అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని!
సుబ్బారావు బండి మీద బీసెంట్ రోడ్‌లో వెళుతూ రోడ్డు మధ్యలో జనాలు గుంపులు గుంపులుగా ఆగిపోయి ఉండడం చూసి తనూ ఆగి చూసాడు. అక్కడో రోడ్డు ప్రమాదం! ప్రమాదంలో గాయపడ్డ బాధితులు రక్షించమని మూలుగుతున్నారు. కొందరు మంచినీరు ఇవ్వమని అడుగుతున్నారు. సుబ్బారావు వెంటనే సెల్ ఫోన్ బయటకు తీసాడు. అదంతా చక్కగా వీడియో తీసాడు. తర్వాత వేరే రూట్లో మెల్లిగా ఇంటికి పోయాడు. ఇంటికి పోయి తను రికార్డు చేసింది నీట్‌గా ఎడిట్ చేసి, బాగ్రౌండ్‌లో “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని” అన్న పాట పెట్టి సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోకి ఎన్నో వేల లైక్స్, కామెంట్స్. అన్నయ్య గారు, మీదెంత గొప్ప మనసండీ. ఆ ప్రమాదం జరిగినప్పుడు మేమూ అక్కడే ఉన్నాం. మనకెందుకొచ్చిన గొడవా అని మావారు నన్నూ పిల్లల్ని పక్కవీథిలోంచి తీసుకొచ్చారు అంటూ ఓ చెల్లాయి ఫోన్ చేసింది. మీరో హీరో! అంది మరో అమ్మాయి ఆరాధనగా. అలా ఎన్నో ప్రశంసలు వచ్చాయి సుబ్బారావుకి. మరోమాటు ఎవరో అత్యాచార బాధితురాలు. రోడ్డు మీద నిస్సహాయంగా అందరి సహాయము అర్థిస్తోంది. సుబ్బారావు వెంటనే ఫోన్ బయటకు తీసి అంతా వీడియో తీసి, ...