త్వం శుంఠ! త్వం శుంఠ!
ప్రతి ఒక్కడూ అభిప్రాయాలు చెప్పేవాడేనండీ! అవును,బుర్ర ఉన్న ప్రతి ఒక్కడికీ ఒక అభిప్రాయం ఉంటుంది. అవకాశం వచ్చినప్పుడు చెప్పెయ్యాలని తహతహలాడుతుంటాడు! అసలు ఈ అభిప్రాయాలు ఎలా ఏర్పడతాయంటారు? వాళ్ళు పెరిగిన వాతారణం, వాళ్ళు చదివిన పుస్తకాలు, కలిసిన మనుషులు, చూచిన ఫిల్ములు ఇలా ఎన్నో ఎన్నెన్నో కలిసి అభిప్రాయాలను ఏర్పరుస్తాయి. ఈ అభిప్రాయాలు మారుతాయంటారా? ఓ!మనుషులు మారిపోయినట్టే అభిప్రాయాలూ తరచూ మారిపోతాయి! సోషల్ మీడియాలో ప్రతి ఒక్కడూ అభిప్రాయాలు చెప్పేవాడే! అవును, ప్రపంచ సమాచారపు వెల్లువలో నేను సైతం నా అభిప్రాయాన్ని వ్యక్తపరచాను! అన్నదే ఇప్పటి నినాదం! అభిప్రాయాలకు విలువ ఉంటుందంటారా? వ్యష్టి అభిప్రాయపు విలువ సమాజంలో ఆ వ్యక్తి స్థాయిని బట్టి ఉంటుంది. సమష్టి అభిప్రాయపు విలువ సమూహం యొక్క పరిమాణం మీద ఆధారపడి ఉంటుంది. సోషల్ మీడియాలో ఎంత అసభ్యకరమైన అభిప్రాయాలు వ్రాస్తున్నారో చూసారా? తన పేరు బయటికి రాదంటే మనిషిలోని అసలు మనిషి బయటికి వస్తాడు! అభిప్రాయాలను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొచ్చంటారా? మనిషి ఏర్పరచుకున్న అభిప్రాయాలను బట్టే వ్యక్తిత్...