తెలుగు మహా గాడిదల సంఘము
తెలుగు మహా గాడిదల సంఘము అను సంస్థకి ప్రెసిడెంటు శాలువానందం, సెక్రెటరీ శునకానందంలు మీటింగ్ పెట్టుకుని ఆ సంవత్సరం ఎవరెవరికి వారి సంస్థ తరఫున సన్మానం చెయ్యాలా అని జాబితాను పరిశీలించసాగారు.
PGR: నేను మాఫియా సినిమాలే తీస్తా.
నా ఇష్టం.
నేను దెయ్యాల సినిమాలే తీస్తా.
నా ఇష్టం.
నేను భూతాల సినిమాలే తీస్తా.
నా ఇష్టం.
నేను వివాదాస్పద సినిమాలే తీస్తా.
నా ఇష్టం.
నేను నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా.
నా ఇష్టం.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా.
నా ఇష్టం.
అంతా నా ఇష్టం.
శాలువానందం: ఈసారి PGR ని సన్మానితుల జాబితాలో వేస్తున్నా.
నా ఇష్టం.
అచ్చిబుచ్చి అషాఢభూతి: నేను తెలుగు పద్యాన్ని కుడినించి ఎడమకి, ఎడమనించి కుడికి, పైన్నుంచి కిందకి చెప్తా. ఈ విద్యని అడ్డం పెట్టుకుని తెలుగువాళ్ళున్న అన్ని దేశాలు తిరిగి అనేక బిరుదులు, సన్మానాలు పొందా.
తెలుగు ఆంబోతు శేఖర, తెలుగు దున్నపోతు రాజా, తెలుగు వాయస శిరోమణి ఇలా ఎన్నెన్నో బిరుదులు పొందా. సభలేని రోజు నాకు నిద్ర పట్టదు. సన్మానం జరగని రోజు నాకు అన్నం సహించదు.
ఇంకా నేను ఎంతోమంది దొంగ గురువులకు సన్నిహితుడిని.
నా గురువులైన దొంగ గురువుల్లాగే నేను పైకి వేదాంతం,లోపల వ్యామోహం.
అయినా వ్యామోహం లేని ప్రాణి ఎక్కడుంది చెప్పండి?
అంతా మాయ. జగమే ఆవకాయ.
శాలువానందం: ఆషాఢభూతి గారి కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిన జల్లుకోవాలని ఉందయ్యా.
తాతాచారి: నేను బ్రౌన్‌ని తిడుతూ వ్యాసాలు రాసా. అధర్మాన్ని, అడ్డగోలుతనాన్ని బతక నేర్చినతనంగా చెప్పే కథలు గొప్పవని ప్రచారం చేసా. తెలుగేవిటి తెలుగు? నా బొంద. అని ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చా. రామాయణంలోని రాక్షసులు, భారతంలో కౌరవులు నాకు మంచి స్నేహితులు. వారి స్ఫూరితో ఎన్నెన్నో రచనలు చేసా. చేస్తా.
శాలువానందం: తాతాచార్ల వారికి సన్మానం చెయ్యాలని మనసు తహతహలాడుతోందయ్యా.
అచ్చ ఇంగ్లీష్ అవధాని ఆదెయ్య: ఈ అచ్చ ఇంగ్లీష్ అవధానానికి ఆద్యుడిని నేనే. ఈవిధానం అంతా ముడ్డి కింద వేసుకుని కూర్చున్నా.
ఎవ్వరికీ చచ్చినా నేర్పను. నేర్పితే నా మార్కెట్ పోదూ? దీన్ని అడ్డం పెట్టుకుని అన్ని ఖండాలూ తిరిగా. దీన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో సన్మానాలు అవీ పొందా.
మీరంతా నా భాషాసేవ గుర్తించి నన్ను ధాంబికశ్రీ, ధంభ రత్న, అసూయాభూషణ్, ఈర్ష్యా విభూషణ్ మొదలైన పెద్ద పెద్ద అవార్డులకు recommend చెయ్యాలి. చెయ్యకపోతే మీదే పాపం. అన్నట్టు WhatsApp లో నేను రోజూ పంపే నా సన్మాన సత్కార ఆకుకూర మెస్సేజులు అందుతున్నాయి కదా? అందకపోతే చెప్పండి, మళ్ళీ పంపుతా.
శాలువానందం: ఆహా, ఎంత గొప్పవాడు? ఏమి భాషాసేవ? ఆహాహా! వీరికి మన సంస్థ తరఫున సన్మానం చెయ్యలేకపోతే మన జన్మ వృధా.
శునకానందం: బావుంది సార్! సన్మానానికి అవార్డులుద్దామా? రివార్డులిద్దామా? పోనీ రెండూ ఇస్తే గ్రాండ్‌గా ఉంటుంది కదా.
శాలువానందం: అవార్డులిస్తే పారేసుకుంటారు. రివార్డులిస్తే వాడేసుకుంటారు. ఎర్రగా కాల్చిన కొర్రుతో చెరికో పిర్ర మీద చెరికో వాత పెడదాం. బాగా గుర్తుండి పోతుంది. ఏమంటావ్?
శునకానందం: వాటె వండర్‌ఫుల్ ఐడియా సార్! మన సంస్థ అకౌంట్ కింద ఒక దాని మీద TMGS అని మన సంస్థ పొడి అక్షరాలు, రెండో దాని మీద మన సంస్థ లోగో తెలుగు గాడిద గుర్తు వచ్చేటట్టు- రెండు కొర్రులు పర్మినెంటుగా ఉండేటట్టు చేయిపించి పెడతా.ముందు ముందు మనం చేయబోయే సన్మానాలగ్గూడా పనికొస్తయ్యి అన్నాడు ఉత్సాహంగా.