Phone call
పొద్దు పోక
ఏ స్నేహితునికో
ఫోన్ కలుపుతావు
పనికిరానివి
పని లేనివి
మాటలు
కొన్ని కొత్తవి
ఏవో పాతవి
శబ్దాధిష్ఠానాలతో
ఆ శబ్దానురాగాన్ని
సశబ్దపానం చేసే
ఓ కులాసాలో
మైమరపులో
రెండు మాటలు
దొర్లుతావు
రహస్యాలు కొన్ని
పర్వాలేదన్నట్టు
విప్పుతావు
ఒంటరితనాన్ని
పోగొట్టుకుంటున్న
చిరత్న ఘడియలలో
ప్రతిసారీ
నీకు తెలీకుండా
నీమీదకు నువ్వే
కొత్త ఉచ్చులు
విసురుకుంటావు
కొత్త పశ్చాత్తాపాలు
కోరి తెచ్చుకుంటావు
అదిగో,
వద్దు వద్దన్నా
ఏ స్నేహితునికో
ఫోన్ కలుపుతావు.