కాపర్‌ స్టార్‌ కి కరెంట్‌ షాక్‌

 


బంతి బాబు: సార్‌, మనం మనం తెలుగు వాళ్ళం అన్జెప్పి నిన్న ఇండియన్‌ స్టోర్‌లో ఎంతో ఆప్యాయంగా పలకరించడమే కాకుండా ఫోన్‌ నెంబరు తీసుకుని ఇవాళ ఇంటికి కూడా వచ్చారు. 

చాలా సంతోషం సార్‌! 

బిజినెస్‌ బాబు: దాన్దేముందండీ. మనం మనం తెలుగు వాళ్ళం. 
మీతో ఒక అద్భుతమైన బిజినెస్‌ ఐడియా డిస్కస్‌ చేద్దామని మీ ఇంటికొచ్చా. 
ఇండియన్‌ స్టోర్‌లో మిమ్మల్ని చూసినప్పుడే గమనించా. 
మీ మొహంలో లక్ష్మీ కళ ఉట్టిపడుతోంది.

బంతి బాబు: అంతా మీ అభిమానం సార్‌! 

బిజినెస్‌ బాబు: చూడండి బంతి బాబు గారు, రాబోయే ఐదేళ్ళల్లో మిమ్మల్ని మీరు ఎక్కడ చూడాలనుకుంటున్నారు? మీకు ఎన్నో కోరికలు ఉన్నాయి. Am I correct?

ఇదిగో చూడండి, ఈ పేపర్‌ మీద చూపించి వివరంగా చెప్తా, మీకు క్లియర్‌గా అర్థం అవుతుంది. 

మీరు ఒక సొంత ఇల్లు కావాలనుకుంటున్నారు, అవునా?
 చూడండి, ఇల్లు బొమ్మ గీస్తున్నా. 
ఓకే, ఇల్లు. ఎంతౌతుంది?
 $ *** K అనుకోండి. 
చాలా పెద్ద అమౌంట్‌ కదా. 

నెక్స్ట్ కారు. 
ఐదేళ్ళల్లో మంచి లగ్జరీ కారు.
కారు బొమ్మ గీస్తా. 
దానికి  ఎంతౌతుంది? 
$ ***K  అనుకోండి. 
అది కూడా చాలా పెద్ద అమౌంట్‌. 

ఇలా చెప్పుకుంటూ పోతే ఐదేళ్ళల్లో మీరు సాధించాల్సిన స్టేటస్‌కి చాలా డబ్బు కావాలి. అవునా? 

బంతి బాబు: అవును,సార్‌.నిజమే.

ఇప్పుడు మీ ఆదాయమెంతో చూద్దాం. 

మీ జీతం ఎంతో చెప్పండి. 

బంతి బాబు: చెప్తా సార్‌.
              $****K వస్తుంది సార్‌. 
          అందులో $***K ఇండియాలో పేరెంట్స్ కి పంపిస్తాను సార్‌.


బిజినెస్‌ బాబు: ఓకే. మిగిలింది $****K. 
అందులో మీ ఖర్చులు పోనూ మిగిలేది ఇన్ని డాలర్లు. 

ఈ డబ్బుతో మీరు ఐదేళ్ళల్లో  సొంత ఇల్లు కొనలేరు. 
ఓ గోడ కట్టించగలరు. 

లగ్జరీ కారు కొనలేరు. 
నాలుగు టైర్లు కొనగలరు. 

హహహ, జోక్‌ చేసా. 

నేను చెప్పదలుచుకున్నదేమిటంటే మీ మిగులు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెంచుకుని మీ కలలన్నీ నెరవేర్చుకోగలిగే ఒక అద్భుతమైన బిజినెస్‌ ప్లాన్‌ నా దగ్గర ఉంది. 
 
దాని పేరే “కాపర్‌ స్టార్‌”. 
నేను ఈ బిజినెస్‌లో ఇరవై యేళ్ళుగా ఉన్నా. 
ఏదో ఉద్యోగం చేస్తున్నా గానీ,  నా మెయిన్‌ ఇన్‌కమ్‌ ఇదే.

కాపర్‌ స్టార్‌ బిజినెస్‌ మోడల్‌ చాలా సింపుల్‌. 

ముందు మీరు పది వేల డాలర్లు డిపాజిట్ కడితే మీకు పది చీపుర్లు ఇస్తాం. వాటి ధర ఒక్కొక్కటి వెయ్యి డాలర్లు.
 
పదిమందిని మన మెంబర్స్గా చేర్చి ఆ చీపుళ్ళు వాళ్ళకి  అమ్మారనుకోండీ, అమ్మిన ఒక్కో చీపురునుండీ మీకు 10% వస్తుంది. వాళ్ళు ఇంకో పదిమందిని మెంబర్స్ చేసి అమ్మారనుకోండీ, వాళ్ళనుండి 5% మీకు వస్తుంది.
 వాళ్ళు మళ్ళీ పదిమందిని చేరిస్తే మీకు 2% వస్తుంది.
అలా network పెరిగిన కొద్దీ మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. 

మన బిజినెస్‌ కంప్లీట్ గా లీగల్‌. 
మెంబర్‌ కి చీపురు అమ్ము, కమీషన్ కుమ్ము. 
అంతే. సింపుల్! 

‌బంతి బాబు: అంతా బానే ఉంది గానీ, వెయ్యి డాలర్లకి చీపురెవరు కొంటారు సార్‌? 

బిజినెస్‌ బాబు: అదే మరి బిజినెస్‌ అంటే. క్లియర్‌గా చెప్పి ఒప్పించాలి, నేను ఇప్పుడు మీకు క్లియర్‌గా explain చేసి ఒప్పించలా. అలాగే. 

ఆలసించిన ఆశాభంగం!

వెంటనే పది వేలు కట్టండి.
 పది చీపుర్లు, మెంబర్‌షిప్‌ కార్డు ఇస్తా. 

బంతి బాబు: సరే సార్‌! అర్థమైంది. 

ముందు మనం కరిపించుకుని పదిమందిని కరవాలి. 
వాళ్ళెళ్ళి ఇంకో పదిమందిని కరుస్తారు. 

అంతేగా, సార్‌? బావుంది సార్‌. 

ముందు నా బిజినెస్‌ ప్రాక్టిస్‌ మీతోనే స్టార్ట్ చేస్తా. 

పెన్ను. పేపరు. ఓకే.

ఇంకో ఐదేళ్ళలో  మిమ్మల్ని మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు సార్‌? 
ఓకే. మీకు ఆల్రెడీ పెద్ద ఇల్లు ఉంది కాబట్టి, ఇంకా పే….ద్ధ ఇల్లు. 

బొమ్మ గీసి చూపిస్తా. 
ఒక పేపరు సరిపోవట్లేదు సార్‌. 
ఇంకో పేపరు అటాచ్‌ చేసి గీస్తా.
 ఓకే. ఈ ఇంటికి సుమారు $*****K కావాలి. 
ఓకేనా,సార్‌? 

ఇప్పుడు పే…… ద్ధ కారు.
ఇంకో పేపరు అటాచ్‌ చేసి గీస్తా. ఓకే. 
 దానికి $**** K కావాలి.

Next, మీ ఆదాయమెంత సార్‌? 

అంటే మీరు ఇప్పటి వరకు కరిచిన వాళ్ళు, 
వాళ్ళు కరిచిన వాళ్ళు, 
వాళ్ళు కరిచిన వాళ్ళు 
ఇలా సుమారు ఎంతమంది ఉండొచ్చు సార్‌? 

ఏంలేదు సార్‌, కమీషన్ల కింద ఎంత సంపాదించి ఉంటారో calculate చేసి పేపరు మీద రాస్తా. 

సార్‌.. సార్‌… సార్‌! ఏంటలా కోపంగా వెళ్ళిపోతున్నారు… 

సార్‌!సార్‌!సార్‌! 



ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

తాతాచారికి కన్నడ వడదెబ్బ

మన మతమసలే పడదోయ్‌!

పండుగంటే ఆరాధన