విశిష్ట భాష తెలుగు

 


ప్రపంచంలో ప్రతి సమాజంలోను భాష రెండు రకాలుగా ఉంటుంది. భాష స్పష్టంగా తన స్వరూపాన్ని చాటుకునే “శిష్ట భాష”. రకరకాల వ్యక్తుల స్థాయిలను, పరిసర ప్రభావాలను అనుసరించి వివిధ రూపాలుగా విక్షేపం చెందిన “గ్రామీణ భాష”. యాసలు, మాండలికాలు వంటివన్నీ ఈ కోవలోకే వస్తాయి. 

విద్య,పాండిత్యము ఎక్కువగా ఉండే ఉన్నత వర్గాలలో (Aristocrats) భాష తన స్వచ్ఛతను, స్వస్వరూపాన్ని సహజంగానే నిలుపుకుంటుంది. 

అందుచేతనే, దేశాధిపతులు,ఉన్నత అధికారులు,
పండితులు,మేధావులు కలిసినప్పుడు, వారి చర్చలలో, ప్రసంగాలలో, సభల్లో శిష్ట భాషే వినిపిస్తుంది. వార్తాపత్రికల్లో, పుస్తకాల్లో శిష్ట భాషే కనిపిస్తుంది. 

సభలో మాట్లాడ్డానికి నిలబడ్డ ప్రతి వ్యక్తీ సంస్కారవంతుడైతే, కష్టపడైనా సరే, శిష్ట భాషే మాట్లాడతాడు. మాట్లాడాలి. ఎందుకంటే శిష్ట భాష అనేది భాషాపరంగా ఆ సమాజం యొక్క అత్యున్నత నాగరికతకు,అభిరుచికి,పురోగతికి నిదర్శనం. 

అయితే, వివిధ యాసలను ఆనందించడం, వివిధ మాండలికాలను ఆస్వాదించడం,జానపద సాహిత్యాన్ని గౌరవించడం మన సంప్రదాయం. 

మరి ఇప్పుడు కొత్తగా భాషకు వర్ణం,కులం, ప్రాంతం,లింగభేదం వంటికి ఎందుకు ఆపాదిస్తున్నారు?  
నవీన వామపక్ష మేతావులు,సాహిత్యంలోకి ప్రవేశించిన ఉద్యమకారులు చేస్తున్న పని ఇది. 

పనిలో పనిగా శిష్ట భాష ను కొన్ని వర్గాలకు ఆపాదించి ద్వేషించమని చెబుతున్నారు. నువ్వు “ణ” ని “న” అని పలికితే “ణ” కు వచ్చే నష్టం ఏమీ లేదు. “ళ” ని “ల” అని పలికితే “ళ” కు సొమ్మేం పోదు. 
కానీ,కొన్ని వేల సంవత్సరాలుగా నీ భాషలో నీ ముందు తరాల వాళ్ళు పొదిగిన విలువైన అక్షరాలు పోతాయి. సుసంపన్నమైన నీ భాష కుంచించుకుపోతుంది. 

శిష్ట భాషలో అక్షరాలు నేను పలకలేను కాబట్టి దానికో కులాన్ని ఆపాదించి ఆ అక్షరాలను బంగాళాఖాతంలో విసిరి కొడితే, నీకు మిగిలేది విక్షేపం చెందిన భాషా ప్రతిబింబాలే. ఆ బింబాలు కూడా మళ్ళీ కొన్నాళ్ళకు కొట్టుకుంటాయి, నీ యాసాధిపత్యం నా మీద చూపిస్తున్నావు అంటూ. 

శిష్ట భాష,ప్రామాణికం. అది పూలదండలో దారంలా అన్ని యాసల వారినీ కలిపి ఉంచుతుంది. శిష్ట భాష రాకపోవడాన్ని, కొన్ని అక్షరాలు పలకక పోవడాన్ని అర్థం చేసుకోగలం కానీ ఫలానా వర్ణం,కులం,ప్రాంతం కారణంగా నేను పలకను, ఇలానే మాట్లాడతాను అంటే భాష యొక్క స్వస్వరూపాన్ని నిరాకరించడమే.


ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఎవ్వరైనా కానీవోయ్‌! - 1

అంచెలంచెలు లేని మోక్షము చాన కష్టము సోదరా!

అవార్డులొచ్చే కవిత్వం రాయడం ఎలా? - 4