముందు జన్మ గార్దభం అని తెలుస్తోంది. మీ పూర్వజన్మ పుణ్యవిశేషం ఏదో ఉండడం వల్ల నాకు బంధువు అయ్యారు. ఇటువంటి అక్కరమాలిన మనోభావాల వల్ల వచ్చే జన్మలో విజయవాడ సైడు కాలువలో  దోమగా పుట్టగలరు. జాగ్రత్త. 

10. నిన్ను ఆవేశంలో అనరాని మాటలన్నా. ఇంకా నీ గురించి చాలా బాడ్‌ చేసా. నన్ను క్షమించు.

పూర్వజన్మ కర్మ ఏదో ఇలా తీరింది అనుకుంటాను. పర్వాలేదు. 

మరి మనిద్దరం మళ్ళీ ఫ్రెండ్స్ అవుదామా?

ఎనక్కి తిరిగి నెల్లూరి దాకా నడుచుకుంటా పోతా ఉండు. 


పైన చెప్పిన పది కేటగిరీల వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే, మనసులో ఇలా పాడుకోండి- 

దారుణ మారణకాండకు
తల్లడిల్ల వద్దురా!
నీతి లేని జాతకాలు 
నేటినుంచి రద్దురా!

తరువాత ఇంటికి వెళ్ళి తలస్నానం చేసి, దేవుడి ముందు దీపం వెలిగించి రామజోగి మందు కొనరే! అన్న కీర్తన పాడుకోండి.

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

పద్యం కట్టిన వాడే పోటుగాడు

The side effects of సౌందర్య దృష్టి